28న ఎండ్లూరి సుధాకర్ స్మారక సాహిత్య సభ

తెలుగు దళిత సాహిత్యంలో ఎండ్లూరి సుధాకర్‌ది విశిష్ట స్వరం. దళిత సాహిత్యంలో మాదిగ ప్రత్యేక స్వరం వినిపించిన తొలికవి.

Update: 2024-01-25 06:08 GMT
ఫోటో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సౌజన్యం

ప్రముఖ కవి, ప్రఖ్యాత సాహితీవేత్త , హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ (1959 జనవరి 21 - 2022 జనవరి 28) రెండో వర్ధంతిని పురస్కరించుకొని స్మారక సాహిత్య సభను జనవరి 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఒంగోలు శ్రీనగర్ కాలనీ లోని డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు విజ్ఞాన భవన్లో నిర్వహించనున్నట్టు జానుడి- సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ నూకతోటి రవికుమార్  ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సభలో ముఖ్య వక్తలుగా ప్రముఖ కవయిత్రి గంగవరపు సునీత, బెంగళూరుకు చెందిన సాహితీవేత్త నాతాని హనుమంతరావులు పాల్గొని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.

 కవులు,సాహిత్య అభిమానులు పాల్గొనాలని ఆయన కోరారు.

నిజాంబాద్ నుంచి సాహిత్య ప్రస్థానం మొదలు

సుధాకర్ నిజామాబాద్ లోని పాత బస్తీలో 1959 జనవరి 21న జన్మించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శటీలో ఎం.ఎ, ఎంఫిల్ చేశారు. తర్వాత పొట్లి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పరిశోధన పూర్త చేశారు. తెలుగు ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి హైదరాబాద్ విశ్వివిద్యాలయం లో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా ఉండినారు. వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్ల ద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి తదితర పుస్తకాలు రశారు.

ఎండ్లూరి గురించి జీలుకర శ్రీనివాస్ నాలుగు ముక్కలు

తెలుగు దళిత సాహిత్యంలో ఎండ్లూరి సుధాకర్‌ది విశిష్ట స్వరం. ఆయన కవితా విన్యాసం అందరినీ ఆకర్షించింది. కులం, దాని వికృత రూపాన్ని ఆయన తన కవిత్వంలో తీవ్రంగా నిరసించిండు. హైదరాబాదులో పెరిగాడు కాబట్టి ఉర్దూ కవితా పరిమళగంధం తనకు బాగా అబ్బింది. ఉర్దూ గజల్‌, రుబాయిల సొగసు తనను సమ్మోహితుణ్ణి చేసింది. వాటిలోని కవిత్వ వైభవాన్ని ఆయన బాగా వొంటపట్టించుకున్నాడు. అయితే, ఆయన రాసిన కవిత్వంలో ఎక్కడా వాటి ఘాటువాసన తగలనీయడు. తన దళిత అస్తిత్వ సంస్కృతి నుంచి తీసుకున్న సంజ్ఞలు, ఉపమ, రూపకాలే ఎక్కువగా వుంటాయి. అవే అతని కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. అయితే, యితర భాషాదళిత సాహిత్యంలో కనపడని మరో విశిష్టత తెలుగు దళిత సాహిత్యంలో కనిపిస్తుంది. యింకా స్పష్టంగా చెప్పాలంటే, తెలుగు దళిత కవులు ఈ దేశానికి యిచ్చిన కానుక అది. అదే మాదిగ సాహిత్యం.

దళితులంతా ఒకే రకంగా లేరని, వారిలోని బహుళత్వాన్ని మాదిగ సాహిత్యం గుర్తించేలా చేసింది. ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ కోసం జరిగే పోరాటం దళిత కవిత్వం రాస్తున్న మాదిగలను తమ అస్తిత్వం గురించి ఆలోచించేలా చేసింది. ఆ క్రమంలోనే మాదిగ జీవితం, సంస్కృతి, ఉద్యమ అవసరాలను విడిగా అర్థం చేసుకొనే ఒక అనివార్యత ఏర్పడ్డది. ఆ క్రమంలో వర్గీకరణ అవసరాన్ని తెలియ చేసే రచనలు చాలా మంది మాదిగ కవులు చేశారు. వాళ్లందరిలో ఎండ్లూరి సుధాకర్‌ ప్రథముడు అనాలి. ఆయన ఎలాంటి గందరగోళం లేకుండా తన వైఖరిని ప్రకటించాడు. వర్గీకరణీయం, కొత్త గబ్బిలం సంకలనాలు రిజర్వేషన్ల హేతుబద్దీకరణను బలపరుస్తాయి. అయితే, మాదిగల సామాజిక సాంస్కృతిక జీవితాన్ని కథలుగా ఆయన చెప్పిన తీరు ప్రత్యేకం. మల్లెమొగ్గల గొడుగు కథాసంకలనం విశిష్టమైనది. అలాంటి కథలు ఆయన తప్ప మరొకరెవరూ రాయలేక పోయారు. ఒక మాదిగగా అమెరికా వెళ్లినప్పుడు తను చూసిన విశేషాలను, తన అనుభవాలను ‘ఆటాజనికాంచె’ కవితా సంకలనంలో వ్యక్తం చేశాడు. దేశంలో జరిగే అనేక దుర్మార్గాలను ఆయన ఎప్పటికప్పుడు తన కవితల ద్వారా నిరసించాడు. ముజఫర్‌ నగర్‌ నుంచి మొదలుకొంటే పసిగుడ్డు మనీషా ఉదంతం వరకు జరిగిన దారుణాలను ఆయన తీవ్రంగా ఖండించాడు.

రాజమండ్రిలో ఆయన సుదీర్ఘకాలం ఉద్యోగం చేసిండు. అక్కడ తెలుగు బోధించే ఆచార్యునిగా కంటే, కవిగానే ఎండ్లూరి సుధాకర్‌ అందరికీ యిష్టం. సవర్ణ పండితులు వేసే కొంటే ప్రశ్నలకు, చేసే వెకిలి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్తూ ఆయన ఒకరకంగా ఒంటరి యుద్ధమే చేసిండు. బేతవోలు రామబ్రహ్మం అంటే ఎందుకోగాని తనకు ప్రత్యేకమైన అభిమానం వుండేది. బేతవోలు రామబ్రహ్మంకు కూడా ఆయన్ని అమితంగా యిష్టం. విద్వత్తుగలిగిన వారిని కుల, మతాలకు అతీతంగా అభిమానించే సహృదయత ఎండ్లూరి సుధాకర్‌ది అని ఆయన సారంగ  డిజిటల్ సాహిత్య వేదిక లో రాశారు.

Tags:    

Similar News