బీజేపీ రాముడు అయోధ్యలో ఉన్నాడు.. మా రాముడు సిద్ధరామయ్యే అని అన్నదెవరు?

బీజేపీ ఎత్తుగడలను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్ధంగా తిప్పికొడుతున్నారా? ఆయనకు దొరికిన కొత్త అస్త్రం ఏమిటి?

Update: 2024-01-20 11:10 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేకిగా ముద్రవేసి ఆయన ప్రజాదరణను దెబ్బతీయడం ద్వారా అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఆ ఆరోపణలను తిప్పికొడుతూ సిద్ధరామయ్య తన నియోజకవర్గంలో నిర్మించిన రామమందిరాన్ని తెరపైకి తెస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అయోధ్యలోని రామ మందిరాన్ని ఫోకస్‌ చేస్తూ కర్ణాటకలో హిందువుల ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోంది. అదే సమయంలో తమ నాయకుడు కూడా రామాలయం నిర్మించాడని సోషల్‌ మీడియాలో సిద్ధరామయ్య మద్దతుదారులు ప్రచారం కూడా మొదలుపెట్టారు.

మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంలోని పరిధిలోని సిద్దరామనహుండి సిద్ధరామయ్య స్వస్థలం. ఈ గ్రామంలో శిథిలావస్థలో ఉన్న రామాలయానికి 2020లో పునరుద్ధరణ పనులు మొదలుపెట్టారు. రెండేళ్ల తరువాత ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆలయ సముదాయంలో రాముడితో సహా 10 మంది దేవతల విగ్రహాలు ఉన్నాయి. రామ నవమిని ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారని గ్రామస్తులు చెబుతున్నారు.

సిద్ధరామయ్యను చాలా మంది నాస్తికుడని భావించినా.. ఆయన హిందూ మతంపై మాట్లాడేందుకు ఏ మాత్రం వెనుకాడరు. అదే సమయంలో తనకు అన్ని మతాల పట్ల గౌరవం ఉందంటారు.

‘‘నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. నేను కూడా రామ భక్తుడిని’’ అని సందర్భం దొరికినప్పుడల్లా సిద్ధరామయ్య తన ప్రసంగంలో చెబుతారు.

సిద్ధరామయ్య సన్నిహితుడు, మంత్రి హెచ్‌. ఆంజనేయ మాట్లాడుతూ ‘బీజేపీ రాముడు అయోధ్యలో ఉన్నాడు. మా రాముడు సిద్ధరామయ్య’ అని పేర్కొన్నారు. జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సిద్ధరామయ్యను ఆహ్వానించకపోవడాన్ని ఆంజనేయ తప్పుబట్టారు. ‘‘సిద్దరామయ్య స్వయంగా ‘రాముడు’ కాబట్టి ఆ రాముడిని ఎందుకు పూజించాలి’ అనేది ఆంజనేయ వాదన.

‘‘మేం రాజకీయ లాభనష్టాల లెక్కలు వేయడం లేదు. వందలాది దేవాలయాల ప్రారంభోత్సవం, వాటి పునరుద్ధరణతో పాటు ధార్మిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధిగా పాల్గొన్నాను’ అని సిద్ధరామయ్య ఇటీవల చెప్పారు.

సర్వమత సమానత్వం..

‘‘నేను మా ఊరిలో రాముడి గుడి కట్టాను. ఆయనను ఎంతో భక్తితో పూజిస్తా. మసీదులు, చర్చిలలో జరిగే మతపర కార్యక్రమాలకు హాజరవుతూ ఇతర మతాలను గౌరవిస్తా. మన రాజ్యాంగం ఆకాంక్ష సర్వమత సమానత్వం. దానికి మనమందరం కట్టుబడి ఉండాలి’’ అని అన్నారు.

సిద్ధరామయ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అయోధ్య ఆలయ నిర్మాణానికి చందా వసూలు చేయడానికి విభేదించారు. విరాళాలు ఎక్కడికి వెళ్తున్నాయో, ఎక్కడ ఖర్చుచేస్తున్నారోనన్న సందేహం ఆయనకు ఉండేది. అయోధ్యలో రామమందిరానికి విరాళం ఇవ్వడం కంటే తన గ్రామంలోనే రామ మందిరం నిర్మిస్తానని చెప్పారు.

భార్య ప్రోద్భలంతోనే..

సిద్ధరామయ్య భార్య పార్వతి. హిందువు. హనుమంతుడి ఆరాధకురాలు అని సిద్ధరామయ్య సన్నిహితులు చెబుతున్నారు. సిద్ధరామనహుండిలో రామ మందిర పునరుద్ధరణకు ఆమే కారణమని చెబుతారు.

‘‘పార్వతి తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను ఆలయ నిర్మాణ బాధ్యతలను దగ్గరుండి చూడమని చెప్పారు. రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేసి ఆలయాన్ని పూర్తి చేశారు’’ అని సిద్దరామనహుండి గ్రామానికి చెందిన రామేగౌడ ది ఫెడరల్‌కు తెలిపారు.

అయోధ్యను సందర్శిస్తా..

ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత ఒకరోజు తాను అయోధ్యను సందర్శిస్తానని కూడా సిద్దరామయ్య చెబుతున్నారు.

బీజేపీ నేతల మాటేంటి?

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సిద్ధరామయ్య ‘‘శ్రీరామ నామం’’ జపిస్తున్నారని కొందరు బీజేపీ నేతలంటున్నారు. తన గ్రామంలో రామ మందిర నిర్మాణానికి సహకరించి ముఖ్యమంత్రి తన పరువు కాపాడుకున్నాడని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. 

Tags:    

Similar News