ఇదంతా కర్ణాటకలో హిందువుల మద్దతు కోసమే...

దళితులకు తలుపులు మూసే దేవాలయాలను సందర్శించవద్దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎందుకు అన్నారు. బీజేపీ గురించి ఇంకా ఆయన ఏమన్నారు?

Update: 2024-01-18 08:40 GMT

కర్ణాటకలో జరిగిన 2023 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఓటమికి కారణాలను విశ్లేషించుకున్న కమలం పార్టీ నేతలు తిరిగి జనం దగ్గరకు వెళ్లేందుకు అవకాశం కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో వారికి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం కలిసొచ్చింది.

హిందువుల మద్దతు కోసం..

రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హిందువుల మద్దతు కూడగట్టుకునేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా బెంగళూరులోని ఆలయాలను శుభ్రంచేసే కార్యక్రమాలు చేపడుతున్నారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) సభ్యుడు అనంత్‌కుమార్‌ హెగ్డే ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానానికి పోటీచేయాలనుకుంటున్నారు.

ఇటీవల భత్కల్‌, శ్రీరంగపట్నం, సిరిసిల్లో మసీదులను ధ్వంసం చేస్తానని పేర్కొనడంతో ఆయన దూకుడుకు ప్రభుత్వం వెంటనే కళ్లెం వేసింది. హెగ్డే వ్యాఖ్యలు మత ఘర్షణకు దారితీసే అవకాశం ఉండడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి సహా బీజేపీ సీనియర్‌ నేతలు హెగ్డేకు దూరంగా ఉన్నారు.

కొత్త రామాలయాలు పుట్టుకొస్తున్నాయి..

పద్మనాభనగర్‌లోని తన కార్యాలయం సమీపంలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తామని అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్న ఆర్‌.అశోక్‌ ప్రకటించారు.

రామనగర్‌ ప్రాంతంలో రామమందిరం నిర్మించాలని వొక్కలిగ నాయకుడు సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ కూడా సంకల్పించారు. రామాలయం నిర్మించనున్న రామదేవర బెట్ట (రాముడి కొండ)ను పునరుద్ధరిస్తామని గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించిన విషయం తెలిసిందే.

రామనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న అశ్వత్థా నారాయణ్‌ రామదేవర బెట్టను దక్షిణ భారతదేశ అయోధ్యగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే హనుమంతుడి జన్మస్థలంగా చెప్పుకునే అంజనాద్రి కొండను అభివృద్ధి చేసేందుకు బళ్లారి, గడగ్‌, కొప్పల్‌, విజయనగరం, చిత్రదుర్గ ప్రాంతాల బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కొండపై ఉన్న ఆంజనేయ ఆలయానికి వారం రోజుల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

ఆలయాలను శుభ్రపరచడం..

జనవరి 22న జరిగే అయోధ్య ఈవెంట్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు.. కర్ణాటకలోని పలువురు బీజేపీ నేతలు ఆలయాల ప్రాంగణాలను శుభ్రం చేయడం ప్రారంభించారు. శివమొగ్గ జిల్లా షికారిపురలోని హుచురాయ స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర క్లీనింగ్‌ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. బెంగళూరులోని కోదండరామ ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అశ్వత్‌ నారాయణ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి రాజీవ్‌, ప్రీతం గౌడ్‌ పాల్గొన్నారు. బెంగళూరులోని జయనగర్‌లోని గణేశ దేవాలయంలో ఆర్‌ అశోక్‌ తన వంతు కృషి చేశాడు.



సిద్ధరామయ్య పిలుపు

బీజేపీ ‘ఆలయ రాజకీయాలను’ ప్రతిఘటిస్తూ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దళితులు, వెనుకబడిన తరగతుల వారికి తలుపులు మూసే దేవాలయాలను సందర్శించవద్దని పిలుపునిచ్చారు. ‘‘మీరు మీ స్వంత దేవాలయాలను నిర్మించుకోండి. మీ స్వంత దేవుళ్ళను, దేవతలను ప్రతిష్టించి ప్రార్థించండి’’ అని పేర్కొన్నారు.

పవిత్ర బియ్యం..

అయోధ్యలో పవిత్రోత్సవాల సన్నాహాల్లో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఇంటింటికి అక్షింతలను పంపిణీ చేస్తున్నారు. బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. జనవరి 22వ తేదీ న ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రజలను కోరుతున్నారు.

Tags:    

Similar News