4 జిల్లాలు 3 సీట్లు! 'సీమ' 'కాపు'లకు చిల్లర విదిల్చారా?
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అటకెక్కింది. సీమలో కాపులకు మూడు సీట్లే దక్కాయి. సత్తా ఉన్నచోట చతికిలపడ్డారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: రాయలసీమ జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి లభించిన ప్రాధాన్యత చాలా స్వల్పం. కూటమిలోని రెండు పార్టీలు కాపులకు మూడు సీట్లు కేటాయించాయి. ఒక వీర మహిళకు కూడా జనసేన నుంచి సీటు దక్కలేదు. సత్తా ఉన్నచోట సీట్లు సాధించడంలో వెనుకబడ్డారు. బిజెపి పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుతో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు కేటాయిస్తున్నారు. ఓటర్ల సంఖ్య ప్రామాణికంగా రాయలసీమలో 6 నుంచి 10 సీట్లు ఇవ్వాల్సిన అవసరాన్ని కాపు సామాజిక వర్గం నేతలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ స్థాయిలో పట్టుబట్టలేకపోతున్నారు. రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తాననే మాట ఏమైందని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తున్నారు.
2019: టిడిపి ప్రభుత్వం కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం.
- ఈ ఎన్నికల్లో నెల్లూరులో మాత్రం ఆస్థాన విధ్వాంసుడిగా ఉన్న ఒకరికి దక్కింది.
వైఎస్ఆర్‌సీపీ: " కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదు" అని చెప్పిన మాటకు కట్టుబడ్డారు. 2019: చిత్తూరు అసెంబ్లీ స్థానంలో ఒకరికి అవకాశం కల్పించారు. 2024: ఎన్నికలకు మొండి చేయి చూపారు. జనసేన పార్టీ: ఒకరికి అవకాశం ఇచ్చింది. వైఎస్సార్సీపీలో టికెట్ దక్కక, తిరుగుబాటు చేసిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును తిరుపతిలో పోటీ చేయిస్తున్నారు. బిజెపి: కాపులకు టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఐదు శాతం రిజర్వేషన్ చెల్లుతుందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. కూటమిలో భాగస్వామిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి మొండిచేయి చూపింది.
ఊరు.. సీటు.. మారింది..
కూటమికి ఊరట: మిత్రపక్ష పార్టీల్లో ఒకరికి అవకాశం దక్కింది కదా! రెండో సీటు కూడా యాదృచ్ఛికంగా లభించింది. చిత్తూరు జిల్లాలో స్థానం, పార్టీ మాత్రమే మారింది. గత ఎన్నికల్లో చిత్తూరులో వైఎస్ఆర్సిపి నుంచి పోటీ చేసి గెలిచిన ఆరణి శ్రీనివాసులు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. పెద్ద మార్పు అంటే ఇదే అని చెప్పవచ్చు. "రాష్ట్రంలో బలిజ సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తామని టిడిపి అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు చెప్పడంతో పాటు చేసేందుకు ప్రయత్నించారు" అని బలిజ సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షుడు గోపిశెట్టి నాగరాజు అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంగనామాలు పీకారని నిరసన వ్యక్తం చేశారు.
దమ్మున్న నేత దొరకలేదా..
2019 ఎన్నికల్లో రాయలసీమలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి 74 అసెంబ్లీ స్థానాలు ఉంటే, చిత్తూరులో ఆరని శ్రీనివాసులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ , చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ గెలిచారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి నారాయణ ఓటమి పాలయ్యారు. 2024 : ఎన్నికలకు జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు, రాయలసీమకు చిటికెన వేలుగా ఉన్న నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నుంచి మాజీ మంత్రి నారాయణకు సీటు దక్కింది. కడప జిల్లా రాజంపేట, అనంతపురం సిటీ అసెంబ్లీ స్థానంలో కాపులతో సీటు విషయం దోబూచులాడుతోంది.
రాష్ట్రంలో 270 సంఘాలు
బలిజల అభ్యుదయం, సంక్షేమం కోసం పనిచేసే సంఘాలు రాష్ట్రంలో రిజిస్టర్ సంఘాలు 2007 వరకు ఉన్నాయి. 130 బీసీ ఉప కులాలు కలిపితే 30- 35 శాతం ఉన్నారు. 50 ఉపకులాలను కలిపితే ఎస్సీలు 17% ఉన్నారు. కేవలం కాపు బలిజలు 17% ఉన్నారని విశ్లేషణలు చెప్పే ఆ సామాజిక వర్గం నాయకులు... సీట్లు సాధించుకోవడంలో ఎక్కడ విఫలమవుతున్నారనేది విశ్లేషించుకునే స్థాయిలో ఉన్నట్లు కనిపించడం లేదు. రిజర్వ్డ్ కేటగిరి అభ్యర్థుల తరహాలోనే! ఆత్మీయ సమావేశాలు, వనభోజనాలు ఐక్యతను చాటుతాయి. వాటిని సంగటితశక్తిగా మార్చడంలో ఉన్న లోపాన్ని గుర్తించవలసిన అవసరాన్ని ఒక నాయకుడు ప్రస్తావించారు.
జనాభా ఎక్కువ..
ఆంధ్రప్రదేశ్‌లో కోటికి పైగా ఓట్లు ఉన్న కాపులకు ఉమ్మడి గ్రేటర్ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 74 అసెంబ్లీ సీట్లు,11 పార్లమెంట్ సీట్లలో కాపు కులస్తులకు రెండు సీట్లు దక్కాయి.
సీమలో...
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారుగా 25 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్ల పరంగా కూడా కాపులు తక్కువేమీ లేరు. నియోజకవర్గానికి సుమారుగా 2.25 లక్షల నుంచి 2.50 లక్షల మంది ఓటర్లలో 20వేల నుంచి 40 వేల కాపు సామాజిక వర్గం ఉంటారనే విషయాన్ని విశ్లేషణతో గుర్తు చేస్తున్నారు.
ప్రభావితం చేయగలిగినా ..
చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లి నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో 30 నుంచి 40 వేల సంఖ్యలో కాపు సామాజిక ఓటర్లు ఉన్నారు. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కూడా గణనీయంగానే ఓటర్లు ఉన్నారు. కడప జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో కూడా మొత్తం ఓటర్లలో 30 నుంచి 35 శాతం వరకు ఓటర్ల సంఖ్య ఉంది. జిల్లా రాష్ట్రస్థాయిలో తమ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయగల వారు కూడా తక్కువేమీ లేరు.
అయితే మరి సమస్య ఎక్కడ ఉంది అంటే.. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఒక పార్టీలో ఉంటున్నారు. అది సహజమే. అక్కడ కూడా పట్టుబట్టి సాధించడంలో ఓట్లను కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది అనేది. లోతుగా అవసరం లేదు రెండు మూడు ఎన్నికలు పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. దీనిపై గతంలో కాపు నాయకుడు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ, " గెలవని సీట్లను మాత్రమే కొన్ని రాజకీయ పార్టీలు బలిజలకు కేటాయిస్తున్నాయి. అని చెప్పిన విషయం వాస్తవం అనిపిస్తుంది. 1985లో నగరి నియోజకవర్గం నుంచి రాధాకృష్ణకు టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. తాజాగా తిరుపతిలో అన్వియంగా తెరపైకి వచ్చిన చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా ఓ ఉదాహరణ అని చెప్పుకోక తప్పదు.
ఉపశమనం...
రాయలసీమ జిల్లాలను పరిశీలిస్తే జనసేనలో ఒకరికి, టిడిపిలో ఇద్దరికీ టికెట్లు దక్కాయి. ఇది కాపు సామాజిక వర్గానికి ఉపశమనం కావచ్చేమో. వైఎస్సార్సీపీ చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులుకు ఆ పార్టీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన జనసేనలో చేరారు. శ్రీనివాసులును జనసేన పార్టీ అభ్యర్థిగా తిరుపతిలో రంగంలోకి దించారు. ఇందువల్ల అదే సామాజిక వర్గానికి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యే ఏం. సుగుణమ్మ అవకాశం కోల్పోయారు. పరిస్థితి అనుకూలించి ఉంటే చిత్తూరు జిల్లాలోని రెండు సీట్లు కాపు సామాజిక వర్గానికి దక్కేవి.
రెడ్డి కుటుంబంపై కాపుల ఆధిపత్యం
కడప జిల్లా రాజంపేట అసెంబ్లీ స్థానంలో కాపు సామాజిక వర్గం ధిక్కారం ప్రదర్శించిందని చెప్పవచ్చు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొండూరు మారారెడ్డి, ఆ తర్వాత ఆయన సతీమణి కొండూరు ప్రభావతమ్మ, ఈమెకు వరసకు సోదరుడైన కసిరెడ్డి మదన్మోహన్ రెడ్డిపై అప్పుడప్పుడు తడబడిన కాపు సామాజిక వర్గ విజయ పరంపర కొనసాగేది.
మొదటి ఎన్నికలోనే..
రాజంపేట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1962లో మొదటి ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాపు నేత పోతురాజు పార్థసారథి విజయం సాధించడం ద్వారా ఆ సామాజిక వర్గం తన సత్తా చాటింది. రాజంపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యేలను పరిశీలిస్తే టీడీపీ ఆవిర్భావం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన బండారు రత్నసభాపతి 1967, 1972, 1985 గెలుపొందారు. 1979,1983లో ఓటమి చెందినా... ఎక్కడా తగ్గలేదు. ఆ కోవలో బలిజ సామాజిక వర్గానికే చెందిన పసుపులేటి బ్రహ్మయ్య 1994, 1999 టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు ఓటమిపాలయ్యారు.
దక్కిన వరం
ఆరంభం నుంచి కాపు సామాజిక వర్గం ఆధిపత్యం చలాయిస్తున్న రాజంపేట నియోజకవర్గంలో ఆ వర్గానికి మళ్ళీ అవకాశం దక్కింది. శుక్రవారం టిడిపి ప్రకటించిన తుది జాబితాలో రాజంపేట శాసనసభ స్థానం నుంచి ఊహించినట్లుగానే మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ రాయుడి కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం అభ్యర్థిత్వాన్ని టిడిపి ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడుకు చుక్కెదురయింది. కొన్ని రోజులుగా ఈయన వైఎస్ఆర్సిపి నేతలకు టచ్‌లో ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజంపేట ఎంపీ సీటు బిజెపికి కేటాయించిన నేపథ్యంలో.. రాయచోటి నుంచి బాల సుబ్రమణ్యంకు రాజంపేటలో అవకాశం కల్పించారు.
దీనిపై ఒక సీనియర్ నేత మాట్లాడుతూ..
"కాపు సామాజిక వర్గంలో ఆర్థిక స్థిరత్వం సమస్య"గా మారింది అని టీడీపీ ఆవిర్భావం నుంచి అడుగులు సాగిస్తున్న సీనియర్ నేత ఎద్దుల సుబ్బరాయుడు.. ఫెడరల్ ప్రతినిధితో అన్నారు. డబ్బు ఉండి తెరమీదికి వచ్చేవారు ఇతరులతో కలిసిపోతున్నారు. "కాపుల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నవారు కూడా పట్టు సాధించలేకపోతున్నారు. అనడం కంటే ఐక్యత ప్రధాన సమస్యగా మారింది" మారిందని ఎద్దుల సుబ్బరాయుడు అభిప్రాయపడ్డారు.
అనంత కష్టాలు
అనంతపురం జిల్లాలో కూడా సీటు విషయంలో కాపులను కష్టాలు వెంటాడుతున్నాయి. అనంతపురం అర్బన్, గుంతకల్లు శాసనసభ స్థానాల్లో అభ్యర్థి ఎంపిక కూటమిలో పీట ముడిపడింది. ఇక్కడి నుంచి టీడీపీ, జనసేనలో టికెట్ రేసులో ఉన్న కాపు సామాజిక వర్గాన్ని చెందిన నేతలు పోటీ పడుతున్నారు. ఇక్కడ వీరికి కూడా అవకాశం కలిసి వస్తే ఇంకో సీటు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పార్టీ అధినేతలు ఎలా కరుణిస్తారో వేచి చూడాలి.