ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అమెరికాలో ఇంత ఆసక్తా!
ఒకప్పుడు కమ్యూనిస్టుల మీద ఓ జోక్ ఉండేది. రష్యాలో వానొస్తే ఇండియాలో గొడుగు పడతారని. ఇప్పుడు అదే సామెత అమెరికాలో ఉంటున్న మనోళ్లకి సరిపోతుందనుకుంటా.
By : A.Amaraiah
Update: 2024-06-07 02:50 GMT
2024 జూన్ 3వ తేదీ రాత్రి 9.35 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుమారు 240 మంది మనోళ్లు అమెరికా బయలు దేరారు. అందరూ చాలా హుందాగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ హవాను, గొప్పతనాన్ని చాటుకుంటూనే గుంభనంగా- వచ్చి రాని ఇంగ్లీషులో కొందరు, వచ్చిన ఇంగ్లీషులో మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు మాట్లాడలేని వాళ్ళు తమ సొంత భాషల్లో మూడో చెవిన పడకుండా గుసగుసలాడుకుంటున్నారు. విమానం కావడంతో 'లేని పెద్దరికాన్ని తెచ్చుకున్న' నాలాంటి వాళ్లు పెద్దగా ఏమీ మాట్లాడకుండా అందర్ని గమనిస్తూ ఇంగ్లీషు మర్యాదల్ని పాటిస్తున్నారు అరబ్బీ విమానంలో.
2024 జూన్ 4 తెల్లవారు జామున..
హైదరాబాద్ నుంచి బయలు దేరిన విమానం 3 గంటల 12 నిమిషాల పాటు ప్రయాణించి అర్థరాత్రి దాటిన తర్వాత దుబాయి విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ చెప్పే మూగసైగల్ని బట్టి (దుబాయ్ విమానాశ్రయంలో మైకులు ఉండవు. కనెక్టివిటి ఫ్లైట్స్ కి సంబంధించిన సూచనలు మాత్రమే ఎర్రటి అక్షకాల్లో రాసి ఉంటాయి. వాటిని బట్టి మనం పోవాలి) ఎవరెక్కాల్సిన విమానాల వైపు వాళ్ళు వెళ్లారు. ఎక్కువమంది మాత్రం గేట్ నెంబర్ 25 బీ వైపు వచ్చారు. అప్పటి వరకు ఖాళీగా ఉన్న కుర్చీలు ఒక్కొక్కటి నిండుతున్నాయి. టెక్సాస్ లోని డాలస్ లేదా డల్లాస్ వెళ్ళాల్సిన విమానం ఎక్కడానికి ఇంకొంక గంటకు పైగా టైమ్ ఉండడంతో కుర్చీలలో కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరుగా 'ముసుగులు' తీయడం మొదలు పెట్టి తమ 'లోపలి అచ్చమైన మనుషుల్ని' బయటపెట్టడం మొదలు పెట్టారు.
ఎన్నికల రిజల్ట్స్ వేళ విమానంలో...
ఇలా ముచ్చట మొదలుపెట్టిన వాళ్ళల్లో అటు శ్రీకాకుళం మొదలు ఇటు అనంతపురం వరకు, ఇటు ఆదిలాబాద్ నుంచి అటు చిత్తూరు వరకు అందరూ మనోళ్లే! అరగంటలో ఈ ముచ్చట్లు అలా- డ్యూటీ ఫ్రీ లిక్కర్ మీదుగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ మీదుగా కిషన్ రెడ్డి, నరేంద్ర మోదీ వరకు సాగాయి. సూటూ బూటు వేసుకున్న ఓ పెద్దాయన.. ఇంతకీ చంద్రబాబు గెలుస్తాడంటావా అనడిగితే ఇంకోయాన.. మనకి విమానంలో ఇంటర్నెట్ ఇస్తే బాగుండ్డు.. అనడం మొదలుపెట్టారు. ఇంతలో విమానం ఎక్కమని ఎమిరేట్స్ విమాన సిబ్బంది చెప్పడంతో ఈ ఎన్నికల గోల మర్చిపోయారు. అప్పటికే తెల్లవారు జాము మూడయింది.
ఆకాశంలోనే 16 గంటలు..
ఈ విమానం ఎక్కిన దగ్గర్నుంచి 15గంటల 44 నిమిషాల పాటు ఏకధాటి ప్రయాణం. 12,913 కిలోమీటర్ల దూరం. విమానం ఎక్కిన తర్వాత గంటకి అది 13వేల అడుగుల ఎత్తుకి చేరింది. గంటకి 9 వందల నుంచి 11 వందల కిలోమీటర్ల వేగంతో పోతోంది. విమానం వాళ్లు ఆ తెల్లవారుజామున తిండిపెట్టారు. అది తిన్న జనం మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. దుబాయిలో విమానం ఎక్కినప్పుడు 4వ తారీఖు. ఆ రోజంతా విమానంలోనే గడచిపోయింది. నిద్రమత్తులో జనానికి ఇండియా ఎన్నికల ఫలితాలు గుర్తుకురాలేదు. ఎమిరేట్స్ విమానం అట్లాంటిక్ సముద్రం దాటి అమెరికా వైపు మళ్ళిన తర్వాత మన వాళ్లకు మళ్లీ ఆంధ్రా ఎన్నికలు గుర్తుకువచ్చాయి.
విమానంలో వైఫై..
విమానంలో వైఫై ఉంటుందని గుర్తుకొచ్చిన ఒకరిద్దరూ వాళ్లను అడిగితే అదనపు డబ్బులు కట్టాలన్నారు. దాంతోపాటు మన దగ్గరుండే మొబైల్ కి ఇంటర్నేషనల్ రోమింగ్ ఉండాలన్నారు. ఇవన్నీ అయ్యే పనులు కాదు లెమ్మని కొందరు మేధావులు విమానంలోని లోకల్ లాన్ లో వస్తున్న బీబీసి హెడ్ లైన్స్ పెట్టి చూశారు. అదేమో ఎప్పటికప్పుడు అప్ డేట్ కాదు. అలా అయిన ఓ సందర్భంలో చూస్తే - మోదీ గెలిచే అవకాశం ఉన్నాయి, అయితే మెజారిటీ తగ్గవచ్చు అని ఉంది గాని తెలుగు రాష్ట్రాల ప్రస్తావన లేదు.
ఊరంతా తిరిగొచ్చిన మనోళ్లకి ఇంటి ముందరికి వచ్చిన తర్వాత తొందరెక్కువైంది. విమానం మరో అరగంటలో డాలస్ ఫోర్ట్ వర్త్ విమానాశ్రయంలో దిగుతుందనగా మనోళ్లకి మళ్లీ గొంతులు లేచాయి. నా పక్కన కూర్చున్న ఓ తమిళ అమ్మాయిని ఓ శ్రీకాకుళం జిల్లా వాసి 'అమ్మాయ్, నీ ఫోన్ లోకలేనా, నెట్ వర్క్ ఉందా, మన ఎన్నికలు ఏమయ్యాయో కనుక్కోరాదూ' అన్నారు. దానికామె.. మనమింకా గాల్లోనే ఉన్నాం, 10వేల 450 అడుగుల ఎత్తులో ఉన్నామండీ, అప్పుడే నెట్ వర్క్ తగులుకోదు' అనడంతో ఉసూరుమన్న ఆ పెద్దాయన.. డల్లాస్ పోయిన తర్వాతైనా చెప్పు అన్నాడు గాని ఇమిగ్రేషన్ హడావిడి, ఆయన కుమారుడి మందలింపుతో మర్చిపోయారు.
2024 జూన్ 4 (అమెరికా టైం ప్రకారం ఉదయం 9.45)
దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం డల్లాస్ లో దిగింది. అందరూ మునిగాళ్ల మీద నిలబడి ఉన్నారు. చక్రాల కుర్చీల సందడి. పోర్టర్ల హడావిడి. ఇండియా నుంచి వచ్చిన వాళ్లను తనిఖీ చేసి వాళ్ల దేశంలోకి అనుమతిచ్చే ఎమిగ్రేషన్ పూర్తి కావడానికి గంటన్నర. లగేజీలు తీసుకోవడానికి ఇంకో అరగంట. వెరసి బయటకు వచ్చేపాటికి ఉదయం 11 దాటింది.
అమెరికాలో తెలుగోళ్ల రాష్ట్రంగా పేరొందిన టెక్సాస్ లో ప్రత్యేకించి డల్లాస్ లో తెలుగువాళ్ల సందడి అంతా ఇంతాకాదు. హైదరాబాద్ బిర్యానీ మొదలు కోనసీమ గుమగుమల వరకు సర్వస్వం ఇక్కడ ఉన్నాయి.
అప్పటిదాకా అణుచుకున్న రిజల్ట్ ఫీవర్ని ఇక నేను దాచుకోలేక మమ్మల్ని తీసుకువెళ్లడానికి వచ్చిన మా అల్లుడు సందీప్ ని అడిగేశా.. 'అదేంటీ, మీరిప్పటి దాకా తెలుసుకోలేదా? ఫ్లైట్ లో వైఫై హైర్ చేస్తే పోయేది కదా' అని ఆశ్చర్యపోతూ- మనవాళ్లు ఎక్కువ మంది ఇండియా బజార్ వద్ద ఉంటారు వెళ్దామా అన్నాడు. కారు నిండా లగేజీ, చేతిలో చిన్న పిల్లలు.. ఎందుకన్నట్టుగా తనవైపు చూశా..
అసలింతకీ విషయం ఏమిటీ?
ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అని మళ్లీ అడిగా.. మీ పాత యజమాని జగన్ మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు, జగన్ ది అట్టర్ ప్లాప్ షో అన్నాడు. ఇంతకీ ఎన్ని వచ్చాయి అని మళ్లీ అడిగా.. చంద్రబాబుకి 164, జగన్ కి 11 అనడంతో జోక్ చేస్తున్నాడేమో అనుకున్నా. అది నిజమని నా మనసుకి ఎక్కడానికి దాదాపు 30,40 సెకన్లు పట్టింది. అంతటి స్వీప్ ఉందని ఒకరిద్దరూ చెప్పినా నేను నమ్మకపోవడమే దానికి కారణం. ఇంతలో కారు ఇర్వింగ్ వైపు మళ్లింది.
ఇర్వింగ్ అంటే మన లెనిన్ సెంటర్ లేదంటే ఇందిరా పార్కు..
ఒకప్పుడు కమ్యూనిస్టుల మీద ఓ జోక్ ఉండేది. రష్యాలో వానొస్తే ఇండియాలో గొడుగు పడతారని. ఇప్పుడు అదే సామెత అమెరికాలో ఉంటున్న మనోళ్లకి సరిగ్గా అతికినట్టు సరిపోతుందనుకుంటా. కేసీఆర్ గెలిచినా ఓడినా, చంద్రబాబు అరెస్టయినా, విడుదలైనా, జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినా కాకున్నా, పవన్ కల్యాణ్ సినిమా అయినా చిరంజీవి ప్రకటనైనా అమెరికాలో ఉండే తెలుగోళ్లకి పండగే. ఇట్లాంటి పరిస్థితుల్లో డల్లాస్ లో ఉండే తెలుగువాళ్లకి చంద్రబాబు గెలుపంటే.. అదీ క్లీన్ స్వీప్ అంటే ఇక చెప్పేదేముందీ.
డల్లాస్ లో ఇర్వింగ్ అని ఓ ప్రాంతం ఉంది. హైదరాబాద్ ఎవరు వెళ్లినా ముందుండేది రాం నగర్ అన్నట్టుగా మనవాళ్లు ఎవరు వచ్చినా ముందు వాలిపోయేది ఈ ప్రాంతమే. అందువల్లే మన వాళ్ల ర్యాలీలకీ ఈ ప్రాంతాన్నే ఇస్తుంటారు డల్లాస్ అధికారులు. ఐదు ప్రాంతాల్లో ర్యాలీలకు అధికారులు అనుమతిచ్చారు. ఇక చూస్కో.. ఆ ప్రాంతాలన్నీ మార్మోగాయి. కార్లు షికార్లు చేశాయి. డీజే మోతలతో మత్తెక్కించే పాటలతో కుర్రకారు హోరెత్తించింది. బాణసంచా మోతమోగింది. వందలాది మంది గుమికూడి అరుపులు, కేకలతో మోతమోగించారు. నిజానికి ఈ సంబరాలు ఇండియాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడే మొదలయ్యాయి. ఆ మర్నాడు కూడా కొనసాగాయంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల పట్ల ఇక్కడి వారు ఎంత ఆసక్తి చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. చిత్రమేమిటంటే జగన్ గెలిచిన 2019లోనూ ఇదే తరహాలో ర్యాలీలు, బాణసంచా పేలుళ్లు మోతమోగాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సుమారు వేయి మంది డల్లాస్ నుంచి వచ్చారని ఓ మిత్రుడు చెప్పారు. కేవలం ఓటు వేయడం కోసమే వాళ్లు వచ్చారని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.
టీడీపీకి బలమైన ఎన్నారై విభాగం ఉంది. ఈ విభాగం ఆధ్వర్యంలోనే ఈ వేడుకలు సాగాయి.కార్లపై నిలబడి కుర్రకారు టీడీపీ జెండాలను రెపరెపలాడించారు. పసుపు రంగు పొగగొట్టాలను పేల్చారు. ఈ వేడుకలు జరిగిన తీరు చూస్తుంటే ఎన్నారై విభాగం ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపించింది. టీడీపీ, జనసేన మద్దతుదారులు ఇక్కడి నుంచే సోషల్ మీడియాలో మహాకూటమి అనుకూల ప్రచారాన్ని హోరెత్తించాయి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్, చిరంజీవి సినిమాలు విడుదలైతే డల్లాస్ హైదరాబాద్, విజయవాడలుగా మారిపోతాయని ఎన్.నవీన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో కంటే డల్లాస్ లోని తెలుగువాళ్లే టీడీపీ, జనసేన, బీజేపీ విజయోత్సవాన్ని భారీగా జరుపుకున్నారేమో అనిపించింది.