కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజుకో కొత్త అవినీతి ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ముడా స్కాం.. వాల్మీకీ కార్పొరేషన్ స్కాం.. బ్యాంకు డిపాజిట్ల గోల్ మాల్ స్కాంతో బొప్పికట్టించుకున్న సిద్దరామయ్య సర్కార్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుటుంబంలోని సంస్థలకు నిబంధనలకు విరుద్దంగా భూమిని కేటాయించిందని, ఇదో పెద్ద స్కామ్ అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది.
మల్లికార్జున్ ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు కొంత భూమి కేటాయింపులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు కమలం పార్టీ డిమాండ్ చేసింది. ఖర్గే వెంటనే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. కర్నాటకలో మంత్రి గా పని చేస్తున్న ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా రాజీనామా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధరామయ్య కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అవినీతి ఆరోపణలు
"కాంగ్రెస్ అవినీతి చర్యలలో స్థిరత్వం ఉంది... కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదంగా మారిందని చెప్పడం తప్పు కాదు" అని ఆయన అన్నారు. “మేము ముడా స్కామ్, వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ (కర్ణాటకలో) చూశాము. ఇప్పుడు కర్నాటకలో ఖర్గే, ఆయన కుటుంబం నడుపుతున్న ట్రస్టుకు ఐదెకరాల భూమిని కేటాయించిన కేసు బయటపడింది.
నిబంధనలను తుంగలో తొక్కి ఖర్గే కుటుంబం నిర్వహిస్తున్న ట్రస్టుకు భూమిని కేటాయించారని, ట్రస్టులో మల్లికార్జున్ ఖర్గే, ఆయన భార్య, అల్లుడు రాధాకృష్ణ, కుమారులు ప్రియాంక్ ఖర్గే, రాహుల్ ఖర్గే ఉన్నారని ఆరోపించారు.
ఖర్గే కుటుంబానికి అనుకూలమా?
"మాకు ఉన్న సమాచారం ప్రకారం, అనేక కంపెనీలు, సంస్థలు భూమి కోసం దరఖాస్తు ఇచ్చాయి, అయితే నిబంధనలను ఉల్లంఘించి ఖర్గే కుటుంబం నడుపుతున్న ట్రస్ట్‌కు భూమిని కేటాయించారు" అని భాటియా ఆరోపించారు. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు స్వతంత్ర సంస్థ సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు (కేఐఏడీబీ) భూమిని ఖర్గే కుటుంబం నడుపుతున్న ట్రస్టుకు కేటాయించడంపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లహర్ సింగ్ సిరోయా ఆదివారం ప్రశ్నించారు.
ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం..
మల్లికార్జున్ ఖర్గే తనయుడు రాహుల్ ఖర్గే నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత ధరకే ఏరోస్పేస్ పార్క్‌లో పౌరసౌకర్యాల ప్లాట్‌ను కేటాయించినట్లు కర్ణాటక భారీ, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ సోమవారం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని పాటిల్ చెప్పారు.