యోగీ ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పించిన స్టాలిన్
టీఎన్ సీఎం పెద్ద మోసగాడని కౌంటర్ ఇచ్చిన కే. అన్నామలై;
By : The Federal
Update: 2025-03-27 07:49 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రభుత్వం తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి భాషా విభజనను ఒక సాధనంగా ఉపయోగిస్తోందని ఆయన యోగీ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించగా, దానికి డీఎంకే అధినేత స్పందించారు.
డీఎంకే నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కేంద్రం జాతీయ విద్యా విధానం -2020 కింద త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. ఇది రాష్ట్రంలో హిందీ మాట్లాడని జనాభాపై హిందీని రుద్దే కుట్ర అని ఆరోపించింది.
ఇలాంటి ఉపన్యాసాలు ఆపండి..
యోగీ ఇచ్చిన ఉపన్యాసంపై ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. యోగీ ప్రసంగాన్ని రాజకీయ డార్క్ కామెడీగా అభివర్ణించారు. ద్వి భాషా విధానానికి అనుకూలంగా తమిళనాడు అనుసరిస్తున్న దృఢమైన వైఖరి బీజేపీకి, యోగీకి కోపం తెప్పించిందని అభిప్రాయపడ్డారు.
‘‘ # ద్విభాషా విధానం, # న్యాయమైన పరిమితి రద్దుపై తమిళనాడు వినిపించిన దృఢ స్వరం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిపిస్తోంది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
వారి నాయకుల ఇంటర్వ్యూలను చూడండి. ఇప్పుడు గౌరవనీయులైన యోగీ ఆదిత్యనాథ్ ద్వేషం గురించి మాకు ఉపన్యాసాలు ఇవ్వాలని అనుకుంటున్నారా? మమ్మల్ని విడిచిపెట్టండి. ఇది వ్యంగ్యం కాదు. ఇది రాజకీయంగా ఓ బ్లాక్ కామెడీ ’’ అని స్టాలిన్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
మేము ఏ భాషను వ్యతిరేకించడం లేదని చెప్పుకొచ్చారు. కేవలం బలవంతం, దురభిమానాన్ని మాత్రమే ప్రతిఘటిస్తున్నామని వివరించారు. ఇది ఓట్ల కోసం జరిగే అల్లర్ల రాజకీయాలు కావని ఇది గౌరవం, న్యాయం కోసం జరిగే యుద్దం అని స్టాలిన్ అన్నారు.
యోగీ ఏం అన్నారంటే...
కేంద్రం తీసుకువచ్చిన త్రి భాషా విధానాన్ని తమిళనాడు వ్యతిరేకించడాన్ని విమర్శిస్తూ యూపీ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘స్టాలిన్ సంకుచిత రాజకీయాలు చేస్తున్నారని, తన ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఉండేందుకు ప్రజలను భాష ఆధారంగా విభజిస్తున్నారని ఆరోపించారు. భాష ప్రజలను విభజించదు, కలుపుతుందని, కానీ హిందీపై ద్వేషం ఎందుకు పెరిగిందో అని ఆశ్యర్యపోయాడు.
‘‘భాష లేదా ప్రాంతం పేరుతో దేశాన్ని విభజించకూడదు. వారణాసిలో కాశీ- తమిళ సంగమం నిర్వహించిన ప్రధాని మోదీకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతి భారతీయుడి మనస్సులో తమిళం పై గౌరవం ఉంటుంది. దాని చరిత్ర సంస్కృతం వలే పురాతనమైనది. ఈ ప్రజల ఓటు బ్యాంకులు మారినప్పుడూ, వారు భూభాగం, భాష ఆధారంగా విభజించడానికి ప్రయత్నిస్తారు. దేశ ప్రజలు ఎల్లప్పుడూ దీని గురించి తెలుసుకోవాలి’’ అని యోగీ అన్నారు.
స్టాలిన్ మహా మోసగాడు: అన్నామలై
యోగీకి విమర్శిస్తూ స్టాలిన్ చేసిన పోస్టుకు బీజేపీ తమిళనాడు శాఖ వెంటనే స్పందించింది. ‘‘రాజ్యాంగం, సమాఖ్య నిర్మాణం రక్షకుడిగా ముసుగు వేసుకున్న మోసగాడు అతను (స్టాలిన్ ను ఉద్దేశిస్తూ)’’ అని స్పందించింది.
Thiru @mkstalin, you are a con artist masquerading as a protector of our constitution & our federal structure. Usually, con artists scam the rich, but DMK shows no disparity; they scam both the rich and the poor.
— K.Annamalai (@annamalai_k) March 27, 2025
The whole country now knows that the Chief Minister of Tamil… https://t.co/sEMKtxHT2J
‘‘తిరు @mkstalin, మీరు మన రాజ్యాంగం, మన సమాఖ్య నిర్మాణం రక్షకుడిగా ముసుగు వేసుకున్న మోసగాడు. సాధారణంగా మోసగాళ్లు, ధనవంతులను మోసం చేస్తారు. కానీ డీఎంకే మాత్రం ఈ విషయంలో ఎటువంటి అసమానత చూపించదు. వారు ధనవంతులు, పేదలు ఇద్దరిని మోసం చేస్తారు.’’ అని స్టాలిన్ పోస్ట్ కు కౌంటర్ ఇచ్చారు.
స్టాలిన్ కుటుంబం మూడు భాషలు చెబుతున్న పాఠశాలలు నడుపుతోందని, ఇది అందరికి తెలుసని, అయితే రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలల విషయంలో ముఖ్యమంత్రి దానిని వ్యతిరేకిస్తున్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు.
‘‘తన పార్టీ సభ్యులు అక్కడక్కడా కలిసి నాటకం మొత్తం తమిళనాడు గొంతును ప్రతిబింబిస్తుందనే భ్రమలో తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారని, ప్రజల దృష్టిని చిన్న విషయాలపైకి మళ్లించడానికి మీరు చేసిన ప్రయత్నాలు బహిర్గతం అయ్యాయని మీరు గ్రహించకపోవడం కూడా దురదృష్టకరం.
మీ అజ్ఞానపు ఆనందకరమైన ప్రపంచంలో జీవించండి గౌరవనీయులైన స్టాలిన్ గారు. మేము మిమ్మల్ని ఇబ్బందిపెట్టము’’ అని అన్నామలై పేర్కొన్నారు.