2024 టాప్ 7 ప్రాముఖ్యతలు ఇవే..

భారతదేశంలో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఈసారి భారత్ ప్రధాని ఎవరవుతారని ప్రపంచమంతా ఆసక్తికగా చూస్తోంది.

Update: 2024-06-02 09:04 GMT

2024 సార్వత్రిక ఎన్నికలు ఎన్నడూ లేనంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఒకవైపు ఎన్‌డీఏ కూటమి, ప్రతిపక్షాల ఇండియా కూటమి హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఏమాత్రం వెనకంజ వేయకుండా ఇరు వర్గాలు నువ్వానేనా అన్నట్లు జోరుగా ప్రచారం చేశాయి. ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ బీజేపీ, ఇండియా కూటమి పార్టీల మధ్యే జరిగింది. అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఈసారి అధికార పీఠం ఎవరిని ఎంచుకుంటుంది. ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది అంచనాలకు కూడా అందడం లేదు. ఇరు వర్గాలు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంతటి ఉత్కంఠ భరితమైన ఎన్నికల్లో అనేక కీలక అంశాలు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని అలాంటి టాప్ 5 కీలక విషయాలు ఒకసారి చూద్దాం..

ఎలక్షన్ కమిషనర్ రాజీనామా

2024 సార్వత్రిక ఎన్నికల కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అదే కేంద్ర ఎన్నికల కమిషన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. ఈ అంశం భారత రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో ఉన్న విభేదాల కారణంగానే గోయల్ రాజీనామా చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ వారి మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. కాగా అరుణ్ గోయల్ రాజీనామాపై రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ప్యానెల్‌లో గోయల్ చాలా విశిష్ట సభ్యుడు అని అభివర్ణించారు. ప్యానెల్‌లో ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు ఉంటాయని, ఇందులో కొత్తేమీ లేదని కూడా వివరించారు. ‘‘అరుణ్‌తో కలిసి పనిచేయడాన్ని నేను ప్రతి క్షణం ఆనందంగా భావించాను. ఎవరికైనా పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి. దాన్ని అతిక్రమించకూడదు, వ్యక్తిగతమైన ప్రశ్నలు అడగకూడదని నేను గట్టిగా నమ్ముతాను. ఆ కారణాల వల్లే ఆయన రాజీనామా చేశారని భావిస్తున్నా’’ అని చెప్పారు. కానీ అరుణ్ గోయల్ రాజీనామా ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామంగా మారింది.

ఇవే తొలి ఎన్నికలు

1993 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రత్యేకం. ఎందుకంటే అప్పటి నుంచి ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలను ఏక సభ్య ఎన్నికల సంఘం పర్యవేక్షించనుంది. 1993 నుంచి జరిగిన ఏ ఎన్నికలను కూడా ఏక సభ్య ప్యానెల్ పర్యవేక్షించలేదు. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందే అరుణ్ గోయల్ రాజీనామా చేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. కానీ గోయల్ తన రాజీనామాను ఎన్నికల ముందే ఎందుకు ప్రకటించారు అన్న విషయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఎంపిక చేసిన కమిషనర్ ఎందుకు రాజీనామా చేశారు? రాజ్‌కుమార్‌తో ఉన్న విభేదాలే గోయల్ రాజీనామాకు కారణమా? అంటూ ప్రశ్నలు గుప్పించాయి. అంతేకాకుండా ఎంపిక ప్రక్రియలో ఎగ్జిక్యూటివ్ మెజారిటీ ఇచ్చే కొత్త చట్టం ప్రకారం ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించడానికి ప్రభుత్వం తొందరపడుతుందా? అన్న ప్రశ్నలు కూడా రేకెత్తాయి. కానీ అలా కాకుండా.. ఎన్నికల ప్రక్రియను ఏక సభ్య ప్యానెలే పర్యవేక్షించింది.

అత్యంత ఖరీదైన ఎన్నికలు

2024 సార్వత్రిక ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఖర్చులు, ధన ప్రవాహం భారీగా పెరిగింది. ఈ ఎన్నికలకు మొత్తం సుమారు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఇది ఒక రాష్ట్ర బడ్జెట్‌తో సమానం. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి పార్టీలకు కేటాయించిన ఖర్చుతో కలుపుకుని ఈ మొత్తం. కానీ పార్టీలు ఖర్చుపెట్టిన అసలుతో పోలిస్తే దాదాపు రూ.2లక్షల కోట్లు అయిఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి అన్ని పార్టీలు భారీగానే ఖర్చు పెట్టాయని, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు నగదు చెల్లించారని కూడా సమాచారం. కేవలం అధికారిక లెక్కల ప్రకారమే రూ.1.35లక్షల కోట్లు ఖర్చు తేలితే అనధికారికంగా అయిన అన్ని ఖర్చులు కలుపుకుంటే ఇది వేరే రేంజ్‌లో ఉంటుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికల కోసం రూ.1.35 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన తొలి దేశం భారతదేశమే అని నిపుణులు చెప్తున్నారు.

సుదీర్ఘ ఎన్నికలూ ఇవే

ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేసిన రోజుల వ్యవధిలోనే భారతదేశ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో మొత్తం ఏడు దశల ఎన్నికలు ముగియడానికి 44 రోజుల సమయం పట్టింది. జూన్ 1 తేదీన మలిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. వీటి ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా జరిగిన రెండో ఎన్నికలుగా నిలిచాయి. తొలుత 1951-52లో నిర్వహించిన ఎన్నికలు అత్యంత ఎక్కువ కాలం సాగాయి. ఆ ఎన్నికల ప్రక్రియ మొత్తం 120 రోజుల పాటు కొనసాగింది. అయితే ఈ ఏడాది ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల విడుదల వరకు 82 రోజుల సమయం పట్టింది. దీంతో దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం జరిగిన రెండో ఎన్నికలుగా 2024 సార్వత్రిక ఎన్నికలు నిలిచాయి.

చీలిన కుటుంబాలు

దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేక రాజకీయ కుటుంబాలు చీలాయి. వాటిలో ప్రధానంగా వైరులుగా మారిన కుటుంబాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుటుంబాల్లో తొలిస్థానంలో వైఎస్‌ఆర్ కుటుంబం ఉంటుంది. సీఎం వైఎస్‌ జగన్ కోసం పాదయాత్ర చేసిన ఆయన చెల్లి షర్మిల.. ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా మారారు. తమ్ముడు వరసయ్యే అవినాష్ రెడ్డిపై కడప ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇదే విధంగా ఎన్నికల టికెట్ అంశం వల్ల ఆంధ్రప్రదేశ్ పలు కుటుంబాల్లో చీలికలు ఏర్పడ్డాయి. అనకాపల్లిలో మా నాన్నను, చెల్లిని ఓడించండి అంటూ బూడిద ముత్యాలనాయుడు మొదటి భార్య తనయుడు రవికుమార్ ప్రజలను కోరుతూ జోరుగా ప్రచారం చేశారు. తనను కాదని తన తండ్రి రెండో భార్య కూతురు అనురాధకు టికెట్ ఇవ్వడమే ఇందుకు కారణం. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ తరపున దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగారు. ఆయనపై ఆయన భార్య వాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల పోరులో నిల్చున్నారు. అంతేకాదు.. తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కూడా తన కొడుకు అభినయ్‌రెడ్డిని సమర్థుడు అనుకుంటేనే గెలిపించాలని, లేకుంటే తప్పకుండా ఓడించి ఇతర నేతలకు ఉదాహరణగా ఉంచాలని ప్రజలను కోరారు. ఇటువంటి ఘటనలు పక్క రాష్ట్రాల్లో కూడా జరిగాయి.

గాంధీపై నోరుజారిన మోదీ

ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ నోరు పారేసుకున్నారు. ఒక ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడని రీతిలో ఆయన మాట్లాడారు. మన జాతిపితగా భావించే గాంధీ 1982 వరకు ఎవరికీ తెలియదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. ‘‘గాంధీ గురించి 1982 వరకు ప్రపంచానికి తెలియదు. ఆ ఏడాది రిచర్డ్ అటెన్‌బరో అనే దర్శకుడు ‘గాంధీ’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా ద్వారా ప్రపంచానికి గాంధీ పరిచయం అయ్యారు. గాంధీ గొప్పతనం గురించి గత ప్రభుత్వాలు ఏమాత్రం ప్రమోట్ చేయలేదు’’ అని ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. గాంధీ ప్రపంచం మొత్తానికి తెలుసని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మీ హోదాకు సరైనది కాదంటూ అనేక మంది హితవు పలికారు. మరికొందరు మాత్రం గాంధీ చరీష్మాను కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయిందని మాత్రమే మోదీ అన్నారు తప్ప తప్పుగా ఏమీ మాట్లాడలేదని సర్దిచెప్పారు.

ఎగ్జిట్ పోల్స్‌ను బాయికాట్ చేసిన కాంగ్రెస్

ఇంతటి ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమికి చెందిన పలు పార్టీలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అదే ఎగ్జిట్ పోల్స్‌ డిబేట్‌లను బహిష్కరించడం. ఈ నిర్ణయం ద్వారా ఈ ప్రజాస్వామ్యంపై తమకు నమ్మకం లేదని ఆయా పార్టీలు చెప్పకే చెప్పాయి. అయితే కాంగ్రెస్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ యూటర్న్ తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ప్రకటించారు. కానీ కాంగ్రెస్ తొలుత తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దేశంలోని ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘం సమర్థత, ఎన్నికల ప్రక్రియ, ప్రజలపై నమ్మకం కోల్పోయే కాంగ్రెస్ ఇలా మాట్లాడుతుందని, కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే కాక ఈ దేశ ప్రజలకు సిగ్గు చేటని అనేక మంది విశ్లేషకులు మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించే ఎన్నికలపై నమ్మకం లేకుండా ఎలా పోటీ చేశారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ అనేవి అంచనాలు, సర్వేలే తప్ప అవే తుది నిర్ణయాలు కాదని మరికొందరు హితవు పలికారు. దాంతో కాంగ్రెస్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తిరిగి ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది.

ఇక వీటన్నింటి తర్వాత ఈ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్న అంశం ప్రజల తీర్పు. ప్రజలు ఎవరివైపు నిలబడనున్నారన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికర అంశం. మరి వారి తీర్పు ఎలా ఉందో తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News