కౌసల్యను పెళ్లాడాకే దశరథుడు కోసలరాజయ్యాడు

రామాయణంలో నిరుత్తరకాండ-2. రాయమయంతో చెప్పని కథల మీద ప్రముఖ సాహిత్య విమర్శకుడు కల్లూరి భాస్కరం వ్యాస పరంపర

Update: 2024-06-15 02:30 GMT


దశరథుడు కోసలకు రాజే అనుకుందాం. అప్పుడతను కౌసల్యను వివాహమాడడం ఎలాంటి పరిస్థితిలో సాధ్యమవుతుంది? కౌసల్య కోసలరాజ్యానికి రాణి గానీ, యువరాణి గానీ కాకుండా; కేవలం ఆ రాజ్యానికి చెందిన ఓ సాధారణక్షత్రియకన్య అయినప్పుడు! ఇంకా చెప్పాలంటే, వర్ణధర్మాల ప్రకారం క్షత్రియుడు క్షత్రియకన్యనే కాక; తన కింది రెండు వర్ణాలవారినీ కూడా పెళ్లాడవచ్చు కనుక, కౌసల్య క్షత్రియకన్యే కానవసరం లేదు; వైశ్యకన్య, శూద్రకన్యా కూడా కావచ్చును.

కానీ ఇక్కడ కౌసల్య దశరథుని ముగ్గురు భార్యలలో పెద్దామె; ఆవిధంగా పట్టపురాణి. ఇక దశరథుని వంశం ఎలాంటిదీ? భూమండలం మొత్తాన్నే ఏలిన మనువు పరంపరకు చెందిన ఇక్ష్వాకువంశం. అటువంటి వంశానికి చెందిన కోసలరాజు ఒక సాధారణక్షత్రియకన్యనో, వైశ్యకన్యనో, శూద్రకన్యనో పెళ్లాడి ఆమెకు పట్టపురాణి హోదా కల్పించడం కనీసం ఊహించడానికైనా సాధ్యమయ్యేవిషయమేనా?

కౌసల్య, సుమిత్ర, కైకేయితో సహా దశరథుడికి మొత్తం 350 మంది భార్యలున్నారని రామాయణం చెబుతోంది. కౌసల్య మినహా మిగిలినవారు ఏదైనా ఒక రాజ్యానికి చెందిన యువరాణులు కావచ్చు; లేదా సాధారణక్షత్రియ, వైశ్య, శూద్రకన్యలైనా కావచ్చు; ఇబ్బంది లేదు. కానీ దశరథుడు పట్టపురాణిగా మాత్రం తన స్థాయికీ, తన వంశప్రతిష్ఠకూ తగిన కన్యను వరించడమే సహజమూ, స్వాభావికమూ. పైగా రాచకుటుంబాల్లో వివాహాలు వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో జరిగే దశ కాదది. రాచబంధువులూ, పురోహితులూ, మంత్రులూ, ఇతర పరివారమూ, చివరికి రాజ్యంలోని పౌరులు, జానపదులతో సహా ప్రతి ఒక్కరూ హర్షించి, ఆమోదించవలసిందే. కనుక ఎటువంటి ఆక్షేపణలకూ తావివ్వకుండా చూసుకోవడం రాజు వ్యక్తిగత, వంశగత పరువు ప్రతిష్ఠల రీత్యానే కాక; రాజకీయంగా కూడా ఒక అనివార్యత. అందుకే రాచకుటుంబాల్లో వివాహాలు ఒక్కోసారి ప్రాంతాల మధ్య దూరాలను, భాషల తేడాలను దాటి జరుగుతూ ఉంటాయి.

ఇందుకు ఉదాహరణకోసం కూడా మనం ఎంతో దూరం వెళ్లనవసరం లేదు; బాలకాండ, 68వ సర్గలోనే లభిస్తోంది. ఎలాగంటే, రాముడు శివధనుస్సును విరిచి సీతను పెళ్లాడే అర్హత పొందాడు. ఈ సంగతిని దశరథుడికి తెలియజేసి; వారి వివాహానికి అనుమతి కోరడానికీ, ఆయనను మిథిలానగరానికి ఆహ్వానించడానికీ అయోధ్యకు దూతలను పంపాలని జనకుడు అనుకున్నాడు. అందుకు తన పురోహితుడైన శతానందుని అనుమతి తీసుకున్నాడు. దూతలు అయోధ్యకు వెళ్ళి జనకుడు చెప్పమన్న మాటలు దశరథుడికి చెప్పారు. దశరథుడు సంతోషించి తన పురోహితులైన వసిష్ఠ, వామదేవులకు; మంత్రులకు ఈ విషయం తెలిపాడు. ఆపైన, “మహాత్ముడైన జనకుని ఆచారసంపత్తి మీకు నచ్చినట్లైతే ఆలస్యం చేయకుండా వెంటనే మిథిలానగరానికి వెడదా”మన్నాడు(యది వో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః/పురీం గచ్ఛామ్యహే శీఘ్రం మాభూత్కాలస్య పర్యయః). మంత్రులు, మహర్షులు అందరూ తప్పక అలాగే చేద్దామని అన్నారు. దశరథుడు సంతోషించి, రేపే ప్రయాణమవుదామన్నాడు.

అంటే, రెండు రాచకుటుంబాలు వియ్యమందే విషయంలో కూడా రాజులిద్దరూ సొంతంగా నిర్ణయం తీసుకోలేదు; పురోహితులను, మంత్రులను సంప్రదించి వారి అనుమతి కూడా తీసుకున్నారు. దశరథుడు కౌసల్యను పెళ్లాడేముందు కూడా ఇలాంటి తతంగమే జరిగి ఉంటుందన్నది నిస్సందేహం; పెళ్లినాటికి కౌసల్య సాధారణ క్షత్రియ, వైశ్య, శూద్రకన్య కాగల అవకాశాన్ని ఇది పూర్తిగా తోసిపుచ్చుతోంది. అంటే, పెళ్లినాటికే ఆమె దశరథుడి స్థాయికి అన్నివిధాలా తగిన రాణి; పైగా కోసలరాణి కూడా! కోసలరాజును పెళ్లాడింది కనుక ఆమె కోసలరాణే అవుతుంది కదా అన్న తర్కం ఇక్కడ కుదరదని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది పెళ్ళికి పూర్వరంగంలో జరిగినదాని గురించి; పెళ్లి తర్వాత జరిగినదాని గురించి కాదు.

దీనినిబట్టి ఏం తేలుతోంది!? కోసలరాచకుటుంబానికి చెందడమే కాక, అప్పటికే రాణిగా లేదా యువరాణిగా ఉన్న కన్యను ‘కోసలరాజై’న దశరథుడు పెళ్లిచేసుకున్నాడని! అంతకన్నా అపకీర్తి, అఘాయిత్యం, వైపరీత్యం ఇంకొకటి ఉండదు. కోసలరాజైన దశరథుడికి కోసలరాణి అయిన కౌసల్య సోదరి వరస అవాలి తప్ప వివాహానికి వరసయ్యే అవకాశం లేదు.

ఇలాంటి వైపరీత్యాన్ని నివారించడం ఎప్పుడు సాధ్యమవుతుంది? దశరథుడు కోసలరాజే కానప్పుడూ; కౌసల్యను పెళ్లాడిన తర్వాత మాత్రమే అతడు కోసలరాజు అయినప్పుడూ! అంటే, పెళ్ళికిముందు అతడు కోసలకు చెందిన ఒక సాధారణక్షత్రియుడో; లేదా అసలు కోసలకే చెందనివాడో కూడా అయుండవచ్చు. ఇలా ఊహించడమే ఉన్నంతలో అర్థవంతంగా కనిపిస్తుంది. కాపోతే, దశరథుడి విషయంలో తలెత్తినట్టే; కోసలరాణి అయిన కౌసల్యమాత్రం ఒక సాధారణక్షత్రియుడైన దశరథుని ఎలా పెళ్ళాడుతుందన్న ప్రశ్న ఇక్కడా తలెత్తేమాట నిజమే. పురుషుడికి వర్తించే అన్ని రకాల ప్రమాణాలూ స్త్రీకి వర్తించకపోవచ్చనీ; వ్యవస్థాభేదాలకు ఇక్కడ అవకాశముందని మాత్రమే ప్రస్తుతానికి సూచనప్రాయంగా దీనికి చెప్పుకోగల సమాధానం.

మొత్తానికి, దశరథుడికి కోసలరాజుగా పట్టం దక్కినది కౌసల్యను పెళ్లాడడం వల్లనే కానీ; అవ్యక్తంతోనూ, బ్రహ్మతోనూ మొదలుపెట్టి సూర్యుడు, మనువు, ఇక్ష్వాకువు(ఇంకా సగరుడు, దిలీపుడు, రఘువు) తదితర పురాణ, ఇతిహాసప్రసిద్ధులైన సూర్యవంశరాజుల వారసత్వంగా కాదు! ఎలా చూసినా దశరథుడు కోసలరాజ్యానికి అల్లుడే కావాలి తప్ప, ఆ రాజ్యానికి పైతృకమైన (పిత్రార్జితంగా సంక్రమించిన) హక్కుదారు కావడానికి అవకాశం లేదు.

***

కౌసల్య పేరుతో ముడిపడిన ఈ చిన్న సాంకేతికసూక్ష్మం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తోందో చూడండి. రామాయణమనే ఒక పెద్ద కట్టడానికి గట్టి పునాదిని ఏర్పరచినవాటిలో, మొత్తం భూమండలాన్ని ఏలిన, ఏలుతున్న ఇక్ష్వాకువంశానికి చెందినవాడిగా రాముణ్ణి చెప్పడం కూడా ఒకటి. ఆ వంశం ఘనతను రామాయణం పొడవునా కవి నొక్కి చెబుతూనే ఉంటాడు. ఉదాహరణకు, తను వాలిని వధించిన సందర్భంలో రాముడు ఆ చర్యను సమర్థించుకుంటూ; “పర్వతాలు, వనాలు, మహారణ్యాలతో కూడిన ఈ భూమి అంతా ఇక్ష్వాకువంశీకులకు చెందినదే. మృగాల్ని కానీ, పక్షులను కానీ, మనుషులను కానీ నిగ్రహించడం, అనుగ్రహించడం వంటి విషయాలపై ఇక్ష్వాకువంశీకులకే అధికారం ఉంది. ఈ భూమిని ఇప్పుడు భరతుడు పరిపాలిస్తున్నాడు...మేము భారతుని ఆజ్ఞ ప్రకారం, ధర్మాన్ని అతిక్రమించేవారిని ఓ కంట కనిపెడుతూ సంచరిస్తూ ఉంటాం” అంటాడు.

అలాగే, హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్ళేటప్పుడు, సముద్రుడు అతన్ని చూసి, “ఇక్ష్వాకుల వంశానికి చెందిన సగరుడి వల్లనే నేను అవతరించాను. అదే వంశానికి చెందిన రాముని కార్యం కోసం ఈ హనుమంతుడు విశ్రాంతి లేకుండా నా మీద ప్రయాణం చేస్తున్నాడు. అందువల్ల అతనికి కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తాను” అనుకుంటాడు.

రాముడు ఒకవైపు కిష్కింధరాజైన సుగ్రీవుని, లంకకు కాబోయే రాజైన విభీషణుని, చివరికి నిషాదరాజైన గుహుని సాటిరాజులుగా చూస్తూ స్నేహభావం చాటతాడు; ఇంకోవైపు మొత్తం భూమండలాన్ని పాలించే ఇక్ష్వాకుల ప్రతినిధిగా తనను భావించుకుంటూ వారిని తన అదుపాజ్ఞల కింద ఉండే సామంతులుగానూ పరిగణిస్తాడు. ఈ దృష్టిభేదం గురించి తగిన సందర్భంలో మరింత వివరంగా మాట్లాడుకోవచ్చు.

ఇప్పుడు దశరథుడు కోసలరాజు ఎలా అయ్యాడన్న ప్రశ్న ఈ ఇక్ష్వాకు వంశసంబంధమైన పునాదినే కదిలించేలా ఉంది...

***

పోనీ కౌసల్య-కోసల-కోసలరాజైన దశరథుల మధ్య తలెత్తిన ఈ సాంకేతిక వైరుధ్యానికి మనకు తెలియని సమన్వయం ఏదో ఉంటుందనే మాటవరసకు అనుకుందాం. ఇన్నేళ్లలోనూ అసంఖ్యాకులైన రామాయణవ్యాఖ్యాతలూ, ప్రవచనాకారులూ కనీసం ఇలాంటి సమస్య ఒకటి ఉందనైనా గుర్తించి, తమకు తోచిన పద్ధతిలో దీనిని సమన్వయించడానికి ప్రయత్నించారా? నా పరిశీలన మేరకు...లేదు! అన్నింటికన్నా ఎక్కువ ఆశ్చర్యం గొలిపేది అదే.

ఇంతకీ కౌసల్య ఎవరి కుమార్తె? వాల్మీకి రామాయణం ఆ వివరం ఇచ్చిందా? ఇతరత్రా కౌసల్య పాత్రచిత్రణ రామాయణంలో ఎలా ఉంది?

వాటి గురించి తర్వాత...




Tags:    

Similar News