డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రధానితో ఎందుకు భేటీ అయ్యారు?
ప్రధానితో భేటీ ముగిశాక డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విలేకరులతో మాట్లాడారు. మూడు అంశాలపై మోదీతో మాట్లాడానని చెప్పారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న చెన్నై మెట్రో, సమీకృత విద్యా కార్యక్రమాలకు నిధుల విడుదలతో పాటు తమిళ మత్స్యకారులను రక్షించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రధానితో భేటీ ముగిశాక డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘చెన్నై మెట్రో ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.18,544 కోట్లు ఖర్చు చేశాం. రెండో దశ పనులను ప్రారంభించాలనుకుంటున్నాం. అయితే కేంద్రం నిధులను విడుదల చేయడంలో జాప్యం చేస్తోంది. త్వరగా విడుదల చేయాలని మోదీని కోరా. సమీకృత విద్యా కార్యక్రమాల అమలుకు నిధుల విడుదల ఆపేయడాన్ని ఆపేశారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లా. ఇక శ్రీలంక నావికాదళ పోలీసులు 145 మంది తమిళ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. 191 మత్స్యకార పడవలను స్వాధీనం చేసుకున్నారు. వచ్చే నెలలో కొలంబోలో జరిగే భారత్-శ్రీలంక జాయింట్ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని కోరా. మా మూడు డిమాండ్లను పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అని స్టాలిన్ తెలిపారు.
అంతకుముందు స్టాలిన్ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, ఇటీవల మరణించిన సీపీఐ(ఎం) నాయకుడు సీతారాం ఏచూరి కుటుంబాన్ని కూడా కలిశారు. ఢిల్లీకి చేరుకున్న స్టాలిన్‌కు పార్లమెంట్ సభ్యులు టిఆర్ బాలు, తిరుచ్చి శివ, దయానిధి మారన్, కె కనిమొళి, టి సుమతి సహా డిఎంకె నేతలు ఘనస్వాగతం పలికారు.