రాష్ట్ర విద్యా విధానాన్ని ఆవిష్కరించిన సీఎం స్టాలిన్..
NEP అమలు చేయకపోవడం వల్ల రూ.2,152 కోట్లను కేంద్రం నిలిపివేసిందని తమిళనాడు ఆరోపించింది.;
జాతీయ విద్యా విధానం (NEP) అమలుకు ససేమిరా అంటున్న తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర విద్యా విధానాన్ని (SEP) ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి కొట్టూర్పురంలోని అన్నా శతజయంతి గ్రంథాలయ ఆడిటోరియం వేదికైంది.
NEPకు ప్రత్యామ్నాయంగా SEP..
కేంద్రం ప్రతిపాదించిన NEPకు భిన్నంగా తమిళనాడు ప్రభుత్వం SEPని రూపొందించింది. 2022లో రిటైర్డ్ న్యాయమూర్తి మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల కమిటీ ఈ విధానాన్ని తయారు చేశారు. విస్తృత చర్చల అనంతరం, 2024 జూలైలో ముఖ్యమంత్రికి ఈ కమిటీ సిఫారసులను అందజేసింది. ఇప్పుడు ఆ విధానాన్ని అధికారికంగా ప్రకటించారు.
డిగ్రీ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో ప్రవేశానికి సాధారణ ప్రవేశ పరీక్షతో కాకుండా.. 11, 12వ తరగతుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇవ్వాలని కమిటీ సూచించింది. 3, 5, 8 తరగతుల్లో పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలన్న NEP ప్రతిపాదనను SEP తిరస్కరించింది.
సమగ్ర విద్యా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రూ.2,152 కోట్లను కేంద్రం నిలిపివేసిందని తమిళనాడు ఆరోపించింది. NEP అమలు చేస్తేనే నిధులు ఇస్తామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. NEP సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తుందని, హిందీని రుద్దే ప్రయత్నమని DMK ఆరోపిస్తోంది. SEP ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. “వారు వెయ్యి కోట్లు ఇచ్చినా తమిళనాడు NEPని అమలు చేయదు.” అని వ్యాఖ్యానించారు.