నాపై ఈడీని ఉసిగొలుపుతున్నారు.. రాహుల్

పార్లమెంట్‌లో తన ‘చక్రవ్యూహ’ ప్రసంగం తర్వాత కేంద్రం తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ చెప్పారు.

Update: 2024-08-02 12:36 GMT

పార్లమెంట్‌లో తన ‘చక్రవ్యూహ’ ప్రసంగం తర్వాత కేంద్రం తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రైడ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు.

వాటిని నేను సిద్ధంగా ఉన్నా..

"కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ నాపై దాడి చేసేందుకు రెడీ అవుతోంది. లోక్‌సభలో నా చక్రవ్యూహ ప్రసంగం 2 ఇన్ 1కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారు ఈడీని ఉసిగొల్పుతున్నారు. ఇలాంటి దాడులను తట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రధాని మోదీ పాలనలో రైతులు, కార్మికులు, యువత భయాందోళనకు గురవుతున్నారు" అని రాహుల్ ఎక్స్‌లో శుక్రవారం పోస్టు చేశారు.

కేంద్ర బడ్జెట్‌‌పై రాహుల్ గాంధీ జూలై 29న పార్లమెంట్‌లో సుధీర్ఘ ప్రసంగం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, అభిమన్యుడిని మరణాన్ని ప్రస్తావిస్తూ.. ప్రధాని హోంమంత్రిని ఎండగట్టారు. ‘‘అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో... ఇప్పుడు దేశాన్నీ అలా చేయబోతున్నారు. ఈ రోజు కూడా పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారు’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు.

రాహుల్ కు మద్దతు..

కాగా "రాజకీయ వేధింపుల కోసం బిజెపి ప్రభుత్వం ఇడి, సిబిఐ, ఆదాయపు పన్ను శాఖలను దుర్వినియోగం చేయడాన్ని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. విపక్ష నేతలను బెదిరించి, ప్రజాస్వామ్య సూత్రాలను నిర్వీర్యం చేయడం, రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేయడం ఆమోదయోగ్యం కాదు.” అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. పలువురు కాంగ్రెస్‌, ప్రతిపక్ష నాయకులు కూడా రాహుల్ కు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను కేంద్రం "దుర్వినియోగం" చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ, నాగౌర్ ఎంపీ హనుమాన్ రామ్‌దేవ్ బెనివాల్ మాట్లాడుతూ గాంధీ చెప్పింది నిజమేనని, దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్నారు.

“ఇద్దరు సీఎంలు జైలులో ఉన్నారు. వారికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిని నోరుమూయించే ప్రయత్నం చేస్తారని అందరికీ తెలుసు. వారు ఒక వ్యక్తి పరువు తీసేందుకు ఈడీ రైడ్ చేయవచ్చు లేదా సీబీఐని పంపవచ్చు. రాహుల్ చెప్పినట్టుగా జరిగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’అని అన్నారు.

ఇండిపెండెంట్ ఎంపి పప్పు యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం, ఈడీ ధోరణి ప్రజలను భయపెట్టడమేనని, అయితే రాహుల్ వాటికి భయపడనని చెప్పారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఈడీ, సీబీఐ సంస్థలు పని చేస్తున్నాయన్నారు. కాలం మారిందని, ప్రస్తుతం వారి సంఖ్య 240కి చేరిందని సింగ్ విలేకరులతో అన్నారు.

Tags:    

Similar News