మూడు కేసులే కేసీఆర్లో అరెస్టుభయాన్ని పెంచేస్తున్నాయా ?
క్యాబినెట్ భేటీ జరిగిన సమయంకన్నా బీఆర్ఎస్(BRS)నేతల సమావేశం ఎక్కువగసేపు జరగటం గమనార్హం;
బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలో ఇదే అనుమానం పెరిగిపోతోంది. కాళేశ్వరం అవినీతి, అక్రమకాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) రిపోర్టుపై చర్చించేందుకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)s అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇదేసమయంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్(KCR) తో కొందరు సీనియర్ నేతలు సమావేశమయ్యారు. క్యాబినెట్ భేటీ జరిగిన సమయంకన్నా బీఆర్ఎస్(BRS)నేతల సమావేశం ఎక్కువగసేపు జరగటం గమనార్హం. ఈసమావేశంలో నేతలతో కేసీఆర్ మాట్లాడుతు‘‘మనల్ని టార్గెట్ చేసినట్లుగా అర్ధమవుతోంది..కాళేశ్వరం(Kaleswaram Project) రిపోర్టు, ఈ కార్ ఫార్ముల రేసింగ్(Formula E Car Race) కేసు, ఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసుల్లో ఎప్పుడైనా కొందరి అరెస్టులుజరిగే అవకాశముంది’’ అన్నట్లుగా సమాచారం.
ఈవ్యాఖ్యలతోనే కేసీఆర్ లో అరెస్టుభయం పెరిగిపోతోందన్న విషయం అర్ధమవుతోంది. ఫార్ముల ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పాల్పడిన అవినీతిని పక్కనపెట్టేస్తే అధికారదుర్వినియోగం మాత్రం స్పష్టంగా బయటపడినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏకి చెందిన సుమారు రు. 45 కోట్లను బ్రిటన్ కంపెనీకి పౌండ్లలో బదిలీచేసినట్లు ఏసీబీ, ఈడీ ఇప్పటికే గుర్తించాయి. నిధుల బదిలీలో ఆర్ధికశాఖ, క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు. ఆర్బీఐ, కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి కూడా తీసుకోలేదన్న విషయం బయటపడింది. నిబంధనలను అతిక్రమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్బీఐ రు. 8 కోట్లు జరిమానా విధించింది. ఆర్బీఐ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. జరిమానా చెల్లించింది అంటేనే తప్పుచేసినట్లు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే లెక్క. తప్పు ఎందుకు జరిగింది ? ఎందుకంటే మంత్రి, కేసీఆర్ కొడుకు హోదాలో కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అమలుచేయటం వల్లే.
తాను అర్వింద్ కు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు కేటీఆర్ కూడా అంగీకరించారు. ఇక్కడే కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు బయటపడింది. తన చర్యలవల్ల తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్ల జరిమానా పడిందన్న విషయం తెలుస్తోంది. కాబట్టి మంత్రిహోదాలో కేటీఆర్ అధికారదుర్వినియోగానికి పాల్పడటం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అన్నది స్పష్టమవుతోంది. ఫార్ములా కేసునుండి అర్ధంతరంగా పక్కకు వెళ్ళిపోయిన గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ కు రు. 45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎందుకు వచ్చాయన్న కోణాన్ని ఏసీబీ, ఈడీ విచారిస్తున్నాయి. ఈ విచారణలో ఏమి బయటపడిందో తెలీదు. ఇప్పటికే రెండుసార్లు కేటీఆర్ ను విచారించిన ఏసీబీ తర్వాత స్టెప్ ఏమిటన్నది ఆసక్తిగా మారింది. నేతలతో సమావేశమైన కేసీఆర్ ఫార్ములా ఈ రేసులో అరెస్టులు ఉండవచ్చన్న ఆందోనను వ్యక్తంచేసినట్లు పార్టీవర్గాల సమాచారం.
టెలిఫోన్ ట్యాపింగ్ ను తీసుకుంటే ఇదో అరాచకమనే చెప్పాలి. 4200 మంది ఫోన్లను ట్యాప్ చేయించారంటేనే కేసీఆర్ లో అప్పట్లో ఓటమిభయం ఎంతగా పీడిచిందో అర్ధమైపోతోంది. ఫోన్లు ట్యాప్ చేయించి కాంగ్రెస్ అభ్యర్ధులు, నేతలను ఇబ్బందులకు గురిచేయకుండా ఉండుంటే 2018 ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఓడిపోయుండేదని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లు సత్యదూరం కాదనిపిస్తోంది. అప్పటి ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగును అస్త్రంగా వాడుకున్నారని రేవంత్, మంత్రులు పదేపదే ఆరోపిస్తున్నారు. ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారి అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ టీ ప్రభాకరరావు విచారణ జరుగుతోంది. మాజీబాస్ ట్యాపింగ్ సూత్రదారుల గురించి నోరిప్పితే అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. ఏదోరోజు ట్యాపింగ్ బండారం బయటపడక తప్పదనే టెన్షన్ కేసీఆర్, కేటీఆర్లో పెరిగిపోతున్నట్లుంది.
ఇక తాజా సంచలనం కాళేశ్వరం, మేడిగడ్డలో జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావే ప్రధాన కారకులని జస్టిస్ ఘోష్ తన నివేదికలో స్పష్టంగా ప్రస్తావించారని రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాళేశ్వరం, మేడిగడ్డలో అవినీతి, అక్రమాలు జరిగాయన్నది వాస్తవం. ఎలాగంటే మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు నీటివాడకానికి పనికిరావని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్) ఎప్పుడో చెప్పింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకులోని మూడు పిల్లర్లు కుంగిపోయి, డ్యాం ప్లాట్ ఫారమ్ చీలిపోయిన విషయం అందరి కళ్ళకు స్పష్టంగా కనబడుతోంది. తీసుకోవాల్సిన జగ్రత్తలు తీసుకోకుండా, నాసిరకం నిర్మాణాలు చేశారుకాబట్టే పిల్లర్లకు పగుళ్ళు, డ్యాం ప్లాట్ ఫారమ్ కు చీలికలు వచ్చేశాయి. దీంతోనే బ్యారేజీ నిర్మాణం ఎంతటి నాసిరకంగా నిర్మించారో అర్ధమైపోతోంది.
అందుకనే ఈ మొత్తానికి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావే కారణమని జస్టిస్ ఘోష్ రిపోర్టలో చెప్పింది. తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, కాళేశ్వరం, మేడిగడ్డ నిర్మాణం అద్భుతమని కేసీఆర్, మద్దతుదారులు ఎంతైనా చెప్పుకోవచ్చు. కాని వాస్తవంగా జరిగింది ఏమిటన్నది అందరికళ్ళకు స్పష్టంగా కనబడుతోంది. పై మూడు విచారణల్లో కామన్ పాయింట్ ఏమిటంటే మూడు కేసుల్లోను కీలకపాత్రదారి కేసీఆర్ మాత్రమే. ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల విచారణలో కేసీఆర్, హరీష్ కీలకమైతే, ఫార్ములా కేసు విచారణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రి హోదాలో కేటీఆర్ పాత్ర కీలకం. ఈ మూడుకేసుల్లో తాను, కేటీఆర్ తో పాటు హరీష్ కూడా అరెస్టయ్యే అవకాశముందనే ఆందోళన కేసీఆర్ లో పెరిగిపోతున్నట్లుంది.
ఎవరెవరు అరెస్టవుతారన్న విషయాన్ని బయటకు చెప్పకుండా పై మూడుకేసుల్లో ప్రభుత్వం మనల్ని టార్గెట్ చేసిందని అర్ధమవుతోందనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. ఈ కేసుల్లో కొందరిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చన్న మాట ఆందోళనలో నుండి వచ్చిందనే అనుకోవాలి. కేసీఆర్ అనుమానిస్తున్నట్లే అరెస్టులు జరిగితే అక్కడితే బీఆర్ఎస్ పని అయిపోయినట్లే అనుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆకర్షణశక్తి మీద మాత్రమే ఆధారపడి నడుస్తున్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆకర్షణ పనిచేయలేదు కాబట్టే బీఆర్ఎస్ ఓడిపోయింది. పార్టీ ఓటమే కాదు స్వయంగా కామారెడ్డిలో పోటీచేసిన కేసీఆరే ఓడిపోయారు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మరీ ఘోరంగా 17 సీట్లలో ఒక్కదానిలో కూడా గెలవలేక బోర్లాపడింది. ఆ తర్వాత జరిగిన కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది.
ఈమధ్యనే జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయటానికి పార్టీకి ధైర్యం సరిపోలేదు. కేసీఆర్ పనైపోయిందనే అనుమానంతోనే పదిమంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇపుడు కేసీఆర్ అనుమానిస్తున్నట్లు పై ముగ్గురి అరెస్టులు కూడా జరిగితే అంతే సంగతులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి తీహార్ జైలులో ఆరుమాసాలుండి బెయిల్ పై బయటకు వచ్చిన కవిత మళ్ళీ ఎప్పుడు జైలుకు వెళతారో తెలీటంలేదు. ఇదేజరిగితే పార్టీని సమర్ధవంతంగా నడిపించే దిక్కే ఉండదు. ఎప్పుడు ఏమి జరగాలన్నది రేవంత్ వ్యూహాలపైన ఆధారపడుంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.