బడ్జెట్‌ 'వివక్షపూరితం' - ఇండియా కూటమి ఎంపీల నిరసన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజా వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు ఖర్గే. బడ్జెట్ కేటాయింపుతో ఎవరికీ న్యాయం జరగలేదన్నారు.

Update: 2024-07-24 06:34 GMT

బడ్జెట్‌ కేటాయింపుల్లో ఇండియా కూటమి పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిందంటూ కూటమి ఎంపీలు పార్లమెంటు ఆవరణలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు పార్లమెంట్‌ మకర‌ద్వార్‌ మెట్లపై నిరసన చేపట్టారు.

మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడి నివాసంలో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఖర్గే, రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ ఉపనేత ప్రమోద్ తివారీ, లోక్‌సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్, NCP (SCP) చీఫ్ శరద్ పవార్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్, TMC నాయకులు డెరెక్ ఓబ్రెయిన్, కళ్యాణ్ బెనర్జీ, డిఎంకెకు చెందిన టిఆర్‌ బాలు, జెఎంఎంకు చెందిన మహువా మాజి, ఆప్‌కి చెందిన రాఘవ్‌ చద్దా, సంజయ్‌సింగ్‌, సిపిఎంకు చెందిన జాన్‌ బ్రిట్టాస్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బడ్జెట్‌ కేటాయింపులను తప్పుబడుతూ బుధవారం నిరసన తెలపాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజా వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు ఖర్గే. బడ్జెట్ కేటాయింపుతో ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. ప్రత్యేక హోదాను పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారని పేర్కొన్నారు.

‘వి వాంట్‌ ఇండియా బడ్జెట్‌.. ఎన్‌డిఎ బడ్జెట్‌ కాదు’ అంటూ ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు. నిన్న బడ్జెట్ ద్వారా సమాఖ్య వ్యవస్థను భారత ప్రభుత్వం ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఆరోపించారు.

‘‘ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు జరిగింది. కేవలం రెండు రాష్ట్రాలకే ఎక్కువ నిధులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు నిధుల కేటాయింపునకు మేం వ్యతిరేకం కాదు. ఇతర రాష్ట్రాలకు కూడా న్యాయం జరగాలి. అందుకే ఈరోజు ఉద్యమిస్తున్నాం.’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు.

"ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌తో చాలా రాష్ట్రాలపై వివక్ష చూపారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేం నిరసన తెలపాలనుకున్నాం’’ అని వేణుగోపాల్ విలేకరులతో అన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా జూలై 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బహిష్కరించనున్నారని ఎక్స్ వేదికగా వేణుగోపాల్ పోస్టు పెట్టారు.

బడ్జెట్‌లో యువతకు తప్పుడు హామీలు ఇచ్చారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఆరోపించారు. తమ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌పై వివక్ష కొనసాగుతోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు.

Tags:    

Similar News