జగన్ ఓడిపోతాడని ప్రశాంత్ కిషోర్ ఎలా చెప్పారబ్బా!
నిన్న మొన్నటి వరకు మిత్రునిగా ఉన్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడేమిటి ఇలా అంటున్నారు, జగన్ ఓటమి ఖాయమని చెప్పడానికి ఆయన చెబుతున్న రీజన్స్ ఏమిటీ?;
2017 జూలై 9.. గుంటూరు- విజయవాడ జాతీయ రహదారి పక్కనున్న నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా వైఎస్సార్ సీపీ రెండు రోజుల ప్లీనరీ జరుగుతోంది. వేదికపై ఒక పక్క ఆనాటి పార్టీ అధ్యక్షురాలు, వైఎస్సార్ సతీమణి విజయమ్మ మరోపక్క ఆమె కుమారుడు వైఎస్ జగన్. జగన్ పక్కన వేదికపై అనూహ్యంగా ఓ వ్యక్తి కూర్చోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ వ్యక్తే ప్రశాంత్ కిషోర్. పార్టీకి వ్యూహకర్త అని, తన సోదరుడు లాంటి వాడని వైఎస్ జగన్ ఆ వేదిక మీది నుంచి ప్రకటించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు వ్యూహాన్ని ఇచ్చిన వాడు, దాన్ని తన కనుసన్నలలోని ఐప్యాక్ టీంతో నడిపించిన వాడు ప్రశాంత్ కిషోర్.
2019 మే .. వైఎస్సార్ సీపీ ఘన విజయాన్ని సాధించింది. 175 అసెంబ్లీ సీట్లలో 151 గెలిచి విజయఢంకా మోగించిన రోజు అందరికన్నా ముందు జగన్ ను తన ఇంట్లో కలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. వాళ్లిద్దరూ ఒకర్నొకరు ఆలింగనం చేసుకున్నారు. అభినందనలు చెప్పుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కూడా ప్రశాంత్ కిషోర్ మధ్యమధ్యలో వచ్చి కలిసివెళ్లేవారు.
ఐదేళ్లు గడిచింది. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాలం బహుచిత్రమైంది. ప్రశాంత్ కిషోర్ ఈమధ్య కాలంలో తన ఐప్యాక్ టీంను వేరే వాళ్లకు అమ్మేశారు. ఇప్పుడు కాసేపు వ్యూహకర్తగా, మరికొంతసేపు సెఫాలజిస్ట్ గా, ఇంకొంతసేపు ఎన్నికల జ్యోతిష్యశాస్త్రవేత్తగా ఉంటున్నారు. బీహార్ లో పార్టీ పెట్టారు. తర్వాత మూసేశారు. పాదయాత్ర చేపట్టారు. ఆపేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ తో కలిసి కొద్ది కాలం తిరిగారు. ఇప్పుడు మళ్లీ తన పాత పాత్ర- వ్యూహకర్తగానే ఉంటున్నారు. ఆమధ్య ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం వచ్చి టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ తో కలిసి కారులో ఉండవల్లి వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి ఓ గంట సేపు మాట్లాడి వెళ్లారు.
2024 మార్చి 3, హైదరాబాద్.. ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఏర్పాటు చేసిన అడ్డా అనే బహిరంగ చర్చా వేదికకు వచ్చారు. తన పాత మిత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నారంటూ బాంబు పేల్చారు. ఇదిప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా మంటలు పుట్టిస్తోంది. 151 సీట్లు, 155 సార్లు బటన్లు నొక్కిన సీఎం జగన్ ఓడిపోనున్నారని చెప్పడం రాష్ట్రంలో ప్రత్యేకించి వైసీపీ వర్గాలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఖండన మండనలు బయలుదేరాయి. ఒకప్పుడు ఈ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు చెబితేనే దడుసుకున్న నేతలు ఇప్పుడు కారాలు, మిరియాలు నూరుతున్నారు.
ఏపీ పాలిటిక్స్ పై ప్రశాంత్ కిషోర్ ఏమన్నారంటే...
జగన్, చంద్రబాబు నాయుడు అవకాశాలపై తన అభిప్రాయాలను అడిగినప్పుడు... “జగన్‌ను ఓడించడం కష్టమని, ఆయన చాలా బలంగా ఉన్నారనే ఊహకు ఆధారాలేమీ లేవు. జగన్ ఓ స్టిక్కీ వికెట్‌పై ఉన్నారు. రాజకీయంగా అతని పరిస్థితి దిగజారిపోతోంది. అయితే ఏపీకి సంబంధించి నా దగ్గర సరైన సమాచారం గాని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్ గాని లేదు. కానీ నా నిశ్చితాభిప్రాయమేమిటంటే జగన్ బాగా నష్టపోబోతున్నారు. ఆ ఓటమి కూడా మామూలుగా ఉండదు. భారీ నష్టాన్ని చవిచూస్తారు” అన్నారు ప్రశాంత్ కిషోర్. ఆయన అంతటితో ఆగలేదు కూడా.. ఇంకో మాట కూడా చెప్పారు. "రాష్ట్రాన్ని జగన్ ఎలా నడిపించాడనేది ముఖ్యం. ఆంధ్ర బహుశా మధ్య-ఆదాయ వర్గంలోకి వస్తుంది. అటువంటి సమయంలో మీరు మూలధన సృష్టి, కొత్త మౌలిక సదుపాయాల గురించి మాట్లాడకుండా మధ్య-ఆదాయ రాష్ట్రంలో పంపిణీ (సంక్షేమ పథకాల పేరిట డబ్బు పంపిణీ) వైపు మాత్రమే దృష్టి సారిస్తే అదో పెద్ద వ్యూహాత్మక తప్పిదమే అవుతుంది. జగన్ ప్రభుత్వం చాలా అప్పులు చేసైనా సంక్షేమ తాయిలాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్స్ (డిబిటి) ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలలో పని చేయవచ్చు. 50 శాతం కంటే ఎక్కువ నగరీకరణ, పట్టణీకరణ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు కాదు. ప్రజానీకానికి ఇస్తున్న ఉచిత ప్రయోజనాలు పని చేయకపోవచ్చు. ఎందుకంటే జనాభాలో 50 శాతం కూడా అర్హులు లేరు” అన్నది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం.
వర్గపోరాటాలు ఏపీలో కుదరవు...
చంద్రబాబు నాయుడితో భేటీ గురించి అడిగినపుడు.. ”అవును, ఆయన్ను కలిశాను. మూడు గంటలపాటు చర్చలు జరిపా. అయితే ఆయన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు” అన్నారు ప్రశాంత్ కిషోర్. ఈ దశలో ప్రశాంత్ కిషోర్ ముందుకు ఓ ప్రశ్న వచ్చింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో జరగబోయేది వర్గపోరాటమని సీఎం జగన్ అంటున్నారు కదా అన్నప్పుడు... ”ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణలో వర్గ ప్రాతిపదికన ఎన్నికల్లో పోరాడలేమన్నారు. ఇటువంటివి బీహార్, జార్ఖండ్ లో సాధ్యం” అని చెప్పారు. వర్గపోరాటమనేది నేరుగా డబ్బు పంపిణీపై (డీబీటీ) ఆధారపడి ఉండదు. ఎందుకంటే ”యువత ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. వెయ్యి రూపాయల ప్రయోజనం కాదు. మరిన్ని ఫ్యాక్టరీలు, మెరుగైన రోడ్లు, వైద్య, విద్యా సౌకర్యాల కోసం వారు చూస్తున్నారు. నేను ఆంధ్రుడనైతే, విజయవాడ లేదా వైజాగ్ భవిష్యత్తు నగరంగా ఉండాలనుకుంటానే తప్ప ఈ వేయి రూపాయల కోసం చూడను. చెన్నై, కొచ్చి, హైదరాబాద్‌లో ఉన్న నా సహచరులతో పోల్చుకుని చూసుకున్నప్పుడు నేను తక్కువగా ఉన్నానన్న భావన కలుగుతుంది. అందువల్ల జగన్ మళ్లీ గెలవడం కష్టమే” అని అంచనా వేశారు ప్రశాంత్ కిషోర్ అన్నారు. "2019లో జగన్ గెలిచినప్పుడు తన పలుకుబడి, వయసు దృష్ట్యా దక్షిణాదిలో అతనో శక్తివంతమైన, ప్రభావంతమైన నాయకునిగా ఎదుగుతారని భావించిన వాళ్లలో తానూ ఒకడినని, అయితే జగన్ కేవలం ఓ సేవలు అందించే వ్యక్తిగా (ప్రొవైడర్) మిగిలారు” అన్నారు ప్రశాంత్ కిషోర్. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా జగన్ సోదరి వైఎస్ షర్మిలకు పట్టం కట్టినా పెద్దగా ఫలితమేమీ ఉండదన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా కాంగ్రెస్ ను భావించడం వల్ల షర్మిలకు పదవి ఇచ్చినా పెద్దగా వచ్చే లాభమేమీ లేదన్నారు ఈ వ్యూహకర్త. పాలకులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, దీనికి భిన్నంగా ప్యాలెస్‌ల్లో ఉంటూ ప్రజల బాగోగులన్నీ తామే చూసుకుంటున్నామని భావిస్తున్నారని.. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించబోరన్నది ప్రశాంత్ కిషోర్ అభిప్రాయం.
విరుచుకుపడిన వైసీపీ నేతలు...
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన్ను తీవ్ర పదజాలంతోనే దూషించారు. మాజీ మంత్రి పేర్ని నానీ మాటల్లో... “ ఒక పీకే (పవన్ కళ్యాణ్) వల్ల కావడం లేదనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో పీకే (ప్రశాంత్ కిశోర్)ను తెచ్చుకున్నారు” చంద్రబాబే గెలుస్తాడనుకుంటే మేనిఫెస్టోలో సంక్షేమం గురించి ఎడాపెడా హామీలు ఇచ్చేయాలని ప్రశాంత్ కిషోర్ ఎందుకు సలహా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకుంటే వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగం గత ఐదేళ్లుగా ఎలా ముందుకు వెళ్లాయన్నారు. డీబీటీ, అభివృద్ధి రెండూ చేయని చంద్రబాబుకు ప్రజలు ఓటు వేస్తారని ప్రశాంత్ కిశోర్ చెప్పడానికి కారణం నెల కిందట నేరుగా చంద్రబాబు ఇంట్లో జరిగిన సమావేశమే కదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకి అమ్ముడు పోయారా?
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే (ప్రశాంత్ కిషోర్)పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకి అమ్ముడుపోయిన వారికి ఏపీ అభివృద్ధి కనిపించడం లేదని వ్యంగాస్త్రాలు సంధించారు. “ఇన్ని విషయాలు తెలిసిన ప్రశాంత్ కిషోర్ గాని, అభివృద్ధిలో ఆరితేరిన మంత్రులకు గాని ఓ విషయం తెలియదని నేను అనుకోను. ప్రపంచ వ్యాప్తంగా మార్పులు జరుగుతున్నప్పుడు సహజంగానే ఎవరితో ప్రమేయం లేకుండా కొంత అభివృద్ధి జరుగుతుంది. దాన్నే ఘనతగా మంత్రులు చెప్పుకుంటే వాళ్లను ఎవ్వరూ కాపాడలేరు అంటున్నారు” అంటున్నారు విజయవాడకు చెందిన సామాజిక సేవా కార్యకర్త కేవీ కృష్ణ. మరో 40,50 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.