పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి..పహెల్గామ్ బాధిత కుటుంబాల హర్షం..
నిన్న రాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 స్థావరాలను భారత వైమానిక బలగాలు ధ్వంసం చేశాయి.;
పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడికి భారత్ గట్టిగానే బదులిచ్చింది. ఉగ్రమూకలను తయారుచేస్తోన్న టెర్రరిస్టు స్థావరాలపై భారత వైమానికి దళాలు దాడులు చేశాయి. నిన్న రాత్రి సుమారు 1.30 గంటల ప్రాంతంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 స్థావరాలను టార్గెట్ చేసి ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో కొంతమంది కీలక ఉగ్రసంస్థల నేతలు హతమయ్యారు.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor)పై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏప్రిల్ 22న పహెల్గామ్‌లో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన విషయం తెలిసిందే. భారత్ తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ బెంగాల్(West Bengal)కి చెందిన బాధిత కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. పహల్గామ్ దుర్ఘటనలో కోల్‌కతాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సమీర్ గుహా, బితన్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
"భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం హర్షించదగ్గ విషయం. ఈ దాడులు ఉగ్రవాదం పూర్తిగా అంతమయ్యే వరకు కొనసాగించాలి," అని సమీర్ గుహా భార్య మీడియాతో అన్నారు. సమీర్ బావమరిది మాట్లాడుతూ..ఉగ్రమూకల ఏరివేతకు కేంద్రం చేపట్టిన దాడిని న్యాయమైన చర్యగా అభివర్ణించారు.
బితన్ అధికారి కుటుంబం కూడా ఇలాంటి అభిప్రాయాన్నే పంచుకుంది. ఆయన బంధువు మాట్లాడుతూ.. " ఒక్క బితన్ మాత్రమే కాదు. ఎన్నో ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ప్రభుత్వం సకాలంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఇది సాహసోపేతమైన చర్య," అని పేర్కొన్నారు.
భారత వైమానిక దాడుల్లో జైషే మహమ్మద్ కేంద్రంగా పనిచేస్తున్న బహావల్పూర్, లష్కరే తోయ్బా శిక్షణా స్థావరం మురిద్కేను ధ్వసం చేసింది.