2024 ఎన్నికలు అసాధారణం, మౌనం వీడమని హర్షమందిర్ ఎందుకన్నారు?

సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన మహాత్మాగాంధీ అనే రామ్ కి, గాంధీని చంపిన గాడ్సే అనే హే రామ్ కి చాలా తేడా ఉంది. ఆ రెండు రామ్ లు ఒకటి కాదు...

By :  A.Amaraiah
Update: 2024-03-11 11:31 GMT
ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతున్న సామాజిక వేత్త హర్షమందిర్ ఐఎఎస్ (ఎడమపక్క)

2024 మార్చి 9.. నవ తెలంగాణ రాజధాని హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం- ఏపీసీఎల్సీ- 50 ఏళ్ల ముగింపు సభల సందర్భం.. వేదికపైన గంభీరమైన ప్రసంగాలు సాగుతున్నాయి. అందరి మధ్యలో లైట్ బ్లూ కుర్తా, తెల్లటి పైజమా, మిలామిలా మెరిసిపోతున్న నున్నటి తల, కళ్లద్దాలు సవరించుకుంటూ ఓ వ్యక్తి అందరి ఉపన్యాసాలను చాలా శ్రద్ధతో వింటున్నారు. ఎవరా అని ఆరా తీస్తే హర్ష మందిర్. (కొందరు హర్ష మందార్ అని కూడా అంటారు). గుజరాత్ గోద్రాలో మారణహోమం తర్వాత ఐఎఎస్ పదవిని వదిలేసి సామాజిక కార్యకర్తగా మారారు. గాంధేయవాది. ఈక్విటీ స్టడీస్‌ థింక్‌ ట్యాంక్‌ డైరెక్టర్‌. సీబీఐ ఇటీవలి దాడులతో బాగా ప్రాచుర్యంలోకి కూడా వచ్చారు. 2002 వరకు ఐఎఎస్ పదవిలో ఉన్నారు. జాతీయ సలహా మండలి-ఎన్ఏసీ- సభ్యునిగా పని చేశారు. యూపీఏ హయాంలో తీసుకురావాలనుకున్న, బీజేపీ వ్యతిరేకించిన కమ్యూనల్ వాయిలెన్స్ బిల్లు ముసాయిదా తయారీదారుల్లో ఒకరంటారు. హర్ష మందిర్ క్రమం తప్పకుండా వివిధ పత్రికలకు కాలమ్స్ రాస్తుంటారు. అల్లకల్లోలంగా ఉన్న సమయంలో మణిపుర్ లో పర్యటించి తన అనుభవాలను రికార్డ్ చేసిన ఈ మాజీ IAS అధికారి.. వేదిక దిగి దిగకమునుపే చుట్టూ పెద్ద సంఖ్యలో మేధావులు, యాక్టివిస్టులు, ఆయన అభిమానులు గుమికూడారు. మధ్యలో నేను సైతం అన్నట్టుగా ఆయన సమీపంలోకి వెళ్లి రెండు నిమిషాలు సార్ అంటూ వేసిన నాలుగైదు ప్రశ్నల సారాంశమే ఈ ఇంటర్వ్యూ. విషయం పట్ల స్పష్టత ఉండడంతో ఆయన చెప్పాలనుకున్న నాలుగు మాటలు చెప్పారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి సాగుతోందన్నారు. మహాత్మాగాంధీ చెప్పిన " సౌభ్రాతృత్వం, సోదరభావం" కొరవడుతోందన్నారు. "వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వమే తిరిగి ఎన్నికైతే రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుంది, ఇప్పటి రాజ్యాంగం మారిపోతుంది. స్వాతంత్ర్య సమరయోథుల స్ఫూర్తి బూడిదలో పోసిన పన్నీరవుతుంది" అంటారు. మతపరమైన లేదా మతపరంగా ప్రేరేపితమైన హింసా బాధితులకు సంఘీభావంగా కార్వాన్-ఎ-మొహబ్బత్ ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ముస్లింలూ ఈ దేశ ప్రజలే, వాళ్ల పట్ల ద్వేషం ఎందుకు అని ‘ది ఫెడరల్ ప్రతినిధి’కి హర్ష మందిర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తారు.

  1. మీరు పదేపదే చెప్పే సౌభ్రాతృత్వం పరమార్థం ఏమిటీ?

మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం మొదలు రాజ్యాంగం వరకు మనకు మనం చేసుకున్న అనేక ప్రతిజ్ఞలు ఉన్నాయి. భారతదేశం చాలా భిన్నమైంది. మతం, భాష, సంస్కృతి భేదాలను గౌరవించే మానవీయ, సమ్మిళిత దేశం. అందరికీ సమాన పౌరసత్వాన్ని అందజేస్తుంది. వీటన్నింటికీ మూలం సౌభ్రాతృత్వం. మహాత్మాగాంధీ అయినా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అయినా ఆ సోదరభావం గురించే చెప్పారు. మిగతావి మనుగడ సాగించాలంటే సౌభ్రాతృత్వం ఉండాలంటారు మహాత్మా గాంధీ. ఇప్పుడా ఆలోచనే చాలా బెదిరింపులకు గురవుతుంది. స్వాతంత్ర్య పోరాటం బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా మాత్రమే జరగలేదు. ఇంగ్లీషు వాళ్లు వెళ్లిన తర్వాత మనం నిర్మించే భావిభారత దేశం ఊహ కూడా. భిన్నత్వంలో ఏకత్వం మన సూత్రం. మిగతా ప్రపంచం మనల్ని ఎలా ఇముడ్చుకుంటుంతో మనమూ అలాగే ఇముడ్చుకోవాలి. మనలో మనకే తేడాలు ఉన్నప్పుడు మనం వేరొకరితో ఎలా సంబంధం కలిగి ఉండగలుగుతాం?

ఇప్పుడొచ్చిన ముప్పేమిటీ?

ప్రస్తుతం దేశానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ, దాన్ని వెనకుండి నడిపిస్తున్న సంస్థ.. దేశంలోని ఓ వర్గం పాలిట భయానకపరిస్థితి కల్పిస్తున్నాయి. ఇది సైద్ధాంతికమైనది. ఆ సంస్థే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. RSS 1925లో ఏర్పాటైంది. వచ్చే ఏడాది వందో వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. దానికి చాలా భిన్నమైన ఆలోచన ఉంది. ఇజ్రాయెల్ లాంటి దేశాన్ని ఆదర్శంగా చూపుతూ ఇండియాలో కూడా మెజారిటీగా ఉన్న హిందూత్వ లేదా ఆధిపత్య వాదాన్ని తీసుకురావాలనుకుంటోంది. ముస్లింలు, క్రైస్తవులు వంటి వారు మైనారిటీలే గాని హిందువులతో సమానం కాదన్నది ఆర్ఎస్ఎస్ భావన. ఇండియాలో వాళ్లు నివసించాలంటే హిందూ మెజారిటీ వాదాన్ని అంగీకరించాలన్నది ఆర్ఎస్ఎస్ భావన. అది రాజ్యాంగం ముందు ఎలా చెల్లుబాటవుతుంది? ఈ దేశంలోని ఓ వర్గం ప్రజలు రెండవ తరగతి పౌరులుగా ఎలా ఉంటారు?

అత్యున్నత పదవుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్లేనా..

దేశంలో తొలిసారి అన్ని అత్యున్నత రాజ్యాంగ పదవులు (రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి) ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారితోనే భర్తీ అయ్యాయి. దేశంలో మూకమనస్తత్వం నడుస్తోంది. రాజ్యాంగం కల్పించిన లౌకిక భావన కొరవడుతోంది. ముస్లిం మైనారిటీలపై అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించారు. ముస్లింలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ధృక్పదాల్లో తేడాలను సహించలేకుండా ఉన్నారు ప్రస్తుత పాలకులు. నూతన దేశాన్ని ఆవిష్కరించాలనుకుంటున్నారు. కొట్టి పారిపోయే సంస్కృతి వచ్చింది. ‘ద్వేషాన్ని పెంచు, దాడి చేయించు’ అనే సిద్ధాంతం అమలవుతోంది. మహాత్మాగాంధీ ప్రబోధించింది ఇదే కాదు. గాంధీ పేరు చెప్పే నేతలు ఈ విషయాన్ని ఆలోచించాలి.

బాధితుడే నిందితుడా, ఇదేం తీరు?


ప్రస్తుతం దేశంలో తీరు దొంగే దొంగన్నట్టుగా ఉంది. బాధితుడే నిందితుడవుతున్నారు. సోదర భావం తరిగింది. చిత్రహింస పెరిగింది. దారిన పోయే వాళ్లను కొట్టి చంపినా పట్టించుకునే నాధుడు లేడు. వాయవ్య ఢిల్లీలో ఓ ముస్లిం పిల్లాడు ఓ హిందూ దేవతామూర్తి మందిరంలో అరటి పండు దొంగిలించి తిన్నాడని పట్టుకొచ్చి 2 గంటల పాటు చిత్రహింస పెట్టి చావచితకొట్టారు. ఆ రెండు గంటల్లో కొన్ని వందల మంది ఆ దారిన పోతున్నా ఈ పిల్లాడి వేదనను పట్టించుకునే వారు లేకపోయారు. అదే మన తమ్ముడో, అన్నో అయితే మనల్ని ఆ దృశ్యం ఎంత బాధ పెడుతుందో ఆలోచించండి.

ప్రొఫెసర్ సాయిబాబాను ఎందుకు వేధించారు?

సాయిబాబా ప్రజల కోసం నిలబడ్డారు కనుకనే వేధించారు. జార్ఖండ్ లో అదాని గ్రూపుకి బొగ్గు గనులు కావాల్సి వచ్చాయి. ఆ భూములు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయి. వాళ్లను ఖాళీ చేయించడానికి వీలులేదంటూ ఉద్యమించిన వారిలో ప్రొఫెసర్ సాయిబాబా కూడా ఒకరు. అందువల్లే ఆయన్ను ఇబ్బందుల పాల్జేశారు. ఇలా వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయంటే అందుకు నిందించాల్సింది మోదీని కాదు, మనల్ని మనమే నిందించుకోవాలి. మౌనంగా భరిస్తున్న నువ్వూ-నేనూ కారణమే. ప్రతి దానికీ ముస్లింలే కారణమనే భావన కలిగిస్తున్నా మనం ఎవ్వరం నోరు విప్పడం లేదు.

మన హృదయాల్లోకి ద్వేష భావం నింపుతున్నారు...

మన హృదయాల్లోకి ద్వేష భావం నింపుతున్నారు. దాన్ని మనం అంగీకరిస్తున్నాం. ముస్లింలే ప్రతి దానికీ కారణమనే విద్వేషాన్ని మనం సహిస్తున్నాం. మనల్ని మనం ప్రశ్నించుకోవడం మానేశాం. మూకదాడులకు భయపడుతున్నాం. భయకంపితులం అవుతున్నాం. ఈ దేశం నాది అనుకున్నట్టే మిగతా అందరిదీనూ. ఈ దేశంలో 200 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్లపై దాడులు జరుగుతుంటే రేపెప్పుడైనా మన పిల్లలో, మరొకరో.. అప్పుడు (దాడులు జరుగుతున్నప్పుడు) మీరేం చేస్తున్నారని ప్రశ్నిస్తే మనం ఏమి సమాధానం చెప్పగలం.

2024 ఎన్నికలు అసాధారణమైనవి...


నేను ఈ మాట ఎందుకంటున్నానంటే.. స్వంతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అత్యంత కీలక ఎన్నికలివి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గనుక మళ్లీ గెలిస్తే రాజ్యాంగం ఉండదు. భారత ప్రజలమైన మేము అనే భావన వంచనకు గురవుతుంది. వచ్చే ఏడాదికి ఆర్ఎస్ఎస్ పుట్టి వందేళ్లవుతుంది. ఆ సందర్భంగా వాళ్లో చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. దాన్ని బ్రేక్ చేయకపోతే రాజ్యాంగంలోని స్వేచ్ఛా, స్వాంతంత్ర్యం, సౌభ్రాతృత్వం వంటి వాటికి అర్థం ఉండదు. హిందూ రాజ్యమనే భావనే నాకు మింగుడుపడడం లేదు. హింస పరిష్కారం కాదు.

మౌనం సమాధానం కాదు...

ఇన్ని దారుణాలు జరుగుతున్నా ప్రజలు మౌనంగా ఉంటున్నారు. విద్వేషం పెల్లుబుకుతోంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో పడిన కష్టాలను, లాక్ డౌన్ సమయంలో పడిన పాట్లను ప్రజలు మరిచిపోయారు. మళ్లీ బీజేపీకే అధికారం ఇచ్చారు. అంటే దానర్థం విద్వేషమనే డ్రగ్ ను మనలోకి ఎక్కించారు. దీంతో ప్రతిదాన్ని ఆమోదించే స్థితికి చేరుకున్నాం. సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన మహాత్మాగాంధీ అనే రామ్ కి, గాంధీని చంపిన గాడ్సే అనే హే రామ్ కి చాలా తేడా ఉంది. ఆ రెండు రామ్ లు ఒకటి కాదు.

మీరిచ్చే పరిష్కారం ఏమిటీ?

మౌనాన్ని వీడండి. ఎంతకాలం ఈ మౌనం? ఒక రైల్వే ట్రాక్ పై నడిచే వెళ్లే ముస్లింని చంపినా నోరెత్తం. ఆకలితో అరటి పండుతిన్న పిల్లాడిని హింసించినా పల్లెత్తు మాటనం. గాంధీని చంపిన గాడ్సేలే రాముళ్లుగా చెలామణి అవుతున్నా అదేమిటని ప్రశ్నించం. రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నా మాట్లాడం.. ఇది సరికాదు. మౌనాన్ని బద్దలు కొట్టాలి. నోరు విప్పాలి. గాంధీ, అంబేడ్కర్ చెప్పిన సౌభ్రాతృత్వాన్ని ఊరూవాడా వినిపించాలి. లేకుంటే చాలా ప్రమాదంలో పడతాం.

మీకేమీ ముప్పు లేదా?

(ఓ నవ్వునవ్వి).. లేదు.. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగింది. రకరకాల మోసాలను నా నెత్తికి చుట్టారు. తాజాగా నా ఇల్లు, ఆఫీసుపై దాడులు కూడా చేశారు. మహా అయితే అరెస్ట్ చేస్తారు. చుద్దాం.. మీరందరూ అంటే ప్రజలు ఉన్నారుగా అని ముగించారు హర్షమందిర్.

Tags:    

Similar News