కోల్‌కతాలో ఆర్జీ కర్ నిరసనకారులపై లాఠీచార్జి
సుమారు 100 మందికి గాయాలు.. గాయపడ్డ వారిలో బాధితురాలు తల్లిదండ్రులు కూడా..;
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి సరిగ్గా ఏడాది గడిచింది. ఈ సందర్భంగా శనివారం (ఆగస్టు 9) ర్యాలీ నిర్వహించిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
ర్యాలీ గురించి ముందుగానే తెలుసుకున్న పోలీసులు..అసెంబ్లీ పాయింట్ దాటి ముందుకు రావొద్దని నిరసనకారులను కోరారు. అయినా వారి హెచ్చరికను లెక్కచేయక, బారికేడ్లపైకి ఎక్కడం, వాటిని పక్కకు నెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
ఇటు పోలీసుల వైఖరిని తప్పుబడుతూ..బీజేపీ నాయకుడు అగ్నిమిత్ర పాల్, ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి స్ట్రీట్-జెఎల్ నెహ్రూ రోడ్ క్రాసింగ్ వద్ద ధర్నాకు దిగారు. లాఠీచార్జిలో సుమారు 100 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, వారిలో బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనకు మమతా బెనర్జీ మూల్యం చెల్లించుకోక తప్పదని సువేందు హెచ్చరించారు.
శాంతియుత నిరసనకు కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తమను ఎందుకు ఆపుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ప్రశ్నించారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెద్దదైంది. "మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? నబన్న వద్దకు వెళ్లి మా కూతురికి న్యాయం చేయాలని మాత్రమే మేం కోరుతున్నాం, ’’ అని బాధితురాలి తల్లి పోలీసులతో అన్నారు.