తమిళనాడులో ‘పింక్ రూమ్’ ల చర్చను లేవనెత్తిన నటుడు విజయ్
పింక్ రూములు ఎవరి కోసం ఏర్పాటు చేస్తారంటే..?;
By : The Federal
Update: 2025-08-19 09:44 GMT
ప్రమీలా కృష్ణన్
వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. కొత్తగా పార్టీ ప్రకటించిన తమిళ వెట్రి కజగం(టీవీకే) మధురై లో రెండో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో పాలిచ్చే తల్లుల కోసం ‘పింక్ రూమ్’ ఏర్పాటు చేసి అందరి దృష్టిని, ప్రశంసలను అందుకుంది.
అదే సమయంలో రాజకీయా పార్టీలు, సామూహిక సమావేశాలలో మహిళలకు వసతి కల్పించడానికి తగినంతగా ప్రాధాన్యం ఇస్తున్నాయా? అనే చర్చను లేవనెత్తింది.
ఫిబ్రవరి 2024 లో నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే, అక్టోబర్ 2024 లో విల్లుపురంలో తన మొదటి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆగష్టు 21న జరగనున్న రెండో సమావేశం ఓటర్లు, ప్రతిపక్ష పార్టీల దృష్టిని ఆకర్షించింది.
సంతోషంగా తల్లులు..
మహిళా కార్యకర్తలు సభలు సమావేశాలలో సరైన సౌకర్యాలు, భద్రత లేక ఇబ్బంది పడేవారు. వీటిని పరిష్కరించడానికి ఈ ఈవెంట్ అరేనాలో మహిళలకు స్థలం, నీటి సౌకర్యాలు, మరుగుదొడ్లు, తల్లిపాలు ఇచ్చే ప్రదేశాలను కేటాయించారు.
గతంలో ఇటువంటి కార్యక్రమాలకు హజరు కావడానికి సంకోచించిన చాలా మంది మహిళా కార్యకర్తలు వీటిని చూశాక వారి మనసు మార్చుకున్నారు.
‘‘పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు మహిళలకు అసౌకర్యంగా, గందరగోళంగా ఉంటాయి. కాబట్టి నేను సాధారణంగా వాటికి దూరంగా ఉంటాను. ఈ సారి నిర్వాహకులు మా అవసరాలను పట్టించుకున్నారని నేను భావించాను’’ అని మధురై కి చెందిన కే. లక్ష్మీ(28) అన్నారు. తన తొమ్మిది నెలల పాపతో సమావేశానికి హజరుకావాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు.
మహిళల భద్రతకు..
టీవీకే నిర్వహించే సమావేశానికి వచ్చే మహిళల భద్రత కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మధురై నార్త్ జిల్లాలోని టీవీకే మహిళా విభాగం అధిపతి తేన్మోళి ప్రసన్న మాట్లాడుతూ.. పార్టీ మాటలకు మించిన నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రదర్శించిందని అన్నారు.
‘‘విజయ్ నిజంగా కార్యాచరణ ఉన్న వ్యక్తి. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత అని ప్రకటించినప్పుడూ ఆయన కేవలం మాటలతోనే ఆగిపోలేదు. నిర్ధిష్టమైన చర్యల ద్వారా వాటిని ఆచరించి చూపుతున్నారు.
రాబోయే రెండో సమావేశంలో హజరయ్యే ప్రతి మహిళకు మద్దతు ఇవ్వడానికి, రక్షణ కల్పించడానికి మాత్రమే మందలాది మంది అంకిత భావంతో కూడిన మహిళా స్వచ్చంద సేవకులు హజరవబోతున్నారు’’ అని ఆమె ‘ది ఫెడరల్’ తో చెప్పారు.
భద్రతపై ప్రత్యేక దృష్టి..
ఈ సమావేశం కోసం మహిళల రక్షణ, సంరక్షణను నిర్ధారించడానికి 60 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక మహిళా భద్రతా కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రసన్న తెలిపారు. ‘‘తన అభ్యర్థనను పట్టించుకోకుండా తన మొదటి సమావేశానికి చాలా మంది మహిళలు చిన్న పిల్లలతో వచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లలకు పాలు ఇవ్వడానికి పింక్ రూమ్ లు ఏర్పాటు చేసింది. ఇది కేవలం ప్రణాళిక కాదు. గౌరవ చర్యల్లో ఒక భాగం’’ అని ప్రసన్న చెప్పారు.
ఈ చొరవ తమిళనాడు రాజకీయాల్లో ఒక ట్రెండ్ ను సృష్టించగలదని పరిశీలకులు అంటున్నారు. తమిళనాడు ఓటర్లలో దాదాపు సగభాగం మహిళలే ఉన్నారు. పాలక, ప్రతిపక్ష పార్టీలు త్వరలోనే ఇలాంటి సౌకర్యాలను ప్రవేశపెట్టాలనే ఒత్తిడి ఎదుర్కొంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ద్రవిడ ఉద్యమంలో మూలం..
కానీ పింక్ రూముల ఏర్పాటును ఇప్పుడే ప్రారంభమైందని చెప్పలేము. రాజకీయ విమర్శకుడు రచయిత ఆర్ కన్నన్ తమిళనాడు రాజకీయ సంస్కృతిలో మహిళల ఉనికి ద్రవిడ ఉద్యమకాలం నాటిదని, ఇది కుటుంబ భాగస్వామ్యాన్ని బలంగా ప్రొత్సహించిందని చెప్పారు.
‘‘ఇది డీఎంకే ఆలోచన’’ అని ఆయన గుర్తు చేశారు. ‘‘సమావేశాలకు హాజరు కావడానికి కుటుంబాలు నడిచి వెళ్లిన మొదటి పార్టీ డీఎంకే. నర్సింగ్ తల్లులు తమ పిల్లలతో రావడం, వేదిక వద్ద ఊయలలను ఏర్పాటు చేయడం, నాయకులు ప్రసంగాలు వింటూ శ్రద్దగా శిశువును ఊపడం సాధారణ దృశ్యం. ఇది ఒక అందమైన ఆభరణం’’ అని ఆయన ది ఫెడరల్ తో అన్నారు.
డీఎంకే ఆలోచన అప్ గ్రేడ్..
డీఎంకే వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై ఈ సంస్కృతిని సంస్థలో ఎలా ప్రవేశపెట్టారో ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘ఒక సమావేశంలో భారీ వర్షం కురిసినప్పుడూ అన్నా అన్ని కార్మికులకు ముందుగా మహిళలు, పిల్లలు ఆశ్రయం పొందేందుకు సహాయం చేయాలని ఆదేశించారు. ఆ సందర్బంలో ఎంజీఆర్ సహాయం చేయడానికి వేదిక నుంచి దిగి కిందకి వచ్చారు’’
టీవీకే చేసింది కేవలం అప్ గ్రేడ్ మాత్రమే అని కన్నన్ విశ్లేషించారు. 20 వ శతాబ్ధంలో పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక గదులు, ఏర్పాట్లు లేవు. కానీ మనం ఇప్పుడు 21 వ శతాబ్ధంలో ఉన్నాము. ఈ కాలానికి తగినట్లు మనం పనులు చేస్తున్నాము. ఇది భవిష్యత్ లో ఇతర పార్టీలు కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం’’ అని ఆయన అన్నారు.
మహిళలను ప్రొత్సహించడం..
రాజకీయ సమావేశాల్లో పింక్ రూమ్ శాశ్వతంగా ఉంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది. కానీ మధురైలో ఇది పెద్ద సంఖ్యలో మహిళలను ఆకర్షించడంలో మాత్రం విజయవంతమైంది. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇది అంతటా కొత్త చర్చలకు దారి తీసింది.
‘‘ఒక పార్టీ మన కోసం స్థలాన్ని కేటాయించినప్పుడూ అది మన ఉనికి ముఖ్యమని సూచిస్తుంది. ఇది మరింత మంది మహిళలు ముందుకు రావడానికి ప్రొత్సాహం ఇస్తుంది’’ అని జే మీనాక్షి(29) అనే టీవీకే కార్యకర్త అభిప్రాయపడ్డారు.
ఇతర సౌకర్యాలు..
ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 లక్షలకు పైగా పురుషులు, 50 వేల మంది దాక మహిళలలు, వందలాది సీనియర్ సిటిజెన్ లు, వికలాంగులు హజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి పిల్లలు, గర్భిణిలు హజరు కావడానికి అనుమతి లేదని టీవీకే ప్రత్యేకంగా పేర్కొంది.
పింక్ రూమ్ తో పాటు టీవీకే బృందం ఈ కార్యక్రమం కోసం వాటర్ కియోస్క్ లు, బాక్స్ టైప్ సీటింగ్ ఏర్పాట్లను చేసింది. ఈ సమావేశం కోసం 200 అడుగులు X 60 అడుగుల భారీ వేదికను నిర్మిస్తున్నారు.
పార్టీ నాయకుడు విజయ్ నడిచి పార్టీ కార్యకర్తలతో సంభాషించడానికి 800 అడుగుల దూరంలో ప్రత్యేక వేదికను కూడా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు ప్రారంభం అయి, సాయంత్రం ఏడు గంటలకు ముగుస్తుంది.
అత్యవసర పరిస్థితులకు సిద్దం..
నిర్వాహాకులు వంటి నీటి ట్యాంకులు, 400 తాత్కలిక మరుగు దొడ్లు, 50 కి పైగా ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు, 420 లౌడ్ స్పీకర్లు, 20 వేల లైట్లను ఏర్పాటు చేశారు. గందరగోళాన్ని నివారించడానికి పద్దెమినిది ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటు చేశారు.
వైద్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంబులెన్స్ లు, ప్రభుత్వ వైద్య బృందాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరింది. ప్రయివేట్ వైద్యులు, వైద్య పరికరాలు సైతం సిద్దంగా ఉంచారు. అగ్నిమాపక, రెస్క్యూ వాహనాల కోసం కనీసం 12 అత్యవసర లైన్లు ఖాళీగా ఉంచారు.