జి -7 దేశాల ఇటలీ సమావేశం సాధించిందేమిటి?

జి-7 దేశాల నేతలంతా పూర్తి నిరాశతో వున్నారు. అనిశ్చితంగా వున్నారు. వారి భవిష్యత్తు పట్లనే వారికి భరోసా లేని స్థితిలో వున్నారు. ఈ నేపధ్యంలో జరిగిన సమావేశం ఇది

Update: 2024-06-18 05:33 GMT
U.S. Embassy and Consulates in Italy



డాక్టర్. యస్. జతిన్ కుమార్


దక్షిణ ఇటలీ తీర ప్రాంత రిసార్ట్ బోర్గో ఎగ్నాజియాలో జూన్ 13 నుండి 15 వరకు 50 వ జీ-7 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇందులో సభ్య దేశాలు -ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, యూఎస్ ఏ, యు. కె, యూరోపేయన్ యూనియన్ పాల్గొన్నాయి. అల్జీరియా, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా యూనియన్, బ్రెజిల్, భారత్ తో సహా మరికొన్ని గ్లోబల్ సౌత్ దేశాల అధినేతలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఉక్రైన్, వాటికన్ పోప్ కూడ ఆహ్వానితులలో వున్నారు. ప్రపంచ బ్యాంకు, ఐ ఎం ఎఫ్ వంటి ఆర్ధిక సంస్థలు పాల్గొన్నాయి.

ఈ, జి- 7 శిఖరాగ్ర సమావేశ నేపధ్యాన్ని, ప్రస్తుత సందర్భాన్ని ఒక్కసారి పరిశీలించాలి. అంతర్జాతీయ రాజకీయ వార్తా సంచిక ” పొలిటికో” పత్రిక ఇలా రాసింది: "జీ-7 శిఖరాగ్ర సదస్సులలో అత్యంత బలహీనమైన సమావేశం ఇది. హాజరైన నాయకులలో చాలా మంది దృష్టి మరల్చబడి వున్నారు. వారు ప్రస్తుతం తమ దేశాలలో ఎన్నికలు లేదా దేశీయ సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. యూరప్ లోని అధికార కేంద్రాలపై తీవ్ర మితవాద పార్టీలు దాడిచేస్తున్నా యి. తమ ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవటంలో ఆ నాయకులు తలమునకలై వున్నారు.”

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఇద్దరూ తమ అదృష్టాన్ని మార్చుకునేందు కు క్లిష్టమైన ఎన్నికల ప్రచారంలో మునిగి వున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ను గత వారాంతంలో జరిగిన ఈయూ పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్ర మితవాద జాతీయవాదులు ఆయనను గద్దె దించే అవకాశం ఉందంటున్నారు. కెనడాలో తొమ్మిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో తన ఉద్యోగాన్ని వదులు కోవడం గురించి బహిరంగంగానే మాట్లాడారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఈ ఏడాది చివర్లో నాయకత్వ పోటీ కి ముందు, జరిగే సర్వేలలో అతి తక్కువ వ్యక్తిగత రేటింగ్ కలిగి వున్నారు. అందరినీ మించిన పెద్దన్న'81 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆయన కుమారుడు హంటర్ తుపాకీ ఆరోపణల్లో దోషి గా తేలారు, నవంబరులో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలలో ఈ అంశం బైడెన్ కు తీవ్ర ఇబ్బందిని కలిగించే అవకాశం వుంది. అన్నింటికీ మించి నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే జీ7వంటి పురాతన వేదికను సహించే తీరిక,ఓపిక కూడా ఆయనకు ఉండకపో వచ్చన్న ఆందోళన యూరోపియన్ దేశాల మదిలో వున్నది. ఆతిధ్యదేశం ఇటలీ ప్రధాని మెలోనీ తన వ్యూహాత్మక ప్రయోజనాలైన [ఆఫ్రికా, వలసలు, మధ్యధరా సముద్రం, కృత్రిమ మేధ వంటి] విషయాల తో ఎజెండాను రూపొందిం చడం ద్వారా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన ప్రయోజనాలకు ఉపయోగించు కోవాలని నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యం లేదు.

ఇలా ఆ నాయకులు పూర్తి నిరాశతో వున్నారు. అనిశ్చితంగా వున్నారు. వారి భవిష్యత్తు పట్లనె వారికి భరోసా లేని స్థితిలో వున్నారు. ఈ నేపధ్యంలో జరిగిన సమావేశంలో వారు తమ సంక్షోభాన్ని కప్పిపుచ్చు కొంటూ ప్రపంచంలో నేటి సంక్షోభానికి కారణం చైనా అంటూ బాధ్యతను చైనా పైకి నెట్టి వేయడానికి ప్రయత్నం చేశారు.

సమావేశాల ముగింపులో విడుదల చేసిన సంయుక్త ప్రకటన లో ఉక్రెయిన్ సంక్షోభం, వాతావరణ సంక్షోభం, సైబర్ భద్రత, తైవాన్ సమస్య, దక్షిణ చైనా సముద్రం, మానవ హక్కుల సమస్యలతో సహా అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ అంశాలన్నీటిలోనూ జి 7 దేశాల బృందం చైనాను ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా చేసుకుని చైనాపై నిరాధారమైన ఆరోపణలు చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే దేశాల సమూహంగా భావించిన జీ7 అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు అగ్రరాజ్య పోటీకి వాహకంగా మారింది. రష్యాను ఏకాకిని చేయడం - ఇటీవల, చైనాను కూడా లక్ష్యంగా చేసుకోవడం - దాని ప్రధాన లక్షణం గా మారింది.

రష్యాకు మద్దతిస్తున్న చైనా ఆర్థిక సంస్థలపై చర్యలు తీసుకుంటామని, చైనా నుంచి ఎగుమతి అవుతున్న చౌకైన హైటెక్ ఉత్పత్తులను ఎదుర్కొంటామని జీ7 ప్రతిజ్ఞ చేసింది. చైనా 'మితిమీరిన సామర్థ్యం' గురించి జి 7 ఆందోళన వ్యక్తం చేసింది. ఎగుమతి ఆంక్షల ద్వారా చైనాపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. మొత్తంగా చైనా పట్ల అక్కసు వెళ్లగక్కుతూ ఈ ప్రకటన వున్నది. అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు చైనాను ప్రపంచానికి ముప్పు గా నిందించటానికి నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను ఈ కపట ప్రకటన మరోమారు వెల్లడిస్తోంది.

“ప్రపంచ భౌగోళిక పోటీలో అమెరికాకు జి 7 బృందం ఒక సాధనంగా మారిందని మరోసారి రుజువు అయ్యింది."అన్ని సంక్షోభాలకు చైనా నే బాధ్యత వహించాలి" అనే తన కల్పిత అభిప్రాయాన్ని ఒక అంతర్జాతీయ ఏకాభిప్రాయంగా ప్రదర్శించడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఇది మరింత తీవ్రమైన వర్తమాన, భవిష్యత్తు పోటీకి పునాది వేయడాన్ని పోత్సహిస్తోంది.“ జీ7 సభ్య దేశాలు చైనాపై ఆరోపణలు చేయడంలో అమెరికాను గుడ్డిగా అనుసరించాయని, తమ స్వతంత్ర వ్యూహాన్ని, వైఖరిని చూపించలేదు“ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది జి 7 సభ్య దేశాలకు, విస్తృత అంతర్జాతీయ సమాజానికి, భవిష్యత్తు భద్రతా వాతావరణానికి హానికరం.

“జీ-7 సదస్సులో పాల్గొంటున్న దేశాల నేతలంతా తమ దేశీయ మద్దతు తగ్గి, సంక్షోభం లేదా, ఎన్నికల ఒత్తిడిని ఎదుర్కొం టున్నారని, కొందరు ఇటీవల పరాజయాలు చవిచూశారని, తమ దేశాల్లోని ప్రజలు, ఓటర్ల అసంతృప్తిని చైనా పైకి మళ్లించడా నికి జి7 అనేక విధాలుగా చైనాను బలిపశువుగా చేయడానికి ప్రయత్నిస్తోందని- చైనా ఫారిన్ అఫైర్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ గ్లోబల్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ అన్నారు. "ఇది చాలా విలక్షణమైన, మోసపూరితమైన రాజకీయ ఎత్తుగడ."

అదే సమయంలో గ్లోబల్ సౌత్ కు చెందిన పలు దేశాలను జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానించారు. గ్లోబల్ సౌత్ దేశాలపై విజయం సాధించి, వాటిలో విభజన బీజం నాటడానికి జి 7 ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమెరికా, పాశ్చాత్య శక్తులు తమ ఆధిపత్య ఆకాంక్షలతో గ్లోబల్ సౌత్ ను విభజించడం కష్టమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు అమెరికా, పాశ్చాత్య దేశాల నేతృత్వంలోని స్వార్థపూరిత పొత్తుల, కూటముల వ్యూహంలో ఈ వర్ధమాన దేశాలు చిక్కు కుంటాయను కోవటం కూడా వాస్తవ దూరమైనదే.

సంయుక్త ప్రకటనలో ప్రస్తావించిన వివిధ అంశాల్లో రష్యా-ఉక్రెయిన్ ఘర్షణ అత్యంత ముఖ్యమైన అంశం. రష్యా యుద్ద ఉన్మాదా నికి, ఆయుధాలు మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తూ యుద్దాన్ని ఎగదోస్తున్నదని చైనాను నిందించారు. ఉక్రేయిన్ ను తమ ముసుగుగా వాడుకుంటూ అసలు యుద్దం చేస్తున్నదెవరో ఈ ప్రపంచానికి బాగా తెలుసు. జీ-7 సదస్సు ముగిసిన తర్వాత శని, ఆదివారాల్లో జరిగే ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొనేందుకు కొందరు నేతలు స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ రెండు శిఖరాగ్ర సమావేశాలను పరస్పరం అనుసంధానించడం అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహించడంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్య శిబిరం ఒక కూటమి కట్టే ఆలోచనను ప్రదర్శిస్తున్నది. ఉక్రెయిన్ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ప్రపంచాన్ని వేర్వేరు శిబిరాలుగా విభజించాలని చూస్తున్నారు. వాస్తవానికి, ఈ విధానం ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలం కావడమే కాకుండా, ప్రపంచ భద్రతకు ముప్పు కలిగిస్తుంది.

“ రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో చైనాపై బురద జల్లేందుకు జీ-7 చేసిన ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా పోటీని పెంచడానికి అమెరికా అనుసరిస్తున్న ఎత్తుగడ అని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ రష్యన్,ఈస్టర్న్ యూరోపియన్, సెంట్రల్ ఏషియన్ స్టడీస్ అసోసియేట్ రీసెర్చ్ ఫెలో జాంగ్ హాంగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నప్పుడు, ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ ఘర్షణను సాధారణ చైనా-రష్యా వాణిజ్యానికి ఆపాదించడం సహేతుకం కాదని ఆయన అన్నారు. పాశ్చాత్య దేశాల బాధ్యతారాహిత్య చర్యల వల్ల ఉక్రెయిన్కు నష్టం జరిగిందన్న వాస్తవా న్ని ఇది విస్మరిస్తోందన్నారు.

ఉక్రేయిన్ ఆయుధా ల కొనుగోలుకు, పునర్నిర్మాణానికి 50 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తామని జి 7 సమావేశం ప్రకటించింది. ఇది ఎలా సమకూరుస్తారో గమనించండి. 2022లో రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన 'ఆంక్షల్లో భాగంగా' యూరోపియన్ యూనియన్, కెనడా, అమెరికా, జపాన్ పశ్చిమ బ్యాంకుల్లో మాస్కో ఆస్తులను 300 బిలియన్ డాలర్లకు స్తంభింపజేశాయి. (వాస్తవ సంఖ్య 400 బిలియన్లని కొందరు అంటున్నారు.) 5-6 బిలియన్ డాలర్లు మాత్రమే అమెరికాలో ఉండగా, 210 బిలియన్ డాలర్లు ఐరోపాలో నిల్వ ఉన్నాయి. ఈ నిల్వల నుండి వచ్చే వడ్డీ ఆదాయాన్ని ఇకపై ఊక్రేయిక్ కు సహాయంగా ఉపయో గించాలని అమెరికా ప్రతిపాదించింది. అంటే యుద్ధ పరిణామాలకు ఐరోపా డబ్బు చెల్లించేలా వాషింగ్టన్ ఒక వ్యూహం ప్రారంభించింది. ఈ సహాయాన్ని అందించే కచ్చిత మైన విధానాలపై జి 7 లో చర్చలు జరిగాయి. మరి యుద్దం ఆగిపోకుండా ఎగదోస్తున్నది ఎవరో స్పష్టం కావటం లేదా? చైనా రష్యాకు ఆయుధ విడిభాగాలు సమకూరుస్తోందని కోడై కూస్తున్నారు. రష్యాకు సాయం చేస్తున్న చైనా తదితర దేశాలు, సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించడంలో అర్ధం వుందా? నైతికత వుందా?

అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి కొనసాగుతున్న ఆంక్షల కారణంగా డాలర్ కు ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ ఏర్పాటు అవసరమని బ్రిక్స్ దేశాలు గుర్తించాయి. గత వారం సెయింట్ పీటర్స్ బర్గ్ లో జరిగిన ఎస్. పీ.ఐ. ఈ.ఎఫ్ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ‘ఒక స్వతంత్ర చెల్లింపు వ్యవస్థను రూపొందిస్తామని’ ప్రకటించారు. జాతీయ కరెన్సీల్లో చెల్లింపులకు ఒక వేదికను అభివృద్ధి చేస్తున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ధృవీకరించారు. విశ్వజనీనమైన విలువల ముసుగులో ఇతర దేశాలపై తన విలువలను రుద్దడానికి, సమాన చర్చల స్థానంలో మొత్తం ప్రపంచం తరఫున మాట్లాడే హక్కును కల్పించుకుంటూ, సంకుచిత ముఠాలతో భర్తీ చేయడానికి ప్రయత్నించిన పాశ్చాత్య దేశాల ముసుగులను ఇటీవలి అంతర్జాతీయ సంఘటనలు లాగి వేశాయని గుర్తించాలి. జి 7 ప్రాభవం తగ్గిపోతుండగా బ్రిక్స్ గ్రూప్ బలం పొందటం అంతర్జాతీయ పరిణామాల లో ఒక ముఖ్య పరిణామం. దాదాపు 30 దేశాలు బ్రిక్స్ లో సభ్యత్వం కోరుతున్నట్లు సమాచారం.

రష్యా-ఐరోపా సంబంధాలలో ప్రస్తుత స్తంభన కొనసాగి, పునరుద్దరించ లేని స్థితికి చేరుకుంటే అమెరికా లాభపడుతుంది, ఆదిశలో జీ-7 తీసుకునే నిర్ణయాలకు మాస్కో ప్రతీకార చర్య వుంటుంది. ఆ భారాన్ని ఐరోపా భరించవలసి వస్తుంది. . అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుంది. అంతర్జాతీయ చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించడం ద్వారా, యూరోపియన్ సంస్థలపై ఇప్పటికే విశ్వాసాన్ని దెబ్బతీసేలా జి 7 వ్యవహరిస్తోంది.

అంతర్జాతీయ పోటీలో తమ బలహీనత, ఆందోళన, భయం వల్ల జి 7 దేశాలు -చైనా యొక్క ప్రయోజన కరమైన పరిశ్రమ లను, అభివృద్ధిని నిరోధించడానికి అవి "అధిక సామర్థ్యం" కలిగి ఉన్నాయని ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమ మార్కెట్లను చైనా వస్తువులతో ముంచెత్తి వేస్తున్నారని గగ్గోలు పెట్టటం వారి ఆత్మవిశ్వాసం లోపాన్ని చూపిస్తుంది అని నిపుణులు భావిస్తున్నారు.

చైనా, పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై అదనపు తాత్కాలిక కొత్త సుంకాలను విధించే ప్రణాళికను యూరోపియన్ యూనియన్ ఈ వారం ప్రకటించడం అమెరికా అడుగుజాడల్లో నే వారు నడుస్తున్నారనడానికి నిదర్శనం. అయితే చైనా పట్ల తన వాణిజ్య విధానాల్లో జీ7 దేశాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఉదాహరణకు, జర్మనీ చైనాతో అనేక పరస్పర పెట్టుబడులను కలిగి ఉందని, అందువల్ల చైనా ఎలక్ట్రిక్ వాహనా ల పై సుంకాలు విధించడానికి తక్కువ మొగ్గు చూపుతోంది. అయితే అంతర్జాతీయ వ్యవస్థలో వాషింగ్టన్ జి 7 ను హైజాక్ చేసినప్పటికి రష్యా, చైనాలను ఏకాకిని చేయడంలో విఫలం కావడంతో జీ-7 తన దిశా నిర్దేశాన్ని కోల్పోయింది. ప్రపంచంలోని చాలా ముఖ్యమైన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, అయినప్పటికీ ఇప్పటికీ జి 7 సమావేశాల్లో చైనా , రష్యాతో భౌగోళిక రాజకీయ ఘర్షణలో వారు నిమగ్నమయ్యారు. ఇది యుఎస్ భౌగోళిక వ్యూహాలకు జి 7 సేవ చేస్తోందని ఈ సమావేశం స్పష్టం చేస్తోంది.






.

U.S. Embassy and Consulates in Italy


Tags:    

Similar News