మా జగనన్న, బాబన్న.. బీజేపీకి గులాం గిరీ చేస్తున్నారెందుకో!
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. పలువురు పార్టీ నేతల్ని కలిశారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇమ్మని కోరారు. ఏపీ భవన్ లో దీక్ష చేశారు.
‘మా అన్న, వైసీపీ అధ్యక్షుడైన జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడి ప్రభుత్వాలు రెండూ బీజేపీకి ఎందుకో గులాంగిరీ చేస్తున్నాయి. వంగి వంగి సలాంలు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అంతగా లొంగి ఉండాల్నా?‘ అన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్ర విభజన చట్టం అమలులోని ఏ ఒక్క హామీని అమలు చేయని మోదీ ప్రభుత్వంపై ప్రస్తుత ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై ఉలుకూ పలుకూ లేని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే పేరిట ఢిల్లీలో దీక్ష కోసం వెళ్లిన వైఎస్ షర్మిల ఇవాళంతా దేశ రాజధానిలో బిజీబిజీగా గడిపారు. సీపీఐ, సీపీఎం నేతల్ని కలిశారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఆ తర్వాత ఏపీ భవన్ లో నిరాహర దీక్ష చేశారు.
ఏపీ భవన్ లో షర్మిల దీక్ష...
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి దీక్ష చేశారు. ‘‘ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మాట చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదు’’ అని ప్రశ్నించారు. ‘‘దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు’’ అని షర్మిల విమర్శించారు.
ఒక్క సీటు లేకపోయినా రాష్ట్రంలో బీజేపీదే అధికారమా...
‘‘ఏపీలో.. బీజేపీకి ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే స్థానంలో గెలవలేదు. అయినా ఆ పార్టీయే రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. సీఎం జగన్ బీజేపీకి గులాంగిరి చేస్తున్నారు. ఏపీ ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారు. కచ్చితంగా ఈ విషయంలో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏపీ ప్రజలను పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ వైసీపీ ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయినా సరే అన్ని అంశాల్లో బీజేపీకే మద్దతు ప్రకటిస్తున్నారు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
సీతారామ్ ఏచూరితో భేటీ...
అంతకుముందు ఏపీ కాంగ్రెస్ నేతలు వైఎస్ షర్మిల, మాజీ ఎంపి కేవీపీ రామచంద్రరావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు తులసిరెడ్డి, రఘువీరారెడ్డి, రుద్ర రాజు ఇంకా అనేక మంది సీపీఎం ఆఫీసుకు వెళ్లి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో కలిసి మాట్లాడారు. షర్మిల, సీతారాం ఏచూరి ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ద్రోహం చేసిందే నరేంద్ర మోదీ అని ఏచూరి విమర్శించారు. సీపీఎం ఎంపీలు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఏపీ కి జరిగిన అన్యాయాన్నీ, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తారని హామీ ఇచ్చారు.