‘సూసైడ్ బాంబర్’గా మారడానికైనా సిద్ధం..
పాక్‌పై యుద్ధం చేయాల్సి వస్తే అందుకు తాను సిద్ధమన్న కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్..;
పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్న క్రమంలో కర్ణాటక(Karnataka) మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్(Zameer Ahmed Khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పాక్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. తాను సూసైడ్ బాంబర్‌ను అవుతానని చెప్పారు కర్ణాటక హౌసింగ్, వక్ఫ్ మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్.
"మేము భారతీయులం. పాకిస్తాన్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లతో యుద్ధం చేయాల్సి వస్తే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇది నేను సరదా కోసం ఈ మాటలు చెప్పడం లేదు," అని జమీర్ పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు 24 మంది పౌరులను కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత భారత్-పాక్ మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి.
సిద్ధరామయ్య వ్యాఖ్యలకు విరుద్ధంగా..
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) మాటలకు ఖాన్ వ్యాఖ్యలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధానికి అనుకూలం కాదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను కోట్ చేస్తూ..పాకిస్తాన్ ప్రతికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ఆ తర్వాత సిద్ధరామయ్య మాట మార్చారు. యుద్ధం అనేది చివరి అస్ర్తంగా ఉండాలన్నదే తన అభిమతమని క్లారిటీ ఇచ్చారు.