2014 సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఇక నైనా బయట పెట్టండి...

రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు గడిచిన సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం స్వప్రయోజనాలకు వాడుకున్న ఆ నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ముందు తప్పకుండా ఉంచాలి.

Update: 2024-09-12 10:38 GMT

భారత దేశంలో కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ జనాభా లెక్కింపు మొదటి సారి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1872 లో జరిగింది. కానీ మొదటి సారి బ్రిటిష్ పరిపాలన సాగిన అన్ని ప్రాంతాలలో సమగ్ర జనాభా లెక్కింపు 1881 లో చేశారు. అప్పటి నుండీ ప్రతి పదేళ్ళ కొకసారి జనాభా లెక్కింపు చేస్తున్నారు. స్వాతంత్ర్య భారత దేశంలో మొదటిసారి 1951 లో జనాభా లెక్కింపు ప్రక్రియ మొదలైతే, 2011 వరకూ నిరాటంకంగా సాగుతూ వచ్చింది. కానీ 2021 లో జరగాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్ కారణంగా వాయిదా పడింది.

కోవిడ్ సమస్య 2022 లోనే పరిష్కారం అయినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకూ జనాభా లెక్కింపు ప్రక్రియను చేపట్టకుండా వాయిదా వేస్తూ వచ్చింది. 2026 వరకూ జనాభా కు సంబంధించి పూర్తి నివేదికలు బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ లోపు దేశంలో కులగణన చేయాలనే డిమాండ్లు బలంగా ముందుకు వచ్చింది . ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ , ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ డిమాండ్ ను ఇటీవల జరిగిన ఎన్నికల అంశంగా కూడా మార్చాయి. బీజేపీ పార్టీ ఇంత కాలంగా కుల గణనను వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ తాజాగా బీజేపీ మాతృ సంస్థ ఆర్. ఎస్. ఎస్ కూడా కులగణన చేపడితే తమకు అభ్యంతరం లేదని ప్రకటించింది. కాబట్టి దేశంలో జనాభా లెక్కింపుతో పాటు కుల గణన కూడా చేపట్టే అవకాశాలు పెరిగాయి.

దేశ ప్రజల సామాజిక, ఆర్ధిక స్థితిగతులను అర్థం చేసుకోవడానికి , ప్రజల స్థితిగతులను బట్టి, ప్రభుత్వాలు విధానాలు రూపొందించడానికి, పథకాలు ప్రకటించడానికి ,నిధుల కేటాయింపు సవ్యంగా చేయడానికి అవకాశాలు మెరుగవుతాయి. అందువల్ల, వీలైనంత వేగంగా జనాభా లెక్కింపు, కుల గణన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలి. జాతీయ నమూనా సర్వే సంస్థ (NSSO) క్రమానుగతం గా చేసే నివేదికలు ప్రజల ముందు ఉంటున్నప్పటికే, అది నిజానికి శాంపిల్ మాత్రమే. పూర్తి సమాచారం కాదు. కొన్ని సార్లు శాంపిల్ సేకరణలో, గణాంకాల విశ్లేషణలో పొరపాట్లు జరిగే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. కాబట్టి జనాభా, కుల జనాభా లెక్కింపు తప్పని సరి అవసరమవుతుంది.

2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జనాభా లెక్కింపు జరిగింది. కానీ , 2014 లో ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లుగా విభజనకు గురైంది. 2011 జనాభా లెక్కల వివరాలు తెలంగాణకు వేరు చేసినప్పటికీ, 2021 లో జరగాల్సిన జనాభా లెక్కింపు జరగనందున, 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పరిధిలో ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను అంచనా వేయడం కష్టంగా మారుతున్నది ఆ విశ్లేషణ వాస్తవాలకు దూరంగా ఉండే ప్రమాదం కూడా ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ప్రాతిపదికగా పెట్టుకోవడం సముచితంగా ఉంటుంది.

కానీ కారణ మేదైనా, అప్పటి KCR ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ప్రజల ముందు ఉంచలేదు. కాంగ్రెస్ సహా ,ప్రతిపక్ష రాజకీయ పార్టీ, ప్రజా సంఘాలు , ఆ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేసినప్పటికీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఒకవైపు ఆ నివేదికలోని గణాంకాలను తాను ఉపయోగించుకుంటూ, పథకాల రూపకల్పన చేయడం, ఎన్నికల సందర్భంగా ఓటర్ల ను ప్రభావితం చేసే విధంగా చర్యలు చేపట్టడం, కొందరికి ఓటింగ్ కు అవకాశం లేకుండా చేయడం లాంటి పనులకు పాల్పడింది.

తెలంగాణకు సంబంధించినంత వరకూ 2014 ఆగస్ట్ 19 న ఒక్క రోజు చేసిన సమగ్ర కుటుంబ సర్వే మాత్రమే మొదటి జనాభా లెక్కింపు గా భావించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేరు వేరుగా చేపట్టిన ఈ సర్వే లో తెలంగాణ పౌరులు,ఇతర దేశాలలో, రాష్ట్రాలలో ఉన్నా, వారిని సంబంధిత డాక్యుమెంట్స్ ఆధారంగా సర్వే లో భాగం చేశారు. రాష్ట్రంలో కార్యాలయాలకు, పని స్థలాలకు సెలవు ప్రకటించి మరీ, శిక్షణ పొందిన 3,85,892 మంది సిబ్బందితో చేసిన ఈ సర్వే లో అనేక సామాజిక, ఆర్ధిక అంశాలు బయటకు వచ్చాయి.

రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు గడిచిన సందర్భంగా అయినా ఆ నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ముందు తప్పకుండా ఉంచాలి. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ( NIC) నిర్వహిస్తున్న ఈ సమగ్ర కుటుంబ సర్వే డాటా ను అధికారులు వినియోగించుకోవడానికి మాత్రం అందుబాటులో ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నమ్మదగ్గ డాటా కోసం ఈ సర్వే చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబ సమాచారం సేకరించుకుని, వివిధ ప్రభుత్వ శాఖలు , దానిని ఉపయోగించుకుని కార్యక్రమాలను అమలు చేయడానికి, సంక్షేమ పథకాల లబ్ధిదారులను కూడా సరైన పద్ధతిలో ఎంపిక చేయడాయికి, అర్హులైన పేదలకు ప్రయోజనం అందేలా హామీ ఇవ్వడానికి, పథకం అమలులో లీకేజీలను అరికట్టడానికి వీలుగా ఈ సమగ్ర కుటుంబ సర్వే ను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని అప్పటి ప్రభుత్వం చెప్పింది.

వ్యక్తుల వ్యక్తిగత గోప్యత అంశాలపై కొన్ని రిట్ పిటీషన్ లు అప్పటికి కోర్టులో పెండింగ్ లో ఉన్నాయనే కారణంగా వ్యక్తులు ముందుకు వచ్చి, స్వచ్ఛందం గా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే సేకరించారు. అయితే గణాంకాల సేకరణ చెట్టం 2008 ప్రకారం ఈ సర్వే చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫై చేయలేదు. ఈ చట్టం ప్రకారం చేసినట్లయితే, తప్పకుండా సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది. అది ఆనాటి ప్రభుత్వానికి ఇష్టం లేదు. కుటుంబాలకు సంబంధించి, 8 ముఖ్యమైన కోణాలలో 94 అంశాలకు సంబంధించి సమాచారం సేకరించారు. ఆధార కార్డ్,/ రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, గ్యాస్ కనెక్షన్, వైకల్యం సర్టిఫికెట్, విద్యుత్ బిల్లు, పట్టాదార్ పాస్ బుక్, కులం సర్టిఫికెట్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించి, ఈ సర్వే లో సమాచారాన్ని పొందు పరిచారు.

2011 జనాభా లెక్కలలో 83,03,612 కుటుంబాల వివరాలు సేకరించగా, 2014 సమగ్ర కుటుంబ సర్వే లో 1,03,95,629 కుటుంబాల వివరాలు సేకరించారు. 2011 నాటికి 3,50,03,674 గా ఉన్న రాష్ట్ర జనాభా, 2014 సర్వే నాటికి 3,68,76,544 గా తేలింది . కారణాలు పరిశీలించాల్సి ఉంది కానీ, 2011,2014 మధ్య గ్రామీణ జనాభా గణనీయంగా పెరిగితే, నగర/పట్టణ జనాభా తగ్గింది. సాధారణ ట్రెండ్ కు ఇది భిన్నమైనది.

జీవనోపాధి కోసం నగరాలకు వచ్చిన వాళ్ళు కూడా, ఈ సర్వే సందర్భంగా గ్రామాలలోనే తమ వివరాలను నమోదు చేసుకోవడం కనిపించింది. గత పదేళ్ళలో ఈ ధోరణి ఏమైనా మారిందా, , గ్రామీణ, నగర జనాభాలో వచ్చిన మార్పులు, ,వారి ఆర్ధిక స్థితి గతులలో వచ్చిన మార్పులేమిటి అనేది , రానున్న జనాభా లెక్కలు బయట పెడతాయి.

రాష్ట్రంలో మొత్తం కుటుంబాలు, కులాల వారీగా, మతాల వారీగా జనాభా సంఖ్య, ఇళ్ల స్థితి, , వికలాంగులు, దీర్ఘకాలిక జబ్బులు, కుటుంబాలకు ఉండే చరాస్తులు, కుటుంబాలకు ఉన్న భూమి , పశు సంపద వివరాలు లాంటివి 2014 లో సేకరించారు. ఈ నివేదికను ప్రజల ముందు ఉంచితే, రానున్న జనాభా లెక్కలను పరిశీలించి, రాష్ట్ర ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులపై ఒక అంచనాకు రావడానికి వీలవుతుంది. 2014 సర్వే లెక్కలు అందుబాటులో లేకపోతే, రానున్న జనాభా లెక్కలను, 14 ఏళ్ల తరువాత కేవలం 2011 జనాభా లెక్కలతో పోల్చి చూడడం అశాస్త్రీయం అవుతుంది.

2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో 68,37,891 కుటుంబాలు , నగరాలలో 33,55,136 కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో 2,39,11,856 మంది , పట్టణాలు,నగరాలలో 1,23,91,156 మంది ప్రజలు నివసిస్తున్నారు. గత పదేళ్ళలో ఈ జనాభా పొందికలో ఏ మేరకు మార్పులు వచ్చాయో, ఫలితంగా ప్రజల ఉపాధి ఎంపికలో ఎటువంటి మార్పులు వచ్చాయో, ప్రజల నివాస ప్రాంతాలు నిజంగా నివాస యోగ్యంగా ఉన్నాయో లేదో అర్థం చేసుకోవడానికి , విస్తరిస్తున్న నగరాల నేపధ్యంలో ప్రభుత్వ దృష్టి దేనిపై ఉండాలో డిమాండ్ చేయడానికి కూడా 2014 సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ప్రజల ముందుకు రావాల్సి ఉంది.

రాష్ట్రంలో బీసీ ల జనాభా లెక్కించాలని, జనాభాకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ లు పెంచాలని కూడా రాష్ట్రంలో డిమాండ్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కింపులో కేవలం ఎస్. సి.,ఎస్. టి జనాభా లెక్కలు మాత్రమే సేకరించారు. బీసీ జనాభా లెక్కలు సేకరించలేదు. కానీ 2014 సమగ్ర కుటుంబ సర్వే లో ఈ వియవరాలు కూడా సేకరించారు. ఉప కులాల వారీగా లెక్కలు ప్రజల ముందు లేవు కానీ, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి.

2014 సర్వే నాటికి రాష్ట్రంలో బీసీ జనాభా 52,50,427 ( 51 శాతం) , ఎస్. సి. జనాభా 17,96,622 ( 18 శాతం), ఎస్. టి జనాభా 9,80,808 ( 10 శాతం) ,ఇతర కులాల జనాభా 21,65,170 ( 21 శాతం) గా నమోదైంది. ఈ పదేళ్ళలో జనాభా సంఖ్య పెరిగి ఉండవచ్చు కానీ, బీసీ జనాభా రాష్ట్ర జనాభాలో సగం కంటే మించి ఉన్నదనే విషయం ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. నేపధ్యంలో వారికి రిజర్వేషన్ లు పెంచాలనే డిమాండ్ సంపూర్ణంగా న్యాయమైనది. పార్టీల రాజకీయ పడవులలో కూడా ఆ మేరకు ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలనేది కూడా తప్పకుండా జరగాల్సిన పని.

రాబోయే జనాభా లెక్కలలో కులగణన చేపడితే, తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కులాల పొందికలో వచ్చిన మార్పులను అర్థం చేసుకోవడానికి కూడా 2014 సర్వే నివేదికను ప్రజల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఉంచాలి. అప్పుడే పారదర్శకత మెరుగవుతుంది.

Tags:    

Similar News