కర్ణాటకలో చిన్న దేవాలయాలపై మఠాలు కన్నెశాయా?
చిన్న దేవాలయాల భూములపై కొంతమంది మఠాధిపతుల కన్ను పడిందా? అర్చకులు ఏమంటున్నారు? గవర్నర్ బిల్లును ఎందుకు పెండింగ్‌లో పెట్టారు?;
కర్ణాటకలో ‘సి’ క్యాటగిరీ ఆలయాలను అభివృద్ధి పేరిట స్వాధీనం చేసుకుంటున్నారన్న వార్తలొస్తున్నాయి. వీటిని ప్రైవేటీకరించే ప్రయత్నం జరుగుతోందన్న ప్రచారంపై అఖిల కర్ణాటక హిందూ దేవాలయాల అర్చకుల(Priests) సమాఖ్య స్పందించింది. అసలు ఆలయాల వర్గీకరణ ఎలా జరిగిందో తెలుసుకుందాం..
ఆలయాల వర్గీకరణ..
కర్ణాటకలో మొత్తం 1.86 లక్షల దేవాలయాలున్నాయి. వీటిలో 34,564 దేవాలయాలు మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. వీటి ద్వారా వచ్చే వార్షిక ఆదాయాన్ని ఆధారంగా A, B, C కేటగిరీలుగా వర్గీకరించారు.
A కేటగిరీ: రూ. 25 లక్షలకు పైగా ఆదాయం వచ్చేవి 205 దేవాలయాలు.
B కేటగిరీ: రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం వచ్చేవి 193 దేవాలయాలు.
C కేటగిరీ: రూ. 5 లక్షల కంటే తక్కువ ఆదాయం వచ్చేవి 34,166 దేవాలయాలు.
ఆ దేవాలయాలపైనే మఠాల కన్ను..
చిన్న దేవాలయాల(Temple) పరిధిలోని కొన్ని భూములను కొన్ని మఠాలు, వ్యక్తులు దృష్టి సారించారని ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పేరిట వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి.
గవర్నర్-ప్రభుత్వ వివాదం..
కర్ణాటక (Karnataka) హిందూ మతసంస్థల చారిటబుల్ ఎండోమెంట్ బిల్లు -2024కు శాసనసభలో ఆమోదం లభించింది. అయితే గవర్నర్ ఆమోదించకుండా నిలిపివేశారు. బిల్లులో కొన్ని అంశాలపై ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలే అందుకు కారణంగా తెలుస్తోంది.
దేవాలయ భూముల పునరుద్ధరణ..
2023 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం 11,499 ఎకరాల దేవాలయ భూములను పునరుద్ధరించిందని దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ భూముల పూర్తి పునరుద్ధరణకు మరో రెండేళ్లు పడుతుందని దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి చెప్పారు.
ప్రైవేటీకరణకు తావు లేదు: మంత్రి హామీ
అయితే దేవాలయాలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. దేవాలయాల్లో హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని వాటి అభివృద్ధి కోసం మాత్రమే వినియోగిస్తామని హామీ ఇచ్చారు. ఒకవేళ సి కేటగిరి ఆలయాలను అభివృద్ధి చేయాలనుకుంటే.. ముందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేసి పనులు చేపడుతుందని తెలిపారు.
అర్చకుల ఆందోళన..
చిన్న దేవాలయాలను వ్యాపార లాభాల కోణంలో చూడవద్దని, అర్చకుల భవిష్యత్తు, సంప్రదాయాల పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యమని అఖిల కర్ణాటక హిందూ దేవాలయాలు, పూజారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎన్ దీక్షిత్ సూచించారు. దేవాలయాలు, అర్చకులను ప్రభుత్వ నియంత్రణలోనే ఉంచాలని, వాటిని ప్రైవేట్ సంస్థలకి అప్పగించొద్దని సమాఖ్య కోరుతోంది. ప్రభుత్వం నుంచి అర్చకులకు ఇచ్చే వార్షిక పారితోషికాన్ని రూ. 60 వేల నుంచి రూ. 72వేలకు పెంచాలని అర్చకుల సమాఖ్య కోరుతోంది. ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలు గురించి మరింత స్పష్టత కోసం సమాఖ్య తరఫున ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి రామలింగారెడ్డితో గతేడాది జూలైలో సమావేశమయ్యాయని చెప్పారు. వారు తమ హక్కులతో కాపాడడంతో పాటు సి క్యాటగిరీ పరిధిలోని ఆలయాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని దీక్షిత్ పేర్కొన్నారు.