‘నిరుద్యోగులను అలా ఉంచడమే మోదీ లక్ష్యం’

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. నిరుద్యోగ సమస్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2024-07-09 10:13 GMT

 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. నిరుద్యోగ సమస్యపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోదీ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ (నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) వార్షిక సర్వే ప్రకారం..2015 - 2023 మధ్య ఏడేళ్ల కాలంలో 54 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, CMIE (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) ప్రకారం దేశంలో ప్రస్తుత నిరుద్యోగిత రేటు 9.2 శాతానికి చేరుకుందని, ఇది మహిళలకు 18.5 శాతంగా ఉందని అన్నారు. నిరుద్యోగంపై సిటీ గ్రూప్ నివేదికను మోడీ ప్రభుత్వం ఖండించినా.. ప్రభుత్వ డేటాను ఎలా కాదనగలరని ఎక్స్‌లో ఎన్డీఏ సర్కారును ఖర్గే ప్రశ్నించారు.

గత పదేళ్లలో కోట్లాది యువత కలలు గల్లంతు కావడానికి మోదీ ప్రభుత్వమే కారణమని పేర్కొన్నారు. "2010-11లో దేశం అంతటా 10.8 కోట్ల మంది ఉద్యోగులు ఇన్‌కార్పొరేటెడ్, నాన్ అగ్రికల్చరల్ ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేశారు. ఇది 2022-23లో 10.96 కోట్లకు చేరుకుంది. అంటే 12 సంవత్సరాలలో 16 లక్షలకు పెరిగింది" అని వివరించారు. తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS)ని ఖర్గే ఉదహరిస్తూ.. పట్టణ నిరుద్యోగిత రేటు 6.7 శాతం (Q4, FY24) వద్ద ఉందన్నారు. ప్రభుత్వ డేటాను విశ్లేషించిన తర్వాత ఐఐఎం లక్నో నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగం పెరుగుదల, విద్యావంతుల్లో అధిక నిరుద్యోగం, శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందని ఖర్గే చెప్పారు.

"ILO నివేదిక ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83% మంది యువత ఉన్నారు. ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం 2012 2019 మధ్య సుమారు 7 కోట్ల మంది యువత శ్రామిక శక్తిలో చేరారు. కానీ ఉపాధిలో సున్నా వృద్ధి - 0.01 మాత్రమే." అని ఖర్గే పేర్కొన్నారు. దేశంలో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్‌లలో 42.3 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని కాంగ్రెస్ చీఫ్ అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ 2023 నివేదికను కూడా ప్రస్తావించారు. సిటీ గ్రూప్ తాజా నివేదిక ప్రకారం.. దేశానికి ఏటా 1.2 కోట్ల ఉద్యోగాలు అవసరం. 7% GDP వృద్ధి కూడా మన యువతకు తగినంత ఉద్యోగాలను సృష్టించలేకపోయింది. మోడీ ప్రభుత్వంలో దేశం సగటున 5.8% మాత్రమే సాధించింది." అని ఆయన అన్నారు. “ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, లేదా ప్రైవేట్ రంగం, స్వయం ఉపాధి లేదా అసంఘటిత రంగం కావచ్చు. ‘యువతను నిరుద్యోగులుగా ఉంచడం మోదీ ప్రభుత్వం ఏకైక లక్ష్యమని ఖర్గే ఆరోపించారు.

Tags:    

Similar News