పూరీ జగన్నాథ ఆలయ రత్న భాండాగార్‌లో విలువైన ఆభరణాలు..

46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు గది ద్వారాలను తెరిచారు.

Update: 2024-07-14 11:54 GMT

46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు గది ద్వారాలను తెరిచారు. అంతకుముందు గదిలోకి వెళ్లే 11 సభ్యుల బృందం 12 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. రత్న భాండాగారం తెరవనున్న నేపథ్యంలో ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు వారు పాల్గొన్నారు. 11 మంది సభ్యుల్లో ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్‌జెటిఎ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాఢీ, ఎఎస్‌ఐ సూపరింటెండెంట్ డిబి గడానాయక్, పూరీ బిరుదు రాజు, గజపతి మహారాజు ప్రతినిధి కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో నలుగురు సేవకులు, పట్జోషి మోహపాత్ర, భండార్ మేకప్, చధౌకరణ, ద్యులికరన్ ఉన్నారు.

ఐదు పెట్టెల్లో ఆభరణాలు..

పూరీ జగన్నాథుని ఆభరణాలను ఐదు పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా.. 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో లెక్కలపై సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది.

ఇచ్చిన హామీ మేరకే..

ఇటీవల జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రత్న భాండాగార్‌ను తిరిగి తెరవడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. తాము అధికారంలోకి వస్తే రహస్య గది తలుపులు తెరుస్తామన్న బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఆ హామీ మేరకు ప్రస్తుతం రత్న భాండాగార్‌ ద్వారాలు తెరిచారు.

“మీరు కోరుకున్నట్లే..జగన్నాథ ఆలయం నాలుగు ద్వారాలు తెరిచారు. ఈ రోజు మీ కోరిక మేరకు.. 46 సంవత్సరాల తర్వాత గొప్ప ప్రయోజనం కోసం రత్న భాండార్ తెరిచారు ”అని సీఈంవో ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

‘‘గదిని తిరిగి తెరిచినా.. విలువైన వస్తువుల జాబితాను వెంటనే సిద్ధం చేయడం వీలుకాదు. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులున్న చెక్క పెట్టెలను స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాం. ఈ గది చుట్టూ పోలీసులను ఉంచారు. సీసీ కెమెరాలను అమర్చి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన ఆభరణాలను లెక్కకట్టేవారు, స్వర్ణకారులు ఆభరణాలను లెక్కపెడతారు.’’ అని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (ఎస్‌జెటిఎ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాడీ తెలిపారు.

‘‘పాములు పట్టేందుకు రెండు టీంలను రప్పించారు. ఒక టీం గది బయట, మరొకటి గది లోపల ఉంచారు’’ అని స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సభ్యుడు శుభేందు మల్లిక్‌ తెలిపారు. 

Tags:    

Similar News