వాట్సప్ వీడియో కాల్ చేయండి..డిప్యూటీ సీఎం అజిత్‌తో లేడీ ఐపీఎస్

వైరలయిన ఇద్దరి మధ్య సంభాషణ..;

Update: 2025-09-05 13:08 GMT
Click the Play button to listen to article

మహారాష్ట్ర(Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar), లేడీ ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణకు మధ్య ఫోన్ సంభాషణ నెట్టింట్లో బాగా వైరలయ్యింది. రెండు రోజుల క్రితం వారిద్దరి హాట్ హాట్‌గా జరిగిన సంభాషణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతకు ఏం జరిగిదంటే...

మహారాష్ట్ర కర్మలా తాలూకాలోని కుద్దు గ్రామంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఐపీఎస్(IPS) ఆఫీసర్ అంజనా కృష్ణకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆమె ఆ గ్రామానికి చేరుకుని తవ్వకాలను ఆపేయించారు. కాసేపటికి గ్రామస్థులు, స్థానిక ఎన్సీపీ(NCP) కార్యకర్తలు అక్కడికి చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు ఫోన్‌ చేసి అంజనా కృష్ణకు ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం ఆపాలని పవార్‌ ఆమెను ఆదేశించారు.


వారిద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది..

పవార్‌: నేను డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నా. మీ చర్యలను వెంటనే ఆపేయండి.

అంజనా కృష్ణ: మీరు చెబుతున్నది నాకు అర్థమవుతోంది. కానీ, ఫోన్‌లో నేను మాట్లాడుతోంది నిజంగా డిప్యూటీ సీఎంతోనేనా? కాదా? అనే విషయం తెలియాలి. నా నంబర్‌కు ఒకసారి వీడియో కాల్‌ చేస్తారా?

పవార్‌: నీకు ఎంత ధైర్యం?. నేను మీపై చర్యలు తీసుకుంటా. నన్నే వీడియో కాల్‌ చేయమంటారా?

కొన్ని క్షణాల్లోనే పవార్‌  ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలయ్యింది.

ఈ వీడియోపై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) పార్టీ స్టేట్ చీఫ్‌ సునీల్‌ తట్కరే స్పందించారు. ‘‘అజిత్ పవార్ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి మాత్రమే ఆయన తన స్వరాన్ని పెంచిఉండవచ్చు. పవార్‌ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వరు.’’ అని అన్నారు.

కాగా ఆ వీడియోపై మాట్లాడేందుకు అంజనా కృష్ణతో సహా పలువురు అధికారులు నిరాకరించారు. దానిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News