నాగపాము పడగ మీద రత్నం మొలుస్తుందా

పాముల తలపై రత్నాలు రావు – శాస్త్రవేత్తల స్పష్టీకరణ . మోసగాళ్ల బారిన పడుతున్న అమాయకులు;

Update: 2025-04-09 06:54 GMT

భారతదేశంలో పాములు, ముఖ్యంగా నాగుపాము (cobra) పెద్దయ్యాక దాని తలపై "నాగమణి" అనే విలువైన రత్నం ఏర్పడుతుందని, ఇది ప్రకాశిస్తుందని , దానికి ప్రత్యేక శక్తులుంటాయని ప్రజలు నమ్ముతుంటారు. అనాది వస్తున్న జానపద సాహిత్యం వల్ల నాగు పాము తల మీద రత్నం ఉంటుందనే విశ్వాసం బలపడింది.

కానీ ఇది శాస్త్రీయంగా నిజం కాదు. నిజానికి ఏ పాము కూడా రత్నాన్ని తయారు చేయలేదు. ఇది పురాణాలు, కధలు, మరియు ఊహల వలన మనుష్యులలో మస్తిష్కము లోకి చొచ్చుకు పోయిన కల్పన మాత్రమే. అది అమూల్యమయినది, పవిత్రమైనది కాబట్టి నాగుపాము తలమీద రత్నం చిహ్నంగా పిల్లలకు ‘నాగరత్నం’ ‘నాగమణి’ వంటి పేర్లు కూడా పెట్టుకునే వారు.

నాగమణి – ఒక అభూతకల్పన

శాస్త్రపరంగా పాముల శరీర నిర్మాణంలో అలాంటి అవకాశమే లేదని జీవశాస్త్రజ్ఞులు స్పష్టంగా చెపుతున్నారు అయినప్పటికీ, నాగమణి గురించి పురాణాలు, సాంప్రదాయ కథలు, కల్పిత చిత్రవిచిత్రమైన కధనాల ఇప్పటికీ అన్ని ప్రాంతాల్లో,అన్ని వర్గాల్లో ప్రచారంలో వుంటూన్నది.

నాగమణి పేరుతో మోసాలు –కోట్లు గుంజుతున్న మోసగాళ్లు

జనబాహుళ్యంలో వున్నా ఈ అపోహను ఆసరాగా చేసుకుని కొంతమంది మోసగాళ్లు ప్రజలలోని భయం, ఆశ, అమాయకత్వాన్ని వాడుకుని, నాగమణి అమ్మకం పేరుతో ప్రజలను మభ్యపెట్టి లక్షల రూపాయలు దండుకుంటున్నారు .

కొన్న యదార్థ సంఘటనలు:

2021లో కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఈ తరహా మోసానికి సంబంధించిన కేసు నమోదైంది. రాజు అనే ఒక వ్యక్తి తన సహచరులతో కలిసి బెంగళూరుకు చెందిన మరో వ్యక్తిని 'నాగమణి' పేరుతో రూ. 30 లక్షలు తీసుకుని మోసం చేశాడు. చెక్క పెట్టెను తయారు చేసి అందులో బల్బ్ అమర్చి, రాత్రిపూట ప్రకాశించేలా చేసి దాన్ని నాగమణిగా చూపించాడు. ఈ మోసం బయటపడిన తర్వాత పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు.

2016 బెంగళూరు ‘నాగమణి’ పేరుతో ప్రజలను 1.25 కోట్ల రూపాయలకు మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు.

2017 లో ప్రశాంత అనే పూజారి బెంగుళూరు గుడిబండె పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌడేశ్వరి ఆలయంలో ఉగాదిరోజున నాగమణి దర్శనం చేయిస్తాని ప్రజలను మోసగించే ప్రయత్నం చేశాడు. చాలామంది భక్తులు ఆయన చూపించిన మెరిసే రత్నాన్నిచూసి జన్నతరించిందని భావించారు. అయితే, కొందరికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఏదో మెరిసేరాయిని రత్నంగా చూపించి ప్రజలను మోసం చేస్తున్నాడని పోలీసులు అతన్ని అరెస్టు చేశారని బెంగుళూరు మిర్రర్ రాసింది. 2020లో హైదరాబాద్: ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లో నకిలీ ‘నాగమణి’ని ₹ 1 కోటికి విక్రయించడానికి ప్రయత్నించిన నలుగురిని అరెస్టు చేశారు. ఇవి మచ్చుకకు కొన్ని మాత్రమే వెలుగులోకి రానివి మోసాలు కోకోల్లలు.

నాగమణి మోసాల తంతు ఎలా జరుగుతుంది?

కొంతమంది మోసగాళ్లు ఒక చిన్న చక్కటి రాయిని పాము తలలోని పొలుసులు కింద ముందుగానే చోపించి , కొన్ని రోజుల తర్వాత ప్రజల ముందు ప్లాన్ చేసిన డ్రామా ప్రకారం ఆ రాయిని పాము తల నుంచి తీస్తున్నట్టు నటిస్తారు. బయటకు తీసిన ఆ రాయిని నాగమణి అని చెప్పి ప్రజలను మోసం చేస్తారు. ఇలా చేయడం అనేది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాలలో రహస్యంగా జరుగుతున్న మోసం.

ఇంకొన్ని చోట్ల ఒక చిన్న చక్కటి రత్నాన్ని (వాస్తవానికి ఇది విలువలేనిది ) పాము తలపై నూనె లేదా గ్లూ సహాయంతో తగిలించి రాత్రివేళ బల్బులు లేదా లైట్లు వుపయోగించి అది ప్రకాశించేలా చూపిస్తారు. ప్రజలు ప్రకాశిస్తున్న ఆ విలువలేని రాయిని చూసి అది నాగమణి అని నమ్మి మోసగాళ్ల వలలో పడుతుంటారు. ఈ మోసగాళ్లు కొన్ని సార్లు పాము చలనాన్ని కంట్రోల్ చేయడానికి మత్తు మందులు కూడా వాడుతారు.

ఎందుకు ప్రజలు నమ్ముతున్నారు?

నాగమణి గురించి శతాబ్దాలుగా వచ్చే పురాణాలు, సినిమాలు, జానపద కథలు. పాము అంటే భయంతో పాటు గౌరవం కలిగి ఉండటం. ప్రకాశించే వస్తువుల పట్ల మానవ మనస్సు ఆకర్షితమవడం. తక్కువ సమయంలో ధనవంతులు కావాలన్న దురాశ.

పోలీసుల హెచ్చరిక

ఈ తరహా మోసాలపై పోలీసులు ప్రజలను స్పష్టంగా హెచ్చరిస్తున్నారు: "ఏ పామూ తలలో రాయి ఉత్పత్తి కావడం నిజం కాదు. ఇది పూర్తిగా ప్రజలను మోసగించే మోసపూరిత చర్య ఇలాంటి విషయాలను నమ్మవద్దు" అని. ఇలాంటి మోసాలపై కేసులు నమోదవుతున్నా, అవి చిన్నపాటి గ్రామాల్లో గోప్యంగా జరుగుతుండటంతో కొన్నిసార్లు బయటపడడం ఆలస్యం అవుతుంది.

అపోహలకు పరిష్కారం – శాస్త్రీయ అవగాహన, ప్రజాసాంఘిక చైతన్యం

ఇలాంటి మోసాలను నివారించేందుకు పాఠశాలల్లో జానపద అపవాదాలపై పరిశీలనాత్మక బోధనఅవసరం. పోలీస్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో గ్రామాలలో శాస్త్రీయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన ప్రజలు భయానికి బదులు జ్ఞానంతో స్పందిస్తారు. మీకు గాని లేదా మీ పరిచయాల్లో వున్నా వారు ఎవరైనా ఇలాంటి మోసాలను గమనిస్తే, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఇది ప్రజలను మోసం చేసే నేరం, ఇలాంటివాటిని చేసేవారు గణనీయమైన శిక్షలకు పాత్రులవుతారు.

అపోహలు విడిచి వాస్తవాలు తెలుసుకుందాం

నాగమణి అనే పదం ప్రజల ఊహలో మాత్రమే ఉంది. పాములు రత్నాలను ఉత్పత్తి చేయవు. నాగమణి గురించి ఉన్న అపవాదాలు ప్రజల ఊహాగానాలు మాత్రమే. అలాంటి మోసాల నుండి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా “నాగమణి” పేరుతో ఏవైనా వస్తువులను అమ్మాలని చెబితే, నమ్మకండి – ఇది నిబంధనలకు విరుద్ధమైన మోసపూరిత చర్య.

Tags:    

Similar News