Maharashtra | ‘మంత్రి ధనంజయ్ ముండేను మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి’
ధనంజయ్ ముండే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎన్సీపీ (అజిత్ పవార్) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే డిమాండ్ చేశారు.;
మహారాష్ట్రలోని బీడ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య రాజకీయ రంగు పులుముకుంది. మహాయుతి కూటమిని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ ముండేపై విరుచుకుపడిని విషయం తెలిసిందే. హత్య కేసులో పుణెలో అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులు కాదని, అసలు కుట్రదారుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడని ఆయన ఆరోపించారు. ధనంజయ్ ముండే కేబినెట్ నుంచి తప్పుకోవాలని ఎన్సీపీ (అజిత్ పవార్) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే తాజాగా డిమాండ్ చేశారు.
ముండేపై పెరుగుతున్న ఒత్తిడి
ఎన్సీపీ (అజిత్ పవార్) తరపున ముండేకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి సోలంకేనే. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. "ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న సమయంలో తన అధికారాలన్నింటినీ అనుచరుడు వాల్మిక్ కరాడ్‌కు అప్పగించారు. ఇప్పుడు సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్యకేసులో కరాడ్ అరెస్టయ్యాడు. ఈ కేసు దర్యాప్తు జరగాలి. దర్యాప్తు ముగిసేవరకు ముండే తాత్కాలికంగా మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి. ముండే స్వయంగా తప్పుకోకపోతే పార్టీ నాయకత్వం ఆయన్ను తప్పించాలి. ఈ విషయాన్ని ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో మాట్లాడాను. అదే విషయాన్ని పబ్లిక్‌గా చెబుతున్నా," అని సోలంకే పేర్కొన్నారు.
దర్యాప్తు పారదర్శకంగా జరగాలి..
హత్య కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, నిందితులకు సహకరించినవారి పేర్లు బయటపెట్టాలని సంతోష్ సోదరుడు ధనంజయ్ డిమాండ్ చేశారు.
డాక్టర్ ఇచ్చిన సమాచారంతో నిందితుల అరెస్టు
నాందేడ్ జిల్లాలో వైద్యుడు డాక్టర్ సంబాజీ వైభవసే అరెస్టుతో సర్పంచ్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. సుదర్శన్ ఘులేతో డాక్టర్ సంబాజీకి సంబంధాలున్నాయన్న అనుమానంతో పోలీసులు అతని కదలికలపై నిఘా పెట్టారు. తర్వాత డాక్టర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇచ్చిన సమాచారంతో పుణెలో సుదర్శన్ ఘులే, సుధీర్ సంగ్లేలను పోలీసులు అరెస్టు చేశారు.
సర్పంచ్ హత్య వెనుక అసలు కథ..
విండ్‌మిల్ కంపెనీ నుంచి డబ్బు డిమాండ్ చేయడాన్ని వ్యతిరేకించిన సంతోష్ దేశ్‌ముఖ్‌ను డిసెంబర్ 9న కొందరు కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర ఎన్‌సీపీ (NCP) మంత్రి ధనంజయ్(Dhananjay) ముండే సన్నిహితుడు వాల్మిక్ కరాద్ మంగళవారం పూణెలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అదే రోజు బీడ్ జిల్లాలోని కేజ్‌లోని కోర్టుకు తీసుకెళ్లి 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. దేశ్‌ముఖ్ హత్యను దర్యాప్తు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.