బీర్ల ధర పెంపుపై మందుబాబుల ఆందోళన

మొన్నటి దాకా బ్రాండెడ్ బీర్ల కొరతతో అల్లాడిన మందుబాబులకు తెలంగాణ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. బీర్ల ధర పెంచనున్న నేపథ్యంలో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-08-07 08:21 GMT
తెలంగాణలో బీరు మరింత ప్రియం

మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో వచ్చే నెల నుంచి బీరు ధరలు 10 నుంచి 12 శాతం పెరగనుందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గత వేసవికాలంలో డిమాండుకు అనుగుణంగా బీరు సప్లయి చేయక పోవడంతో బీరుప్రియులు బీర్ల తీవ్ర కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఈ సారి బీర్ల ధరలు పెంచితే తాము ఆందోళన చేస్తామని మందుబాబుల సంఘం హెచ్చరించింది.


ధరలు పెంచాలని బ్రూవరీల డిమాండ్
బీర్ల తయారీలో నిర్వహణ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచాలని బ్రూవరీలు కోరుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన రూ.68 కోట్ల మేర బీరును కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు విక్రయిస్తోంది.12 బీర్ల కేసుకు బేవరేజెస్ కార్పొరేషన్ రూ.289 చెల్లిస్తోంది. పన్నులతో కలిపి 12 బీర్ల కేసు 1400 రూపాయలకు మద్యం వ్యాపారులకు కార్పొరేషన్ విక్రయిస్తుంది.

బీరు మరింత ప్రియం
మద్యం దుకాణాల వారు బీరు కేసును 1800రూపాయలకు విక్రయిస్తున్నారు.తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఒక్కో బీరును బ్రూవరీల నుంచి రూ.24.08 కి కోనుగోలు చేసి పన్నులు కలిపి రూ.116.66 కు మద్యం దుకాణాలకు విక్రయిస్తున్నారు. రిటైల్ మద్యం దుకాణాల వారు ఒక్కో బీరును 150 రూపాయలకు విక్రయిస్తున్నారు.12 శాతం ధరలు పెరిగితే ఒక్కో బీరు 180 నుంచి 200 రూపాయల దాకా పలకవచ్చని ఓ మద్యం షాపు యజమాని చెప్పారు.

ధరలు పెంచుతూ రెండేళ్ల ఒప్పందం
ఒక్క బీరు సగటున 150రూపాయలకు మందుబాబులకు లభిస్తోంది. సాధారణంగా ప్రతీ రెండేళ్లకు ఒకసారి బీరు ధరలను పెంచుతారు. చివరగా 2022వ సంవత్సరం మే నెలలో 6 శాతం మేర బీరు ధరలు పెంచారు. బీర్ల ధరలు 10 నుంచి 12 శాతం పెంచుతూ రెండేళ్ల పాటు అమలులో ఉండేలా బ్రూవరీలతో తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకోనుంది.

బీర్ల ధరలు పెంచితే ఆందోళన చేస్తాం : మందుబాబుల సంఘం హెచ్చరిక
గత వేసవి కాలంలో బ్రాండెడ్ బీర్ల కొరతతో తాము ఇబ్బందులు పడ్డామని, మళ్లీ బీర్ల ధరలను పెంచితే ఎలా అని మందుబాబుల సంఘం అధ్యక్షుడు తరుణ్ ప్రశ్నించారు. గతంలో వేసవిలో చల్లని బీర్ల కొరత తీర్చాలని తమ మందుబాబుల సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేశామని, ఇప్పుడు బీర్ల ధరలు పెంచితే సహించేది లేదని తరుణ్ చెప్పారు.బీర్ల ధరలు పెంచితే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.


Tags:    

Similar News