బెంగళూర్ భూ వివాదంలో ఖర్గే కుటుంబ ట్రస్ట్ కీలక నిర్ణయం.. ఏంటదీ?
ఖర్గే కుటుంబానికి అత్యంత విలువైన భూమిని కట్టబెట్టారని కర్ణాటకలో రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఖర్గే కుటుంబ ట్రస్ట్ కేటాయించిన భూమిని తిరిగి..
By : The Federal
Update: 2024-10-15 11:31 GMT
బెంగళూరులోని ఏరోస్పేస్ పార్క్‌లో భూమిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు రాహుల్ ఖర్గే నేతృత్వంలోని ఖర్గే కుటుంబ ట్రస్ట్ కు కేటాయించడంపై రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మల్లికార్జున ఖర్గే కుటుంబ ఆధర్యంలోని సిద్ధార్థ విహార ట్రస్ట్ బెంగళూరులోని హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌లో ఐదు ఎకరాల సివిల్ యూజ్ (CA) స్థలాన్ని కొనుగోలు చేసింది.
దీనిపై రాష్ట్రంలో రాజకీయ దుమారం చెలరేగడంతో, ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహారా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వివాదాస్పద ప్లాట్‌ను కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు (కేఐఏడీబీ)కి తిరిగి ఇచ్చింది .
వివాదం దేనికి..
ఏరోస్పేస్ పార్క్‌లో మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కావాలని సిద్ధార్థ విహార ట్రస్ట్ సీఈవో రాహుల్ ఖర్గే కేఐఏడీబీకి ప్రతిపాదన చేశారు. KIADB మే 30, 2024న రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ ద్వారా ఐదు ఎకరాల సివిల్ యూజ్ సైట్ (CA సైట్)ను మంజూరు చేసింది.
ఆ సందర్భంగా ఏరోస్పేస్ పార్క్‌లోని సీఏ భూమి కోసం 193 సంస్థలు కేఐఏడీబీకి దరఖాస్తు చేశాయి. వాటిలో 43 సంస్థలు ఎంపికయ్యాయి. చివరకు సిద్ధార్థ విహారా ఎడ్యుకేషనల్ ట్రస్టుకు సైట్ ఇచ్చారు. అయితే, భూమి కేటాయింపు ప్రక్రియలో దినేష్ కల్లహల్లి అనే సామాజిక కార్యకర్త బయటకు తేవడంతో వివాదం తలెత్తింది.
ఆటోమొబైల్ పరిశ్రమలో ఎలాంటి అనుభవం లేని ట్రస్ట్‌కు ఆటోమొబైల్ ప్రొడక్షన్ స్కిల్స్‌లో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాట్లు కేటాయించారని, అధికారాన్ని దుర్వినియోగం చేసి, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. కల్లహళ్లి భూకేటాయింపు సరైంది కాదని పేర్కొన్నారు.
ఈ అంశం ఎలా తెరపైకి వచ్చింది?
దినేష్ కల్లహల్లి ఫిర్యాదు వెలుగులోకి రావడంతో, భూకేటాయింపు ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాజ్యసభ ఎంపీ లహర్ సింగ్ సిరోయా, శాసనమండలి ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామి అధికారికంగా కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పారదర్శకత లేని ప్రక్రియ ద్వారా భూమిని ట్రస్ట్‌కు కేటాయించడంపై వారు అభ్యంతరాలు లేవనెత్తారు. లహర్ సింగ్ ఫిర్యాదు ఆధారంగా గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఈ అంశంపై వివరణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్‌కు లేఖ రాశారు.
ఖర్గే కుటుంబ ట్రస్ట్ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంది?
ఏరోస్పేస్ పార్క్‌లో మల్టీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధార్థ విహార ట్రస్ట్ భూమిని కోరింది. ఆటోమొబైల్ ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్ నైపుణ్య శిక్షణను అందించడం ట్రస్ట్ లక్ష్యం. ప్రమోటర్ల నుంచి ₹10 కోట్లు, బ్యాంక్ లోన్‌గా ₹10 కోట్లు ఇలా మొత్తం ₹25 కోట్లతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి స్థిర మూలధనంగా ₹5 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ 2027 డిసెంబరు 30న ప్రారంభం కానుంది. 150 మందికి ఉపాధి కల్పిస్తామని ట్రస్ట్ హామీ ఇచ్చింది.
భూకేటాయింపులకు ప్రభుత్వ సమర్థన ?
సమస్య ఒక కొలిక్కి వచ్చినప్పుడు, కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి MB పాటిల్, రాహుల్ ఖర్గేకి "నిర్దేశించిన ధరకు, ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా" సైట్ కేటాయించమని చెప్పారు. ఏరోస్పేస్ పార్క్ స్థలాన్ని రాహుల్ ఖర్గేకు ఎలాంటి రాయితీ లేకుండా కేఐఏడీబీ నిర్ణీత ధరకే ఇచ్చారని తెలిపారు.
రాహుల్ ఐఐటీ గ్రాడ్యుయేట్. ఆర్‌అండ్‌డి యూనిట్‌ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో తాను స్థలం అడిగాడని పాటిల్ తెలిపారు. ఖర్గే కుటుంబం చాలా సంవత్సరాలుగా విద్యా కార్యకలాపాల్లో నిమగ్నమై ఉందని, గత బిజెపి ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతంలో కేవలం ₹ 50 కోట్లకు చాణక్య విశ్వవిద్యాలయానికి 116 ఎకరాలు కేటాయించిందని ఆయన అన్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ₹137 కోట్ల నష్టం వాటిల్లిందని పాటిల్ అభిప్రాయపడ్డారు.
సిద్ధార్థ విహార ట్రస్టుకు మళ్లీ భూమి కేటాయించారా?
గత దశాబ్ద కాలంలో ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ధార్థ విహార ట్రస్టుకు 24 ఎకరాల భూమిని కేటాయించారు. కలబురుగిలో 2014, 2017లో ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలీ, కల్చర్ అండ్ కంపారిటివ్ ఫిలాసఫీ ఏర్పాటు కోసం 19 ఎకరాలు కేటాయించారు. 2024లో బెంగుళూరు ఏరోస్పేస్ పార్క్‌లో R&D స్థాపన కోసం మరో ఐదు ఎకరాలు కేటాయించారు. దీనిపై అప్పట్లోనే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా ప్రైవేట్ ప్రయోజనాల కోసం భూమిని కేటాయించినట్లు కనిపిస్తోందని విమర్శించింది.
సిద్ధార్థ ట్రస్ట్ సభ్యులు ఎవరు?
ప్రస్తుతం సిద్ధార్థ విహార ట్రస్టులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన భార్య రాధాబాయి ఖర్గే, అల్లుడు, కలబురగి ఎంపీ రాధాకృష్ణ దొడ్డమణి, కుమారులు ప్రియాంక్, రాహుల్ ఉన్నారు. పెద్ద కుమారుడు రాహుల్ ఖర్గే ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉన్నారు.
ఇతర సంస్థలకి స్థలం కేటాయించలేదా?
ఏరోస్పేస్ పార్క్‌లోని మొత్తం 45.94 ఎకరాల స్థలాన్ని 11 కంపెనీలు మొత్తం ₹1,208 కోట్ల పెట్టుబడితో స్వాధీనం చేసుకున్నాయి. అదే స్థలంలో సిద్ధార్థ విహార ట్రస్టీకి షెడ్యూల్డ్ కులాల కోటా కింద 5 ఎకరాల భూమిని కేఐఏడీబీ కేటాయించింది.
ఎస్సీ/ఎస్టీ కోటా కింద ARM స్క్వేర్ కంపెనీకి దాదాపు 2.41 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ స్థలంలో ₹17.50 కోట్లతో హోటళ్లు, రిసార్టులు, కాటేజీలను అభివృద్ధి చేస్తోంది. అడ్విక్ గేట్‌వే కంపెనీకి 2.17 ఎకరాలు ఇచ్చింది. నివాస గృహాల నిర్మాణం కోసం సంస్థ ₹47.92 కోట్లు పెట్టుబడి పెడుతోంది.
భూమి తిరిగి ఇస్తోంది..
బిజెపి - జెడి(ఎస్) ప్రతిపక్ష కూటమి తమ దాడిని వేగవంతం చేసిన తర్వాత, రాహుల్ ఖర్గే సెప్టెంబర్ 20న వివాదాస్పద భూమిని తిరిగి ఇవ్వాలని KIADBకి లేఖ రాశారు. బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్ వద్ద పౌర సౌకర్యాల స్థలం కోసం ట్రస్ట్ చేసిన అభ్యర్థనను ఉపసంహరించుకున్నాడు.
వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందకూడదని భావించే “బీజేపీ మనుస్మృతి మనస్తత్వం” కారణంగా ఖర్గే కుటుంబ సభ్యుల చట్టబద్ధమైన వ్యాపారాలు అడ్డుకుంటున్నాయని ప్రియాంక్ ఖర్గే ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు.