వరంగల్ లో ‘తలుసుకుందాం - తెలుసుకుందాం’ ఫిబ్రవరి 18న

తలుసుకుందాం - తెలుసుకుందాం - 2 కిింద గత ఏడాది మరణించిన ఫ్రొఫెసర్ కందాళ శోభారాణి సంస్మరణ కార్యక్రమానికి అరసం వరంగల్ అందరినీ ఆహ్వానిస్తున్నది. ప్రొ. శోభారాణి ఎవరు?

Update: 2024-02-06 14:59 GMT


"తలుసుకుందాం - తెలుసుకుందాం" పేరున 2024 సంవత్సరంలో ప్రతినెల మూడవ ఆదివారం పూర్వ వరంగల్ జిల్లా దివంగత కవుల, రచయితల గురించి ఉపన్యాసాలు ఏర్పాటు చేసి వారి గురించి పూర్తి వివరాలు వరంగల్ సాహిత్య లోకానికి పరిచయం చేయుటకు అరసం వరంగల్ కార్యక్రమం ప్రారంభించింది.

ఆ క్రమములో ఫిబ్రవరి మూడవ ఆదివారం (18)న స్రీవాద సాహితీవేత్త , మానవ హక్కుల ఉద్యమ నేత, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకులు డాక్టర్ కందాళ శోభారాణి గారిని తలుసుకోవడం జరుగుతుంది.
డాక్టర్ కందాళ శోభారాణి గారితో చిరకాల అనుబంధం కల్గిన డాక్టర్ కొమ్రాజు రామలక్ష్మి గారు “శోభ జీవితం సాహిత్యం” గురించి తెలియజేస్తారు
డాక్టర్ రామలక్ష్మిగారి ప్రసంగం అనంతరము హాజరైన సాహితి మిత్రులు శోభ గారితో వారి జ్ఞాపకాలను పంచుకోవడం జరుగుతుంది. కవితల పఠనం, వాటిపై చర్చ ఉంటుంది.
సమయం:-తేదీ 18 ఫిబ్రవరి 20 24 ఉదయం 11 గంటలకు
స్థలం:-అరసం వరంగల్ కార్యాలయం (విజయ మెడికల్ స్టోర్ ) యూనివర్సిటీ సెకండ్ గేట్ ఎదురుగా, కరీంనగర్ మెయిన్ రోడ్ హన్మకొండ - వరంగల్
సాహితీ మిత్రులంతా హాజరు కావాలని అరసం కోరుతున్నది.

ఎవరు కందాల శోభారాణి ఎవరు?


 ప్రొ. కందాళ శోభారాణి వరంగల్  కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి, తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు.

విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.

మానవ హక్కుల వేదిక బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ఏర్పడ్డప్పటి నుంచి అందులో క్రియాశీల రచయిత్రిగా, సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తన బోధన, రచన, పరిశోధన, ఉపన్యాసం వంటి సాంస్కృతిక రూపాల్లో ఆమె సామాజిక సంబంధాలను కొనసాగిస్తున్నారు.

 అనారోగ్యానికి గురయ్యాక కూడా ఆమె అధ్యయనం, రచన విరమించుకోలేదు.  రచనను సామాజిక బాధ్యతగా నిర్వహిస్తూ వచ్చారు. 

ఆమె ప్రగతిశీల చైతన్యానికి గీటురాయి విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు’. దీన్ని ఆమె కేవలం అకడమిక్‌ పరిశోధనా దృష్టితోనేగాక పితృస్వామ్య వ్యతిరేక ప్రజాస్వామిక చైతన్యంతో ఈ కృషి చేశారు. స్త్రీవాదంతో సహా అనేక ప్రజాస్వామిక, విప్లవ పోరాటాల్లోని స్త్రీల కంఠస్వరాన్ని, వ్యక్తీకరణలను 1910లోకి వెళ్లి అక్కడి నుంచి స్త్రీల విమర్శనాత్మక దృష్టిని వెతుక్కుంటూ వచ్చారు. 

కందాళ శోభారాణి

ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ వికాసంలోని అనేక దారుల్లో స్త్రీలు నిర్మించిన దారి ఉన్నదని చెప్పడం ఆమె పరిశోధన ఉద్దేశం. స్త్రీలు అనుభవాలను పంచుకోవడం దగ్గరే ఆగిపోరని, వాటిని రాజకీయ, సిద్ధాంత స్థాయిలో విశ్లేషించగలరని, సామాజిక, సాంస్కృతిక చరిత్ర అధ్యయన పద్ధతిని ముందుకు తీసికెళ్లగలరని చెప్పడానికి ప్రయత్నించారు. ఈ పరిశోధన శోభారాణిలో ఒక మౌలిక పునాదిని సమకూర్చింది. అక్కడి నుంచి ఆమె చాలా సాహిత్య వ్యాసాలు రాస్తూపోయారు. 

గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడతూ 2023ఫిబ్రవరి 12న మరణించారు.

( వసంతమేఘం నుంచి)



Tags:    

Similar News