'క్రిమీలేయర్'పై పార్లమెంటులో చట్టం చేయాల్సింది: ఏఐసీసీ చీఫ్

'క్రిమీలేయర్' పై సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేందుకు ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసి ఉండాల్సిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Update: 2024-08-10 12:46 GMT

'క్రిమీలేయర్' కాన్సెప్ట్‌పై సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసేందుకు ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసి ఉండాల్సిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

ఎస్సీ జాబితాలోని వర్గాలను ఉప-వర్గీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈ నెలలో తీర్పు చెప్పింది. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లో కూడా క్రిమీలేయర్‌ను గుర్తించే విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాలని, వారికి రిజర్వేషన్లను రద్దు చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు.

ఈ తీర్పుపై ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘క్రిమీలేయర్‌ని తీసుకొచ్చి ఎవరికి లాభం చేకూర్చాలనుకుంటున్నారు? ఒకవైపు క్రిమీలేయర్ (కాన్సెప్ట్) తీసుకొచ్చి అంటరానివారిని తిరస్కరించి.. వేల ఏళ్లుగా విశేషాధికారాలు అనుభవిస్తున్న వారికి ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల గురించి న్యాయమూర్తులు సీరియస్‌గా ఆలోచించలేదు. అంటరానితనం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాలని, దాని కోసం పోరాడతానని’’ అన్నారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అంతం చేయాలని ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఉద్యోగాలను ప్రైవేటీకరించిందన్నారు. చాలా ఖాళీలు ఉన్నా రిక్రూట్‌ చేయడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు ఉద్యోగాలు పొందలేకపోతున్నారని, ఉన్నత స్థాయి స్థానాల్లో ఎస్సీలు లేరని, క్రిమీలేయర్‌గా వర్గీకరించి ఎస్సీ, ఎస్టీలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

"కోర్టు తీర్పు నాకు ఆశ్చర్యం కలిగించింది. నిజ జీవితంలో అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలు వివక్షను ఎదుర్కొంటున్నారు. డబ్బు ఉన్నా వివక్షను ఎదుర్కొంటారు" అని ఖర్గే అన్నారు. ఉప వర్గీకరణకు సంబంధించిన ఇతర అంశాలపై కాంగ్రెస్ చర్చిస్తోందని, వివిధ రాష్ట్రాల మేధావులు, నేతలతో చర్చించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Tags:    

Similar News