మైక్రో ఫైనాన్స్ ఆగడాలకు కర్ణాటక ప్రభుత్వం చెక్ పెట్టబోతుందా?
కర్ణాటక సర్కారు కొత్త ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం..10 సంవత్సరాల జైలు, రూ. 5 లక్షల జరిమానా విధించేలా ఆర్డినెన్స్..;
కర్ణాటక (Karnataka) గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బుధవారం (ఫిబ్రవరి 12) సూక్ష్మ రుణ సంస్థల (Microfinance Institutions - MFIs) నుంచి రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. నిబంధనల ఉల్లంఘించిన వారికి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తారు.
ఆర్డినెన్స్ లక్ష్యం..
కర్ణాటక మైక్రో ఫైనాన్స్ (బలవంతపు చర్యలను నిరోధించే) ఆర్డినెన్స్ - 2025 .. ఆర్థికంగా బలహీన వర్గాలైన రైతులు, మహిళలు, మహిళా స్వయం సహాయ సంఘాలను అధిక వడ్డీ రేట్లు, బలవంతపు రుణ వసూళ్ల నుంచి రక్షణ కోసం తీసుకొచ్చారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన 30 రోజులలోగా సూక్ష్మ రుణ సంస్థలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సేవలు అందించే గ్రామం, పట్టణం, జిల్లా వివరాలను ప్రకటించాలి. వడ్డీ రేట్లు, రుణం మంజూరు, రికవరీ విధానం, రికవరీ వ్యక్తుల వివరాలను అందించాలి. రిజిస్ట్రేషన్ లేకుండా రుణాలు ఇవ్వడం, రికవరీ చేయడం నిషేధం. వడ్డీ రేట్లలో పారదర్శకత ఉండాలని, వాటిని కూడా ప్రకటించాల్సిందిగా ఆదేశించింది.
బలవంతపు రికవరీపై శిక్షలు..
మైక్రో ఫైనాన్స్ సిబ్బంది లోన్ రికవరీ కోసం బలవంతం చేస్తే శిక్ష తప్పదు. రుణగ్రహీత అస్తులను స్వాధీనం చేసుకోవడం లేదా వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం, రుణగ్రహీత ఇంటికి తరచుగా వెళ్లడం, రికవరీ కోసం బయటి వ్యక్తులను పంపడం, బలవంతంగా ఆస్తి పత్రాలు లాక్కోవడం చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష రూ. 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ఒంబుడ్స్‌మన్ నియామకం
రుణగ్రహీత, రుణదారు మధ్య మధ్యవర్తిగా ఒంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రుణ వసూళ్లలో వివాదాలను పరిష్కరించేందుకు సాయపడుతుంది.
గవర్నర్ ఆమోదం..
ఈ ఆర్డినెన్స్‌కు మొదట గవర్నర్ (Governor Thaawarchand Gehlot) అభ్యంతరం వ్యక్తం చేసి, ఫిబ్రవరి 8న తిరస్కరించారు. తర్వాత సమాజంలో భాగమయిన రుణదాతలకు అన్యాయం జరుగుతుందనే అభిప్రాయానికి వచ్చి, కొన్ని సవరణల అనంతరం ఫిబ్రవరి 10న ప్రభుత్వం మళ్లీ ఆర్డినెన్స్‌ను పంపగా.. బుధవారం (ఫిబ్రవరి 12) ఆయన ఆమోదం తెలిపారు. ప్రభుత్వం తదుపరి శాసనసభ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చే యోచనలో ఉంది.