ఎన్నికల ముందు రుణమాఫీ హామీ ఇవ్వలేదు..

ప్రభుత్వం చెప్పాలనుకున్నదే చెప్పారని పవార్‌ను సమర్థించిన సీఎం ఫడ్నవిస్;

Update: 2025-05-02 13:57 GMT
Click the Play button to listen to article

ఎన్నికల ముందు తాము ఏ రుణ మాఫీ హామీ ఇవ్వలేదని మహారాష్ట్ర(Maharashtra) ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) అన్నారు. మహాయుతి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన రుణ మాఫీ హామీని విస్మరించిందని కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ థోరాట్ ఆరోపించారు.

2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) కలిసి ఏర్పడిన మహాయుతి కూటమి మొత్తం 288 స్థానాల్లో 230 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

‘అధికారంలోకి రాగానే మర్చిపోయారు’..

“రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయారు. ప్రజలు మోసపోయామన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వం కొన్ని రంగాలపై విపరీతంగా ఖర్చు చేస్తోంది. కానీ రైతుల రుణమాఫీపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఇది దురదృష్టకరం,” అని థోరాట్ పేర్కొ్న్నారు. రైతు నేత రాజూ శెట్టి కూడా ప్రభుత్వం వ్యవసాయ సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సోయా, పత్తికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.

థోరాట్ వ్యాఖ్యలపై మీ స్పందనేంటని కొంతమంది పాత్రికేయులు అడిగారు. “నేను అలా హామీ ఇచ్చానా? అంటూ సమాధానం చెప్పకుండానే విలేఖరుల సమావేశం నుంచి వెళ్లిపోయారు.

పవార్‌ను సమర్ధించిన సీఎం..

రైతు రుణ మాఫీ గురించి మార్చినెలలో అజిత్ పవార్ తన స్వగ్రామం బారామతిలో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే రాష్ట్రానికి పంట రుణ మాఫీ ఇవ్వడం సాధ్యపడదరని, రైతులు అధికారిక ప్రకటన కోసం వేచి లేకుండా..తమ వాయిదాలను సమయానికి చెల్లించాలని కోరారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్(Devendra Fadnavis) అజిత్ కు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం చెప్పాలనుకున్నదే పవార్ చెప్పారని పేర్కొన్నారు. 

Tags:    

Similar News