కరుణానిధి పెద్ద కుమారుడు ‘ముత్తు’ మృతి
తండ్రితో విభేదాలతో అన్నాడీఎంకేలో చేరిక;
By : The Federal
Update: 2025-07-19 09:34 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సవతి సోదరుడు ఎంకే ముత్తు శనివారం ఉదయం మృతి చెందారు. చెన్నైలో వృద్దాప్య సమస్యల కారణంగా మరణించాడని డీఎంకే ప్రకటించింది. ఆయన భౌతిక కాయాన్ని ప్రజల దర్శనార్థం ఎంజాంబాక్కంలోని ఆయన నివాసంలో ఉంచారు.
జనవరి 14, 1948 లో జన్మించిన ముత్తు, కరుణానిధి- పద్మావతి మొదటి సంతానం. ఆయన పుట్టిన కొద్దికాలానికే క్షయ వ్యాధి కారణంగా పద్మావతి మరణించారు. తమిళనాడు రాజకీయాల్లో, తమిళ సినిమాల్లో మేరు శిఖరం అయిన కరుణానిధి 1970 ప్రారంభంలో ముత్తును తన రాజకీయ వారసుడిగా భావించాడు.
అయితే అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ కి పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కరుణానిధి ముత్తును నటుడిగా, గాయకుడిగా సినిమా రంగంలోకి ప్రవేశపెట్టారు.
నటుడు, గాయకుడు..
1970 లో పిళ్లైయో పిళ్లై, సమయల్కరన్, అనయవిలకు, ఇంగేయు మణి ధర్గల్, ఫూక్కరి వంటి చిత్రాలలో ఆయన నటించారు. తరుచుగా నటి వెన్నిరా అడై నిర్మలతో జతకట్టాడు. వీటిని చాలా చిత్రాలు వాణిజ్యపరంగా విజయవంతం అయ్యాయి. నటనకు మించి గాయకుడిగా ఆయన మంచి ప్రతిభ కనపరిచారు. 2008 లో సంగీత దర్శకుడు దేవా దర్శకత్వంలో మట్టుతవాని చిత్రం పాటతో ఆయన పునరగమనం చేశాడు.
ప్రారంభ దశలో ఆయన మంచి గుర్తింపు లభించినప్పటికి ఆయన దీర్ఘకాలం అందులో కొనసాగలేకపోయారు. తండ్రితో విభేదాలు ఆయన అన్నాడీఎంకేలో చేరడానికి కారణమయ్యాయి. ఆ చర్యలు కుటుంబంతో సంబంధాలను దెబ్బతీసింది.
డీఎంకే రాజకీయ రంగం నుంచి ఆయనను దూరం చేసింది. అయితే ముత్తు తీవ్ర అనారోగ్యానికి గురైన తరువాత 2009 లో తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు కలిశాయి. 2013 లో ముత్తు కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్, వెంటీలేటర్ సపోర్ట్, హైపోక్సిక్ మెదడు దెబ్బతినడంతో చికిత్స తీసుకున్నారు.