జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో రాహుల్ భేటీ..
ఢిల్లీలో బంద్ పాటించిన వ్యాపారులు.. మూతపడ్డ దుకాణాలు..;
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah)ను ఆయన నివాసంలో శుక్రవారం (ఏప్రిల్ 25) కలిశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటనను ఒమర్ అబ్దుల్లా రాహుల్‌కు వివరించారు. అంతకుముందు రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్యాటకులతో మాట్లాడారు.
పహల్గామ్(Pahalgam)కు 5 కిలోమీటర్ల దూరంలో ఉండే బైసరన్ లోయలోకి పాక్ ఉగ్రవాదులు (Terror Attack) ప్రవేశించి తుపాకులతో పర్యాటకులను కాల్చేసిన ఘటనలో 26 మంది చనిపోయారు. సుమారు 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ‘‘జమ్మూ కశ్మీర్‌వాసులంతా ఈ ఉగ్రచర్యను ఖండించారు. దేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ దాడి వెనుక ఉద్దేశం భారతీయులను చీల్చడమే. అందువల్ల మనమంతా ఐక్యంగా ఉండాలి. ఉగ్రవాదుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు మా మద్దతు ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
పరిస్థితిని అర్థం చేసుకుని, అవసరమైన సాయం చేసేందుకు ఇక్కడికి వచ్చానని చెప్పిన రాహుల్..ఆత్మీయులను కోల్పోయిన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
అంతకుముందు రాహుల్ గాంధీ వ్యాపారులు, విద్యార్థి నాయకులు, పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గురువారం అన్ని పార్టీల సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. 1960లో పాకిస్తాన్‌తో కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌లో ఉంటున్న పాక్ జాతీయులను తమ దేశం వెళ్లిపోవాలని కోరింది.