'నిన్ను కన్నా కానీ, నీ అలోచనల్ని కనలేదు'
ఆ ఇల్లాలికి సినిమా పిచ్చి. తిరుపతి వెళ్తే, ఏకబిగిన సినిమాలన్నీ చూడందే ఇంటికి రాదు. దీనికి ఆవు అడ్డమని ఆమ్మేయాలనుకుంది. అలా..: అమ్మ చెప్పిన ముచ్చట్లు -15
By : రాఘవ
Update: 2024-02-18 01:10 GMT
మా
అమ్మ చెప్పిన ముచ్చట్లు -15
వనపర్తిలో మాకు బర్రెలు (గేదెలు/ ఎనుములు) ఉండేవి. ప్యాలెస్ అవరణలో ఉన్నప్పుడు వాటిని ఎదురుగా ఉండే కారం పూల చెట్ల (పొగడ చెట్ల) కింద కట్టేసేవాళ్ళం. ఇంట్లో మనుషులు ఎక్కువ. మానాన్నకు వచ్చే జీతం చాలేది కాదు.
పశువుల కోసం ఒక మనిషిని పెట్టుకున్నాం. అతను బర్రెల్ని మేపుకొచ్చేవాడు. అతనే ఇంటింటికీ తీసుకెళ్ళి పాలు పోసొచ్చేవాడు. అతను ఎంత చేసినా ఇంటి చాకిరితోపాటు గొడ్ల చాకిరీకూడా మా అమ్మపైన పడేది.
పాలు పితకడం, దాణా కలపడం, మేత వేయడం, కుడితి పెట్టడం వంటి వన్నీ మా అమ్మే చేసేది. పాలు పితుకుతున్నప్పుడు బర్రెలకు ఈగలు కుడితే, అది తోకో, కాలో విదిలించేవి. పితికిన పాలు కాస్తా ఒలికిపోయేవి. అందు కోసం మా నాన్న టవలు పుచ్చుకుని ఈగల్ని తోలేవాడు.
బర్రెలు కూడా ఎక్కువ కాలం లేవు. కొద్ది కాలమే. సహజంగా 'గొడ్డు చాకిరీ’ అంటాం. వ్యవసాయంలో ఎద్దులు, గానుగలో దున్నపోతులు చేసే చాకిరి నుంచే ఈ మాట వచ్చిందనుకుంటా. గొడ్ల దగ్గర చేసే చాకిరీ అంతకు మించిన చాకిరీ. నిజానికి గొడ్ల దగ్గర చేసే చాకిరీ కూడా గొడ్డు చాకిరీనే. ఆ గొడ్డు చాకిరీ అంతా మా అమ్మే చేసేది.
మా తాతల కాలం వరకు వ్యవసాయం ఉండేది. మా నాన్న కాలంలో ఉద్యోగాలలో స్థిరపడి, ఊళ్ళు పట్టుకుని తిరగడంతో, నాకు ఊహ తెలియక ముందే పొలాలను అమ్మేసుకున్నారు. వ్యవసాయంతో పాటు పాడి కూడా దూరమైంది. వ్యవసాయ కుటుంబాలు కాస్తా ఉద్యోగ కుటుంబాలైపోయాయి. పట్టణ, నగర జీవులైపోయాం.
మళ్ళీ తిరుపతి వచ్చినప్పుడు కొంత కాలం మళ్ళీ మా ఇంట్లో పాడి పశువులు వచ్చాయి. నాలుగున్నర దశాబ్దాల క్రితం తిరుపతి దక్షిణ శివారులో చేల మధ్య పెంకుటిల్లు కట్టుకున్నాం. పెద్ద స్థలం. ఇంటి చుట్టూ చెట్లు పెంచాం.
ఎగూరులో ఒక ఇల్లాలికి వ్యవసాయంతో పాటు, ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఆ ఇల్లాలికి సినిమాలంటే చాలా ఇష్టం. ఆరోజుల్లో టీవీలు లేవు. తిరుపతికి వెళ్ళిందంటే, ఏకబిగిన రెండు మూడు సినిమాలు చూడందే ఇంటికి తిరిగొచ్చేది కాదు.
ఆమె సినిమాలకు వెళ్ళినప్పుడు అవుకు మేత వేయడం, కుడితి పెట్టడం సమస్యగా తయారైంది. ఆ అవును మూడు వందల రూపాయలకు మాకు అమ్మేసింది.
మా ఇంటికి వచ్చిన ఆవు మళ్ళీ ఈనడం, దాని సంతతి పెరగడం చాలా వింతగా ఉండేది. ఆ ఆవు మేతకు వెళ్ళి తిరిగొచ్చేస్తే, కట్టేసి మేత, కుడితి పెడితే చాలు, మా ఇంట్లో పాలు కొనాల్సిన అవసరం ఉండేది కాదు.
ఆ ఆవు అలనా పాలనా మా అమ్మతో పాటు నేను కూడా చూసేవాణ్ణి. వనపర్తిలో పశువుల దగ్గర మా అమ్మకు నేను సాయం చేయలేదు కానీ, తిరుపతిలో మాత్రం మా అమ్మతో పాటు నేను కూడా పశువుల దగ్గర పనిచేసేవాణ్ణి.
ఆవుకు పాలుపితకడం మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. వనపర్తిలో లాగా పశువులను చూసుకోవడానికి మనిషిని పెట్టుకోలేదు. అన్ని పనులూ నేను, మా అమ్మే చేసే వాళ్ళం. ఎనుములను కడిగే వాణ్ణి.
తల్లీ కొడుకులు అవును చూస్తున్నారు కదా అని, మా నాన్న రెండు గేదెలను కూడా కొనుక్కొచ్చాడు. వాటిపైన వచ్చే ఆదాయం కంటే వాటికి చేసే చాకిరీ చాలా ఎక్కువ.అప్పుడిది పల్లెటూరు. "ఏమ్మా సన్నపడిపోయినావు?” అని ఒకామెని మరొకావిడ అడిగిందట. “ఎనుమును పట్టకొచ్చినాను లేమ్మా" అందట. అలా ఉంటుంది. పశువుల దగ్గర చాకిరీ.
పెరట్లో చాలా చెట్లు పెట్టాం. వాటికి పాదులు చేసి, బావిలోంచి నీళ్ళు చేది పోసేవాణ్ణి. వారానికొకసారి చెట్ల కింద చీపురు పుచ్చుకుని ఊడ్చే వాణ్ణి. “ఏం సామీ..నువ్వూడుస్తాండావు” అన్నది ఆ దారిన పోయే తెలిసిన ఆమె. “అవును నేనే ఊడుస్తున్నాను” అనే వాణ్ణి. “మగ పిలకాయవు కదా! అందుకుని అడుగుతుండాలే” అన్నదామె తను వేసిన ప్రశ్నకు తానే సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు.
ఇలాగే ఊడుస్తున్నప్పుడు మరొకావిడ కూడా అడిగింది. అక్కడే ఉన్న మా అమ్మ “మగ పిల్లవాడైనంత మాత్రాన చీపురు పుచ్చుకుని ఊడుస్తుంటే, మగతనానికి ఏం భగం కలగదులే” అంది మా అమ్మ. పాపం వాళ్ళకేమీ అర్థమైనట్టు లేదు. ఆమె వెళ్ళిపోయింది. పనికి అడేమిటి? మగేమిటి?
మా అమ్మకు పెద్ద వయసొచ్చింది. వంటింటి నుంచి విముక్తి పొందింది. నేను ఉద్యోగం నుంచి రిటైరయ్యాను. పాత సినిమా పాటలంటే మా అమ్మకు చాలా ఇష్టం. టీవీలో పాత సినిమా పాటలొస్తుంటే వాటితో గొంతకలిపేది. చెవులకు ఇయర్ ఫోన్లు పెట్టుకుని సెల్ పోన్లలో పాటలు వినేది. భానుమతి పాటలంటే చాలా ఇష్టం.
నొనొక్కణ్ణి చెట్ల దగ్గర పనిచేస్తుంటే మా అమ్మ మనసు విలవిల్లాడిపోయేది. తను చేయలేకపోతున్నానని బాధపడిపోయేది. నేను చెట్ల దగ్గర పనిచేస్తుంటే, వరండాలో కూర్చున్న మా అమ్మ 'పనిచేయడం ఈ పూటకు చాల్లే' అనేది. చీకటి పడకముందే 'చీకటి పడుతోంది ఇంక చాల్లే వచ్చేయ్' అనేది.
నేను వినకపోయేసరికి ఒక సారి 'విప్రనారాయణ' సినిమాలోని భానుమతిపాటను గుర్తు చేసుకుంది. 'ఎందుకోయి తోట మాలి అంతులేని యాతనా!' అన్న పాటలో 'తోటమాలి'ని తీసేసి నా పేరు పెట్టి ఇలా పాడింది. 'ఎందుకోయి రాఘవ శర్మ అంతులేని ఈ యాతనా! ఇంటి కోసం నీవు చేసే పనులన్నీ తపోధనా' అని పాడేది.
వరండాలో కూర్చున్న మా చెల్లెళ్ళు 'చాల్లే అన్నయ్యా. నీవు పనిచేస్తుంటే అమ్మ బాధపడిపోతోంది. చాల్లే వచ్చేయ్' అనే వాళ్ళు. సందర్భాన్ని బట్టి పాత పాటల బాణీలో ఏదో ఒకటి పాడేది సరదాగా.
ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు వేశాం. జామ, దబ్బ చెట్టుతోపాటు కొన్ని పూల మొక్కలను కూడా వేశాం. ప్రతి మొక్క ను, ప్రతి చెట్టును చాలా శ్రద్ధగా గమనిస్తుండేది మా అమ్మ. ఒకకొబ్బరి చెట్టు పక్క వాళ్ళమెట్ల పైకి వాలిపోయి వాళ్ళకు ఇబ్బంది కలుగుతోంది. కొబ్బరికాయలు రాలి వాళ్ళ మెట్ల మీద పడేవి. మా అమ్మ బతికున్నంత కాలం ఆ కొబ్బరి చెట్టును కొట్టకుండా కాపాడాం. ఏ చెట్టునూ కొట్టనిచ్చేది కాదు. మా అమ్మ పోయిన తరువాత ఆ చెట్టును కొట్టేయించాం.
"ఒక్కొక్క కొబ్బరి చెట్టు ఒక్కొక్క కొడుకుతో సమానం" అనేది. కొబ్బరి చెట్లను కొడుకులతోను, పూల చెట్లను కూతుళ్ళతోను పోల్చుకునేది.
రంగనాయకమ్మ గారి జీవిత సహచరులు బాపూజీ గారు ఒక మంచి సలహా ఇచ్చారు. "పేరు వెనక ఉన్న కులం పేరు నేను తీసేశాను. సర్టిఫికెట్లలోనే కాదు, ఇతర డాక్యుమెంట్లలో కూడా మాన్పించు కున్నాను. మీరు కూడా తీసేయవచ్చు” అన్నారు.
నిజమే ఇది చాలా మంచి నిర్ణయం. ఈ విషయంలో నాకు ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది. నా అసలు పేరు వదిలేసి చివరి పేరుతోనే అంతా పిలవడం అలవాటైంది. అందరికీ పరిచయం అయ్యాక కులం పేరు తీసేసినా, ఆ కులం పేరుతోనే పిలుస్తారు. ఆ పని తొలుతే చేసి ఉండాల్సింది.
నాకు తెలిసిన ఒకరిద్దరు చిన్న వయసులోనే కులం పేరును తీసేసి, కులం పేరు లేకుండానే అందరికీ పరిచయం అయ్యారు. కానీ, సర్టిఫికెట్లలో, ఆస్తుల డాక్యుమెంట్లలో కులం పేరును కొనసాగిస్తున్నారు.
అయినా నష్టమేం లేదు. కానీ కుల సంఘాలతో సంబంధాలు, కుల సంఘాలతో ప్రయోజనాలు, కులం బలంతోనే అధికార రాజకీయలు చెలాయిస్తున్న వారిని చూస్తే 'తలలు బోడులైన తలపులు బోడులౌనా' అన్న వేమన మాట గుర్తు కొస్తుంది.
రంగనాయకమ్మ గారి బాపూజీ గారు లాంటి వారిని ఈ గాటన కట్టలేం. వారి చిత్త శుద్ధిని శంకించలేం.
విద్వాన్ విశ్వం గారి గురించి పురాణం సుబ్రమణ్య శర్మ గారు ఒక మాటరాశారు. 'మనం కులాల పేర్ల పడవలెక్కి, ఇళ్ళ పేర్ల పడవలెక్కి ప్రయాణం చేయడానికి అలవాటు పడ్డాం. ఆ అవసరం విశ్వంగారికి లేదు.” ఎంత మంచి మాట.
ఈ మాట నన్ను చాలా కాలంగా వెంటాడుతోంది. విశ్వం గారు తాను చదువుకున్న విద్వాన్ ను ఇంటిపేరును చేసుకున్నారు. తన పాత పేరులో ఉన్న విశ్వం అనే ప్రపంచాన్ని తన పేరుగా చేసుకున్నారు.
నా రచనల్లో ఇంటి పేరును తీసేశాను. 'శర్మ' అన్న పేరును కూడా తీసేసుండాలి. " 'శర్మ' అన్న ఈ దిక్కుమాలిన పేరు ఎందుకు పెట్టావమ్మా" అని ఒకసారి మా అమ్మను అడిగాను. "నిన్ను కన్నాను కానీ, నీ అలోచనలను కనలేదు” అన్నది మా అమ్మ.
మా అమ్మ మాటకు ఆశ్చర్యపోయాను. ఆ మాటకు అర్థమేమిటి!? 'నీకు తల్లిని కానీ, నీ అలోచనలకు కాదు. నీ అలోచనలు నీ ఇష్టం' అన్న అర్థం ధ్వనించింది నాకు.
ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, నా ఆలోచనలకు మా అమ్మ ఏనాడూ అభ్యంతరం చెప్ప లేదు, అడ్డు తగల లేదు. ఒక్కనా విషయంలోనే కాదు, మిగతా పిల్లల విషయంలో కూడా. మా అమ్మ చాలా ప్రజాస్వామిక వాది. మా అమ్మ లాగా ఎంత మంది ఉంటారు!?
(ఇంకా ఉంది)