‘చెంప దెబ్బలకు రేవంత్ రెడీనా..?’

‘బీఆర్ఎస్‌ది ప్రజల దందా.. కాంగ్రెస్‌ది కమిషన్ల దందా’;

Update: 2025-07-15 08:36 GMT

తెలంగాణ ప్రజలకు, రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారు? అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. చెప్పడానికి రేవంత్‌కు దగ్గర కూడా ఏమీ లేదని, అందుకే ఎక్కడికి వెళ్లినా కేసీఆర్‌ను తిట్టడం, బీఆర్ఎస్‌పై బురదజల్లడం చేస్తున్నారని చురకలంటించారు. 18 నెలల పాలనలో అప్పులు చేయడం, అబద్ధాలు చెప్పడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అని నిలదీశారు. బీఆర్ఎస్.. ప్రజల కోసం, వారి కష్టాలను పరిష్కరించడానికి, రైతులను రాజులుగా మార్చడానికి శ్రమిస్తే.. కాంగ్రెస్ మాత్రం కమిషన్ల దందా చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాటకొస్తే ఏదో సాధించేసినట్లు విజయోత్సవాలు నిర్వహించుకుని అందులో గప్పాలు కొట్టుకోవడం తప్ప కాంగ్రెస్ ఇంకేం చేయట్లేదన్నారు. అదే విధంగా సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన స్థాయి ఎరిగి మాట్లాడాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం అడ్డగోలుగా అబద్ధాలు చెప్పడమే కాకుండా సంస్కారం లేని తరహాలో మాట్లాడుతున్నారని, అది సరైన పద్దతి కాదని హెచ్చరించారు. ప్రతి అంశంలో రేవంత్ రెడ్డి అబద్ధాలే చెప్పారన్నారు. నీళ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలు, ప్రాజెక్ట్‌లు ఇలా ప్రతి విషయంలో కాంగ్రెస్ చెప్తున్నవన్నీ అబద్ధాలేనన్నారు.

హామీల పేరుతో ఘరానా మోసం..!

‘‘పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా అందించలేదని అన్నారు. నిజాలు చూసుకుందాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం తన హాయంలో మొత్తం 6,47,479 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. 2021లో మీ నేత భట్టి విక్రమార్క.. రేషన్ కార్డులను పంపిణీ చేశారు, పొంగులేటి పంపిణీ చేశారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలోనే కాదా.. నా మైక్ లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు నాకు, మీ నేత రాజగోపాల్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అలాంటప్పుడు మేము రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని ఎలా చెప్తారు. మరి మా హయాంలో రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని చెప్తున్న రేవంత్.. చెంపదెబ్బకు సిద్ధమా?’’ అని ప్రశ్నించారు.

ధాన్యం ఉత్పత్తిని పెంచింది మేమే..!

‘‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తెలంగాణ రైతాంగానికి కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి.. రెండు పంటలకు రైతుభరోసా అందించలేదు. పైగా ఇప్పుడు వచ్చి సిగ్గులేకుండా అబద్ధాలు ఆడేస్తున్నారు. ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లాను దేశంలోనే నెంబర్ స్థానంలో ఉంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ధాన్యం ఉత్పత్తిని 3 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది కేసీఆర్ సర్కార్. నల్గొండలో యాదాద్రి పవర్ ప్లాంట్, 3 మెడికల్ కాలేజీ లు, యాద్రాది టెంపుల్‌ అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే జరిగాయి కదా. మరి సీఎంగా రేవంత్ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించారా? నల్లగొండ రైతులనే అడుగుదాం.. వారి చెంప దెబ్బలకు నేను సిద్ధంగా ఉన్నా. మరి సీఎం రేవంత్‌, మంత్రులు అందుకు సిద్ధమేనా?’’ అని జగదీష్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఒక్కరిని కూడా గెలవనియ్యనని చాలెంజ్‌ చేశారు.

తెలంగాణకు తీరని అన్యాయం..

‘‘నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. సోమవారం జరిగిన తుంగతుర్తి మీటింగ్ రేవంత్ పచ్చిఅబ్ధాలు మాట్లాడారు. పాలన చేతగాని రేవంత్ సర్కార్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం వల్లే కాంగ్రెస్‌కు రైతులు గుర్తుకొచ్చారు. అందుకే రైతు భరోసా విడుదల అని ప్రకటన చేసి తొమ్మిది రోజుల్లో రూ.9కోట్లు నగదు చేసినట్లు చెప్పుకుంటున్నారు. మీది ప్లాట్ల దందా.. కమిషన్ల దందా అని చెప్పారు. మాది నీళ్లు.. రైతు సంక్షేమ పంథా. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎక్కడైనా చర్చకు సిద్ధం. కాలవల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీరు పారుతోంది. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు స్క్రిప్ట్లను ఫాలో అవుతున్నారు. మీలాగా గురుదక్షిణగా కృష్ణా, గోదావరి జలాలను అప్పగించలేదు. కేసీఆర్‌కు పేరొస్తుందని కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారు. ఇప్పటికైనా పిచ్చిమాటలు మాట్లాడటం మానుకొని నిబద్ధతతో మాట్లాడలి’’ అని జగదీశ్ రెడ్డి హితవు పలికారు.

Tags:    

Similar News