గాజా పై తాజా శాంతి ఒప్పందం ప్రపంచరాజకీయాలను మారుస్తుందా?

గాజా సహా యావత్తు పాలస్తినాలో మింటికి ఎగిసే విజయోత్సవ సందడిని వీక్షించి జేజేలు చెబుదాం.;

Update: 2025-01-20 07:11 GMT

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

 ప్రపంచంలో పేరొందిన సంఘటనలు చాలా జరుగుతుంటాయి. వాటిలో కొన్ని సంచలన సంఘటనలు కూడా ఉంటాయి. మరికొన్ని చారిత్రిక సంఘటనలు సైతం ఉంటాయి. కానీ ప్రపంచ చరిత్ర గతిని మార్చే సంఘటనలు అరుదులో అరుదుగా (rarest of rare) జరుగుతాయి. బహుశా ఆ కోవలోకి వచ్చే ఘటనే గాజా పై తాజా కాల్పుల విరమణ ఒప్పందం!

15 నెలలకు పైగా సాగిన గాజా మారణహోమానికి స్వస్తి పలుకుతూ నిన్నటి నుండి అమలులోకి వచ్చే ఓ ఒప్పందం జరిగిన విషయం తెల్సిందే! అది రెండు ప్రత్యర్థి పక్షాల మధ్య సాధారణoగా జరిగే "నీకు గెలుపు - నాకు గెలుపు" ఒప్పందం (win - win agreement) వంటిది కాదు. అందుకు బదులుగా ఒకే పక్షానికి నిర్ణయాత్మక విజయాన్ని (one-sided win) అందించే ఒప్పందమిది.

జియోనిస్ట్ ఇజ్రాయెల్ లో జాత్యహంకార, ఫాసిస్ట్ రాజకీయ శక్తులకు తాజా ఒప్పందం విషాదాన్ని మిగిల్చింది. నిన్నటి నుండి యుద్ధోన్మాద నెతన్యాహు ప్రభుత్వం అంతర్గత సంక్షోభం వైపు అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు హర్షమోదాలతో ఆనందిస్తున్నారు.

మరోవైపు గాజా సహా యావత్తు పాలస్తినాలో నిన్నటి నుండి ప్రజలు విజయోత్సవాలతో కేరింతలతో వీధుల్లో ఎగిసి పడుతున్నారు.

ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా సహా యూరోప్ ప్రత్యక్ష అండదండలతో ప్రాంతీయ సూపర్ పవర్ ఇజ్రాయెల్ మూడున్నర లక్షల అత్యాధునిక సైనిక సాంకేతిక సంపత్తి గల సైన్యంతో 365 చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల బుల్లి గాజా పై 15 నెలల క్రితం యుద్ధానికి దిగింది. అర లక్ష మందిని పొట్టన పెట్టుకుంది. ఒకటిన్నర లక్షల మంది వరకు తీవ్ర క్షతగాత్రుల్ని చేసింది. ప్రధానంగా పసిపిల్లలు, స్త్రీలని బలితీసుకుంది. గాజాలో నిలబడ్డ భవనం అనేది లేకుండా నేలమట్టం చేసింది. ఆధునిక హిట్లర్ పాత్రధారిగా బెంజిమన్ నెతన్యాహు పాలస్తీనాని రక్తపు మడుగులో ముంచివేశాడు. ఐతే అమెరికా, ఇజ్రాయెల్ ఏమి సాధించాయి?

ఈ క్రింది రెండు ప్రకటిత లక్ష్యాల సాధనే ఏకైక ధ్యేయంగా ఇజ్రాయెల్ భారీ సైన్యాలు గాజా పై యుద్దానికి దిగాయి.

1-హమాస్ ని భౌతికంగా నిర్మూలించి పూర్తిగా నిర్జీవం చేయడం!

2-హమాస్ చెర నుండి ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడిపించడం!

హమాస్ నిర్జీవం కాలేదు. బందీలు సజీవ విడుదల కాలేదు. ఇది అమెరికా, యూరోప్ ల అండతో ఇజ్రాయెల్ సాధించిన చరిత్రాత్మక ఓటమి. ఇది నిజానికి పరాజయం కాదు. ఘోరాతి ఘోర సైనిక పరాభవం కూడా!

ఏ హమాస్ శాశ్వత, సమగ్ర, సంపూర్ణ భౌతిక నిర్మూలనే తన ఏకైక ధ్యేయంగా మూడున్నర లక్షల సేనతో బుల్లి గాజా పైకి పదిహేనున్నర నెలల క్రితం భారీ దండయాత్రకి వెళ్లిందో అదే హమాస్ తో తన మూడున్నర లక్షల సైన్యాన్ని గాజాకు గుడ్ బై చెప్పడానికి అంగీకరిస్తూ ఒప్పందం పై బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం సంతకం చేయాల్సి రావడం విశేషాల్లోకెల్ల విశేషం!

2023 నవంబర్ చివరలో కూడా మధ్యవర్తిత్వంలో ఓసారి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇదీ అలాంటిదే కావచ్చననే సందేహం రావచ్చు. అదీ ఇదీ ఒకటి కాదు.

మూడున్నర లక్షల ఇజ్రాయెల్ సేన గాజాలో కొనసాగే ప్రాతిపదికతో ఫలానా రోజులు లేదా వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం వేరు. గాజా నుండి ఇజ్రాయెల్ సకల సైన్యాల్ని దశల వారీగా శాశ్వత ప్రాతిపదికతో ఉపసంహరించుకొనే కాల్పుల విరమణ ఒప్పందం వేరు. రెండూ ఒకటి కాదు. అది win-win agreement కోవలోకి వస్తే ఇది ఏకపక్ష (one-sided agreement) కోవలోకి వస్తుంది.

7-10-2023 తేదీన ఇజ్రాయెల్ పై హమాస్ సాయుధ దాడి తర్వాత గాజా పై ఇజ్రాయెల్ యుద్ధం తెల్సిందే. అది ఇజ్రాయెల్ వ్యూహంలో హమాస్ చిక్కిన చర్యగా ఒక రకం విశ్లేషణ కాగా, హమాస్ వల విసిరితే ఇజ్రాయెల్ అందులో చిక్కిందని మరోరకం విశ్లేషణ వుంది.

పైన పేర్కొన్న మొదటి వాదన కేవలం ఇజ్రాయెల్ అనుకూల రాజకీయ శక్తుల వరకే పరిమితం కాలేదు. పాలస్తీనా జాతి విముక్తి పోరాటాన్ని చిత్తశుద్ధితో బలపరిచే రాజకీయ శక్తులు సైతం మొదటి వాదన నే నమ్మాయి. కానీ ఆ మొదటి రోజే ఈ రెండో వాదన చేసిన విశ్లేషకులు సైతం అల్ప సంఖ్యలో వున్నారు. వారి మాట పిచ్చివాళ్ల మాట, నిజం కాకపోవచ్చని వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర వర్గాలు సైతం చిత్తశుద్ధితో అపోహ పడ్డాయి. కానీ నిలకడగా ఈరోజు చరిత్ర నిజాన్ని నిగ్గు దేల్చింది.

నిన్నటి నుండి సమస్త పాలస్తీనా వైపు చూద్దాం. గాజా వైపు చూద్దాం. వెస్ట్ బ్యాంకు వైపు చూద్దాం. జెరూసలేం వైపు కూడా చూద్దాం. సకల అరబ్బు ప్రపంచం వైపు చూద్దాం. అంతెందుకు అమెరికా, యూరోప్ పౌర సమాజం వైపు చూద్దాం. సమస్త పీడిత ప్రపంచం నిన్నటి నుండి ఈ ఒప్పందం జియోనిస్ట్, జింగోయుస్ట్, ఫాసిస్ట్ రాజకీయ శక్తులకు ఓటమిగా భావించి సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ ఓటమే కాదు. సైనిక ఓటమిగా కూడా భావించి ఆనందంతో ఎగిసి పడుతున్నాయి. అందులో మనం కూడా భాగం పంచుకుందాం.

వేల మరణాలతో, లక్షల క్షతగాత్ర త్యాగాలతో తమ శవాల రాశుల పునాదులపై నిలబడి ప్రతిఘటనా ప్రపంచానికి ఊపిర్లు ఊది కొత్త శక్తిని అందించిన వీర పాలస్తీనా జాతికి విప్లవ జేజేలు చెబుదాం.

Tags:    

Similar News