కామ్రేడ్ బృందా.. నేటి తరానికి ఆదర్శం..

‘మహిళలు లండన్‌లో పని చేయాలనుకుంటే స్కర్టులు, కోట్లు ధరించాలని ఎయిర్ ఇండియా సూచించినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. నా దేశ చిహ్నమైన చీరను ఎందుకు ధరించకూడదు?”

Update: 2024-03-30 01:32 GMT
బృందా కారత్

56 ఏళ్ల కిందట.. లండన్ హీత్రూ విమానాశ్రయం

ఎయిర్ ఇండియా అధికారి:

సీ.. మిస్.. యూ ఆర్ ఇన్ లండన్. యూ హావ్ టు వేర్ స్కర్ట్. ఎయిర్ ఇండియా వోన్ట్ ఎలవ్ శారీ ఫర్ హర్ స్టాఫ్ ప్లీజ్.. (చూడండి, మీరు లండన్ లో ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో పని చేసే సిబ్బంది స్కర్ట్ లు వేసుకోవాల్సిందే తప్ప చీరె కట్టును అనుమతించదు)


స్టాఫ్ :

అదెలా కుదురుతుంది. మేము ఇక్కడ చీరె కూడా కట్టుకుంటాం. చీరెను అనుమతించాల్సిందే..

ఎయిర్ ఇండియా అధికారి: నో.. కుదరదు.. స్కర్ట్ వేసుకోవాల్సిందే.

స్టాఫ్ : అయితే మేము సమ్మె చేయాల్సివస్తుంది.

ఎయిర్ ఇండియా అధికారి: చేస్కోండి.

అలా బ్రిటిష్ గడ్డపై విమానాశ్రయంలో చీర కట్టుకోవాలనే డిమాండ్ తో మొదలైన సమ్మె మూడు వారాల పాటు సాగింది. ఎయిరిండియా యాజమాన్యం మెడలు వంచింది. ఎయిరిండియా సిబ్బందికి చీర కట్టుకునేలా నేర్పింది. ఆ సమ్మెకు నాయకత్వం వహించింది నేటి సీపీఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు నాటి ఎయిర్ ఇండియా విమానసంస్థ ఉద్యోగి బృందాదాస్.

ఆ సందర్భంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్.. ‘బృందా దాస్, మీరు విజయం సాధించారు. మీరు మాత్రమే కాకుండా ఎయిర్ ఇండియాలో ఎవరైనా చీరె కట్టుకునేలా చేశారు’ అన్నప్పుడు ఆమె పొంగిపోలేదు. ఈ విజయం నాదేనని చెప్పుకోలేదు. "సారీ, గెలిచింది నేను కాదు. శారీ జాతీయవాదం" అని చెప్పిన సమాధానం ఆ అధికారి మతిపోగొట్టొంది. వ్యక్తిగత విజయాన్ని జాతీయ వాదంతో పోల్చి చెప్పినందుకూ, ఈ విజయాన్ని సొంత ఖాతాలో వేసుకోవడానికి బదులు అందరికీ వర్తింపజేసేలా మాట్లాడినందుకు...ఆమెను అభినందించకుండా ఉండలేక పోయారు.

‘మహిళలు లండన్‌లో పని చేయాలనుకుంటే స్కర్టులు, కోట్లు ధరించాలని ఎయిర్ ఇండియా సూచించినప్పుడు నేను అభ్యంతరం చెప్పాను. ఓ భారతీయురాలిగా నేను నా దేశ చిహ్నమైన చీరను ఎందుకు ధరించకూడదు?” ఈ పట్టుదలే ఆమెను రాటు దేల్చింది. ఒంటరి పోరాటానికి పురికొల్పింది. విజయం సాధించింది.

అప్పుడు అలన్ బృందాతో ఇలా అన్నారు.. 'నా సమస్య పరిష్కారమైంది. ఇక ఇప్పుడు మీకో సమస్య మొదలైంది. ‘చీర కట్టడం నేర్పించాలని డిమాండ్ చేస్తున్న బ్రిటిష్ యువతుల్ని ఎంపిక చేయడం, వారికి చీరె కట్టు నేర్పించడం మీ బాధ్యత' అని చెప్పినపుడు దానికి సిద్ధపడి ఎయిర్ ఇండియా సిబ్బందికి చీరె కట్టడం నేర్పించారు బందా.

గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తండ్రి సూరజ్ లాల్ దాస్ తన కుమార్తె బందాను పిలిచి నేను చదువు చెప్పించా. ఇక నువ్వు నీ కాళ్ళపై నిలబడమని చెప్పారు. దాంతో ఆమె 1967లో ఎయిర్ ఇండియాలో చేరారు. 1970 వరకు పనిచేశారు. రాజీనామా చేసిన తర్వాత కోల్‌కతాకు తిరిగి వచ్చి సిపిఎంలో చేరారు. ఆ బృందా ఇప్పుడు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సరిగ్గా రెండు నెలలకు పుట్టారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే ఆమె అదే ఏడాది అక్టోబర్ 17న కోల్‌కతాలో జన్మించారు. తండ్రి సూరజ్ లాల్ దాస్ పాకిస్తాన్ లోని లాహోర్ నుంచి వలస వచ్చారు. తల్లి ఒషుకోనా మిత్ర బెంగాలి. వీళ్లది ప్రేమ పెళ్లి. పెద్దలు వ్యతిరేకించినా ఓషుకోనా సూరజ్ ను వివాహమాడారు. బృందాకు ఒక సోదరుడు, ముగ్గురు అప్పచెల్లెళ్లు. ఐదేళ్ల వయసులో బృందా తన తల్లి ఒషుకోనా మిత్రను కోల్పోయినా తండ్రి తన పిల్లల్ని చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు. ఎన్.డి.టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ప్రణయ్ రాయ్‌ని పెళ్లాడిన రాధిక ఆమె చెల్లెలే.


బృందా ప్రాథమిక విద్య డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పూర్తి చేశారు. 16 ఏళ్ల వయస్సులో, అతను మిరిండా హౌస్‌లోని దర్హి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి బీఏ పట్టా తీసుకున్నారు. 1967లో లండన్ వెళ్లిన బృందా కొంత కాలం ఎయిర్ ఇండియాలో పని చేసి రాజీనామా చేసి వచ్చి సీపీఎం అనుబంధ సంఘాలలో పని చేశారు.

రాజకీయాల్లోకి రావడానికి మహిళలు వెనకాడుతున్న దశలో బృందా వామపక్ష రాజకీయాల వైపు మళ్లారు. అరుదైన కమ్యూనిస్టు రాజకీయ వేత్తగా ఎదిగారు. నుదుట పెద్ద బొట్టు, ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని వర్చసు ఉన్న బృందా అనర్ఘళంగా హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ, కొన్ని తెలుగు పదాలు మాట్లాడగలరు. దేశంలో ఫెమినిస్ట్ ఉద్యమానికి ఊపిరులు వారిలో బృందా కారత్ ఒకరు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఎం తరఫున రాజ్యసభకు 2005 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2005లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళ బృందా కారత్.

ప్రస్తుతం దేశవ్యాపంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యానికి ప్రమాదం రానుందని కొందరు, అదంతా భ్రమేనని మరికొందరు వాదించుకుంటున్న సందర్భం. సరిగ్గా ఈ సమయంలో బృందా కారత్ 1975 నాటి ఎమర్జెన్సీ నాటి మొదలు కమ్యూనిస్టు ఉద్యమం ఉజ్వలంగా సాగిన1985 వరకు తన జ్ఞాపకాలను, ఇతర వ్యాసాలను కలిపి ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. “యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా” పేరిట ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్ కు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొంటున్న వారు ప్రత్యేకించి నేటి యువతరం తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం లాంటివే. కనువిప్పు కలిగించేవే. పదేళ్ళ చరిత్రను కళ్లకు కట్టారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో పదేళ్ల కాలాన్ని గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రాయడమంటే మామూలు విషయం కాదు. అసాధారణ ప్రతిభ ఆమె సొంతమనిపించేలా ఆ కాలంలో తాను అక్కడుండి చూసినట్టుగా రాయడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలం నుంచి మొదలు పెట్టి ఢిల్లీ గల్లీలలో జరిగిన పోరాటాలను, కష్టకాలంలో జరిగిన చర్చల్ని, నాయకుల తీరు తెన్నుల్ని ఆమె రికార్డ్ చేశారు.

యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా అని పేరు పెట్టినా ఆ రీటా మరెవరో కాదు ఈ బృందాయే. ఆమె మారు పేరు రీటా అని ఈ పుస్తకం చదివిన తర్వాత తెలుస్తుంది. రీటా పేరిట రాసిన వ్యాసాలన్నీ బృందా కారత్ రాసినవే. పురుషాధిక్య సమాజంలో పని చేసే ఓ యువతి అనుభవాలే ఈ పుస్తకం. ఈ చిన్నపుస్తకం చదివిన తర్వాత మనం ఔరా అనకుండా బృందా కారత్ కి జేజేలు పలక్కుండా ఉండలేం. ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడిన ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. రాజకీకీయాల్లోకి వచ్చినందుకు ఎన్నడూపశ్చాత్తాపడలేదని చెప్పే ఆమె.. మహిళలు మరింతమంది రాజకీయాల్లోకి రావాలంటారు. సామాజిక మార్పు, సామాజిక విప్లవంపై నమ్మకంతోనే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటారు. మరి మీరెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని అడిగితే.. ఇప్పుడు తన వయసు 70 దాటిందని, ఈ వయస్సులో పరిగెత్తడం సాధ్యమనిపించుకోదంటారు. భవిష్యత్ అంతా యువతరానిదేనని, నేటి పరిస్థితుల్ని మార్చాలంటే యువతీ యువకులు నడుంకట్టాలంటారు. ఈ ఎన్నికల్లోనైనా మరింత మహిళలు రాజకీయాల్లోకి వస్తారన్న ఆశాభావంతో ఉన్నారు బృందా కారత్.

Tags:    

Similar News