ఉద్యోగులను, ఇళ్లల్లో స్త్రీలను కించపరిచేలా కార్పొరేట్ల వ్యాఖ్యలు
తొలుత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, తర్వాత ఓలా CEO భవిష్ అగర్వాల్, మొన్న ఆదానీ, నిన్న L&T చైర్మన్ SN సుబ్రహ్మణ్యం.;
ఇఫ్టు ప్రసాద్(సీపీ)
ఈ కార్పొరేట్ పెద్దలు వాగిందేమిటో తెలిస్తే వాళ్లకు పెళ్ళాం, పిల్లలతో గడిపిన సాంఘిక జీవితం (సోషల్ లైఫ్) ఉందా అనే సందేహం కలుగుతుంది. ఛీఛీ వీళ్లు మనుషులేనా లేదంటే పశువులా? ఆ పశుజాతి కూడా కన్న సంతతి పట్ల జంతు ధర్మాల ప్రకారం ప్రేమను ప్రదర్శిస్తాయి. వీళ్ళకి అదీ లేదు. ఈ ధనమదాంధ మూకను పశుజాతితో పోల్చడం కూడా తప్పే! డబ్బు గడించడమే ఏకైక వృత్తిగా మారిన ఇలాంటి నీచ, నికృష్ట, దుష్ట మూక కంటే పశు జాతి నయం. మనుషుల విధి తినడం, త్రాగడం, మైథునం, నిద్ర వరకే కాదు. ఓ సాంఘిక జీవితం వుంది. మనిషి సంఘ జీవి. కార్మికులు, ఉద్యోగులు మనుషులు గా జీవిస్తారు. కార్పొరేట్ వర్గానికి అది లేదు. అదే ముఖ్యమైన తేడా!
మా శ్రామికవర్గానికి పెళ్ళాం, పిల్లలు, అక్కా చెల్లెళ్ళు, తల్లితండ్రులు, బామ్మలు, జోలపాట, లాలీపాట, ఆలుమగల ముద్దూముచ్చట్లు, ఇంటి ముందు కబుర్లు, ఇరుగు పొరుగుతో బాతాఖానీ, ఆటాపాటలతో అలరారే జీవితం ఉంటుంది. అది మీ కార్పొరేట్ వర్గానికి ఎక్కడుంది? శ్రామిక, ఉద్యోగ వర్గాలు ఆకలి, పేదరికం, కష్టాలు, కన్నీళ్ల మధ్య జీవించే మాట నిజమే. కానీ కన్నీళ్లు కార్చే శ్రామిక ప్రజలకు కన్నీళ్లు కార్చే సాటి ప్రజల తోడు నీడ ఉంటాయి? మీ కార్పొరేట్ వర్గానికి ఎవరి తోడు ఉంటుంది? మా శ్రామికవర్గం ఆనందాల్ని అనుభవించే ఓ లోకం ఉందిరా? మీ కార్పొరేట్ వర్గానికి ఏం ఉంది? మీ కార్పొరేట్ వర్గానికి ఇవి ఏం తెలుసు? మనిషి జాతి లక్షణం లేని మీ కార్పొరేట్ల దృష్టికి మా కష్టజీవుల మనస్సుల లోతు ఏం తెలుస్తుంది? అసలు మా కార్మికులు, ఉద్యోగలు మనుషులుగా కనిపిస్తార్రా? డబ్బు కోసం గడ్డి తింటూ నోట్లకట్టలు లెక్కించే మిషన్లుగా మారిన మీ కార్పొరేట్లకు మా శ్రామికవర్గం గూర్చి ఏం తెలుసు?
పెట్టుబడిదారీ మానస పుత్రులు ఉద్యోగుల గూర్చి ఏ పిచ్చి వాగుడు వాగారో విందాం. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏడాది క్రితం ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శత వార్షికసభ సందర్బంగా వారానికి 70 గంటల పని అమలు జరగాలని కోరిన పాత వార్త తెల్సిందే. దానిపై విమర్శలు వెల్లువెత్తినా ఆత్మవిమర్శ లేదు. తిరిగి అదే వాదనకు ఈమధ్య దిగాడు. ఈ వయస్సులో వారానికి 85 నుండి 90 గంటలు తాను పని చేస్తుంటే ఉద్యోగులు 70 గంటలు ఎందుకు పని చేయరని ప్రశ్నించాడు. పెళ్ళాం, పిల్లల యావని వదిలేసి డబ్బు కోసం తను ఏది చేస్తే సాంఘిక జీవితం గల శ్రామికవర్గం అలాగే చేయాలా? అది ఆయన కధ!
ఇటీవల ఓలా CEO అగర్వాల్ కూడా నారాయణ మూర్తిని బలపరిచి మరో ముందడుగు వేశాడు. తాను రోజూ 20 గంటలు పని చేస్తుంటే ఉద్యోగులు ఎందుకు చేయరన్నాడు. 20 గంటలు సాధ్యమా? సర్వ సాంఘిక జీవితాన్ని వదులుకొని యంత్రాల్లో యంత్రంగా పని చేస్తే వాదనకి నమ్మవచ్చు. కానీ 20 గంటలు అన్నాక పచ్చి అబద్దమే కాకుండా మోసమని తెలుస్తుంది.
తర్వాత ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'అవినీతి స్కామ్స్ చక్రవర్తి' ఆదానీ తాజాగా గొంతు విప్పాడు. లైఫ్ & వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవాలనీ, ఉద్యోగుల ఇష్టానికి భిన్నంగా పని గంటల్ని రుద్దరాదని సుద్దుల్ని వినిపిస్తూ ఆదానీ లోపలి మనిషి బయటపడ్డాడు. ఆదానీ కామెంట్ నుండి అవసరమైన వాక్యాన్ని చూద్దాం. ఇళ్లల్లో 4 గంటలు గడుపుతారో 8 గంటలు గడుపుతారో ఉద్యోగుల ఇష్టం. ఐతే 8 గంటల విశ్రాంతి తీసుకోజూస్తే వారి భార్యలు వారిని విడిచి పారిపోతారు.
ఇలా పరమ నీచ బుద్దితో కామెంట్ చేసే అధికారం ఆదానీకి ఎవడిచ్చాడు? శ్రామిక, ఉద్యోగ వర్గాల సోషల్ లైఫ్ లో అక్రమ జోక్యమిది. ఆదానీ కామెంట్ ప్రకారం వారు ఇళ్లల్లో ఎక్కువ టైం గడిపితే వారి భార్యలకు విరక్తి కలుగుతుందా? భర్తలను చెడ్డవాళ్లుగా చెప్పాలనుకున్నాడా? స్త్రీల పట్ల చులకన భావం ఉన్నట్లా? అది ఆదానీ అంతరాత్మకే తెలియాలి.
ఇదే పని గంటల అంశం గూర్చి నిన్న కార్పొరేట్ వర్గం నుండి మరో కొత్త బాంబు పేలింది. L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం కూసిన కూతకు వద్దాం.
వారానికి 90 గంటల పని చేసి అగ్రరాజ్యాల చెంత భారత్ ని చేర్చాలన్నాడు. కార్పొరేట్లకి కొత్త హీరో దొరికాడు. అతడే L&T చైర్మన్ సుబ్రహ్మణ్యం. ఆదివారం సహా ఏడు రోజుల పనిచేయాలనీ, వారంలో 90 గంటలు చేయాలనే కొత్త డిమాండ్ లేవనేత్తి ఉద్యోగ సాంఘిక జీవితంపై అభ్యంతరకర దాడికి దిగాడు. ఉద్యోగులు ఇంట్లో ఏం చేస్తారు? ఎన్ని గంటలు వుంటారు? భార్యలను చూస్తూ భర్తలు, భర్తల్ని చూస్తూ భార్యలు ఇళ్లల్లో ఏం చేస్తారని మాట్లాడిన తీరు సుబ్రహ్మణ్యం పొగరుబోతుతనాన్ని సూచిస్తుంది.
ఇది ఒక్క సుబ్రహ్మణ్యం వ్యక్తిగత పొగరు కాదు. ప్రభుత్వ అండతో లక్షల కోట్ల ప్రజాధనం మింగి ఎగవేతలతో బలపడి మిడిసిపడే కార్పొరేట్ల పొగరుబోతుతనానికి ఇదో మచ్చుతునక!
ఉద్యోగ భద్రత లేదు. పర్మినెంట్ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలకు రక్షణ లేదు. ఉద్యోగాలకు వార్షిక ఇంక్రిమెంట్లు లేవు. ఏ రోజు ఉద్యోగం నుండి తొలగిస్తారో తెలియదు. సరుకు ధరలు పెరిగాయి. విద్యా, వైద్యం, ఆరోగ్యం ఖర్చు పెరిగింది. కరోనా నుండి కోలుకోలేదు. ఈ ఆర్ధిక, మానసిక బాధల్లో ఉద్యోగ కార్మిక వర్గాలు కొట్టుమిట్టాడే దుస్థితిలో ఉన్నాయి. వారి ఇళ్లల్లో దైన్యం తొంగి చూస్తోంది. ఈ క్లిష్ట కాలంలో వారి సాంఘిక జీవితమే వారికి మానసిక బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఏడ్చేవాళ్లకు ఏడ్చేవాళ్ళ బాసట ఆశాజీవులుగా నడిపిస్తుంది. వారిపై ఇలా చెత్త వ్యాఖ్యలు చేయడం ఎంత దారుణం! మోడీ హయాంలో, దాని అండతో, కార్పొరేట్లకు కలిసి వచ్చి లాభాలు వందల శాతం, వెయ్యుకి మించిన శాతం ఆస్తులు పెంచుకున్నాయి. వారి లాభదాహం తీరలేదు.
8 గంటల పనిదినం వారికి సరిపోదు. 70 గంటల వారంలో ఆదివారం శేలవు తీసుకొని మిగిలిన ఆరు రోజుల్లో రోజుకు 12 గంటలు చేయాలి. అది నారాయణ మూర్తి ఫార్ములా! సుబ్రహ్మణ్యం కొత్త ఫార్ములా ప్రకారం ఆదివారం శేలవు లేదు. రోజూ 13 గంటలు పని చేయాలి. కరోనా తర్వాత ఆరోగ్యాలు దెబ్బ తిన్న మానవజాతి నేడు మన ఎదుట వుంది. ఐనా 13 గంటలు పని చేయాలని చెప్పడం హేయమైనది.
పెళ్ళాల్ని మొగుళ్లు, మొగుళ్ళని పెళ్ళాలు ఇళ్లల్లో కూర్చొని ఏం చేస్తారని వెకిలి బుద్దితో ఒకడు మాట్లాడితే, వారు ఇళ్లల్లో 8 గంటల విశ్రాంతి తీసుకుంటే పెళ్ళాలు ఇళ్ల నుండి పారిపోతారని మరొకడు అంటాడు. శ్రమజీవులైనా కార్మిక, ఉద్యోగ జనాన్ని ఇలా పొగరుబోతు బుద్దితో మాట్లాడే హక్కు వీళ్లకు ఎవడిచ్చాడు? శ్రామికుల నెత్తురు, చెమట లపై ఒక్కొక్క కార్పొరేట్ సంస్థ గుట్టలు గుట్టలుగా ఆస్తి పెంచుకొని తిరిగి అదే శ్రామికవర్గన్ని పెళ్లాల వద్ద కులుక్కుంటారా అని నీచ బుద్దితో హేళన చేస్తుంటే శ్రామికవర్గం మౌనంగా ఉండాలా? మౌనం వీడి నిరసన గళం వినిపిద్దాం. కార్పొరేట్లకు పన్నుల రాయితీ, ఎగవేతలకి చోటు ఇస్తూ సాధారణ టీచర్, లెక్చరర్, ఉద్యోగి, ప్రొఫెసర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల జీతాల నుండి లక్షలకి లక్షలు ఆదాయ పన్ను (IT) వసూళ్ళ తీరు టాక్స్ టెర్రరిజం! ఆబోతు, పందికొక్కు, ఊరపంది కార్పొరేట్ వంటి సంస్థలకి వరాలు కురిపిస్తూ, చీమ, దోమపై భారాలు మోపేది చాలక మన సాంఘిక జీవితంపై దాడికి దిగడం సహించరానిది.
నాలుగు లేబర్ కోడ్స్ అమలులోకి రాకముందే కార్పొరేట్ వర్గాలు ఇలా చెలరేగితే రేపటి దుస్థితి ఏమిటి? 12 గంటల పని దినం లేబర్ కోడ్స్ ద్వారా క్రమబద్దంగా అమలు చేసే వ్యూహం ఉనికిలోకి రాకముందే 13 గంటల పని గూర్చి పట్టపగ్గాలు లేకుండా విర్రవీగితే రేపటి కార్మికవర్గ స్థితి ఏమిటి? ఆర్ధిక సంక్షోభం కమ్ముకు వస్తోంది. కృత్రిమ మేధ (IA) ముప్పు ముంచుకు వస్తోంది. 1929 సంక్షోభం పునరావృత ప్రమాదం కనిపిస్తోంది. ఈ లోపు IA ఆధారంగా లక్షల ఉద్యోగ, కార్మికవర్గాల్ని ఉద్యోగాలు నుండి తొలగించే కుట్ర లేకపోలేదు. పిచ్చికుక్క పేరు పెట్టినట్లు తొలగించే ముందు కార్మిక, ఉద్యోగ వర్గాలు పనిదొంగలుగా చిత్రించే కుట్ర ఉందేమో! అందుకే దేశ సంపదల్ని సృష్టిస్తున్న శ్రమజీవుల్ని పెళ్లాల వద్ద కాలక్షేపం చేసే వారిగా దుష్ప్రచారం ప్రారంభించారేమో! లేదా నిజంగానే లేబర్ కోడ్స్ అమలులోకి వచ్చేసరికే కార్మిక, ఉద్యోగ వర్గాల పై ఓ నిర్ణయాత్మక దాడికి కార్పొరేట్లు వ్యూహరచన చేస్తున్నారేమో! వాటికి మోడీ ప్రభుత్వ అండ ఉండనే వుంది కదా!
శ్రామికవర్గానికి పరీక్షా కాలం. రేపటి సమరశీల పోరాటలకు పదును పెట్టుకోవడానికి ఇదొక సన్నద్ధ దశ. మొదట నారాయణ మూర్తి, తదుపరి ఆదానీ, పిమ్మట సుబ్రహ్మణ్యం శ్రామికవర్గ సాంఘిక జీవితంపై దాడి ముందస్తు హేచ్చరిక! ఈ కుట్రల భగ్నం కోసం పై కార్పొరేట్ ప్రతినిధులు మన శ్రామికవర్గం మీద ముందస్తు సన్నద్ధ దాడిని ఓ అవకాశంగా తీసుకొని విశాల నిరసనోద్యమాన్ని నిర్మిద్దాం. మన కోట్లాది శ్రమజీవుల కుటుంబాల్లో స్త్రీలను అవమానిస్తూ అదానీతో సహా కార్పొరేట్లకి వెకిలి వ్యాఖ్యలు చేసే హక్కు ఎవడిచ్చాడురా అంటూ ధర్మాగ్రహాన్ని వెల్లడిద్దాం. శ్రామిక, కార్మిక, ఉద్యోగ, వర్గాలకు అండగా రైతు, కూలీ, పీడిత, తాడిత, దళిత, బహుజన ప్రజల సంఘీభావాన్ని పొంది ఈ కార్పొరేట్లకు గుణపాఠం చెబుదాం.