ఆర్జీ కర్ ఘటనకు ఏడాది..అయినా తగ్గని నిరసన జ్వాల..
2026 ఎన్నికలపై ప్రభావం చూపుతుందా?;
“న్యాయం కావాలి” అనే నినాదంతో ఏడాది క్రితం పశ్చిమ బెంగాల్(West Bengal)లో వందల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు. 2023 ఆగస్టు 9న కోల్‌కతా(Kolkata) ఆర్జీ కర్(RG Kar) మెడికల్ కాలేజీలో పీజీ డాక్టర్‌పై హత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందని, విచారణలో లోపాలున్నాయని జనం ఇంకా ఆగ్రహాం వ్యక్తంచేస్తూనే ఉన్నారు.
2026 ఎన్నికలపై ప్రభావం పడుతుందా?
త్వరలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆర్జీ కర్ ఘటన ప్రతిపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారే అవకాశం ఉంది. ఒకవైపు బీజేపీ, మరోవైపు సీపీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను కార్నర్ చేయవచ్చు. సచివాలయం నబన్నాకు బీజేపీ నిర్వహించిన మార్చ్‌లో ఆ పార్టీ నేతలు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో అభయ తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. వారు తమ కుమార్తె కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని, న్యాయం కావాలని కోరారు.
కార్యకర్త, రచయిత బోలన్ గంగోపాధ్యాయ ఇలా అన్నారు.. ‘‘నిరసన తెలిపేందుకు తక్కువ మంది మాత్రమే వచ్చినా.. న్యాయం కావాలని గట్టిగానే నినదిస్తున్నారు. ఈ ఘటనపై గతంలో వైద్య కళాశాలల విద్యార్థులు, వైద్యులు, లాయర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. కాని ఇప్పుడు సాధారణ జనం కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. రోజువారీ వేతన కార్మికులు, గృహ నిర్మాణ కార్మికులు, సేవా రంగ కార్మికులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.’’ అని చెప్పారు.
ఘటన జరిగి ఏడాది పూర్తయినా.. న్యాయం కావాలన్న డిమాండ్ ఇంకా వినిపిస్తోంది. సంవత్సరం తరువాత కూడా నిరసన ప్రదర్శనకు ఇంత మంది హాజరు కావడం గమనార్హం.