‘‘సృష్టి’’ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
రోజుకో మలుపు తిరుగుతున్న డాక్టర్ నమ్రత కేసు;
సికింద్రాబాద్ గోపాలపురం సృష్టి ఫెర్టిలిటీ హాస్పిటల్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సృష్టి బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. బ్యాంకు లావాదేవీలు జరపకుండా ఈ చర్యకు ఉపక్రమించారు. బ్యాంకు లావాదేవీల ద్వారా కేసు దర్యాప్తు మీద ప్రభావం ఉండే అవకాశాలు ఉండటంతో డాక్టర్ నమ్రతకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, హాస్పిటల్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల నగదు డిపాజిట్ అయిందని అధికారులు గుర్తించారు. సృష్టి కేసుతో సంబంధమున్న మరికొన్ని ఖాతాలను కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
సృష్టి కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ పెంచారు.దీంతో ఇన్వెస్టిగేషన్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్లు, ఏజెంట్లు ఉన్నారు. సృష్టి స్కాంలో మహిళా ఏజెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతపై ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్‌లోనే మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఆమెతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యుల్లతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డాక్టర్ విద్యుల్లత ప్రభుత్వ డాక్టర్ కావడంతో ఆమె పేరిట డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడేదని పోలీసులు గుర్తించారు.
సికింద్రాబాద్‌లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో గత కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారి నుంచి సరోగసి పేరిట మోసం చేసారని ఫిర్యాదులు రావడంతో గోపాలపురం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. సరోగసీ పేరిట రూ 30 నుంచి 40 లక్షల డబ్బులు తీసుకున్నారంటూ ఆమెపై ఫిర్యాదులు అందుతున్నాయి. తొలుత రాజస్థాన్ కు చెందిన దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. గత వారం కొత్తగా మరో నలుగురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన దంపతులు, హైదరాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు దంపతులతో బాటు ప్రవాస భారతీయ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపాలపురం పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. రాజస్థాన్ దంపతుల ఫిర్యాదుతో ఇది వరకు సృష్టిని ఆశ్రయించిన దంపతులకు డాక్టర్ నమ్రత ట్రీట్మెంట్ పై అనుమానాలు మొదలయ్యాయి. డాక్టర్ నమ్రత వద్ద ట్రీట్ మెంట్ తీసుకున్న బాధితులు డిఎన్ఎ పరీక్షలకు సిద్దమయ్యారు.ఎవరికో పుట్టిన బిడ్డను ట్రీట్ మెంట్ తీసుకుంటున్నదంపతులకు పుట్టిన బిడ్డ అని డాక్టర్ నమ్రత బుకాయించేది అని పోలీసులు తెలిపారు .దాంతో బాధితులు డిఎన్ఏ పరీక్షా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇలా డిఎన్ ఏ పరీక్షల్లో తేడాలు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్న బాధిత దంపతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తమకు ఇచ్చిన మెడికల్ రిపోర్టులను తీసుకొచ్చి బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.
ఇలా వచ్చిన వారిలోనే నల్గొండకు చెందిన దంపతులు ఉన్నారు. వారి నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత రూ. 44 లక్షల రూపాయలు వసూలు చేసిందనే ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ నమ్రత, అర్చన, సురేఖ, సదానందం, చెన్నారావుపై బిఎఎన్ఎస్ సెక్షన్ల క్రింద కేసు నమోదైంది.హైదరాబాద్‌కు చెందిన బాధితుల ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి పేరిట హార్మోన్ ఇంజక్షన్‌లు ఇచ్చినట్లు బాధితులు ఆరోపించారు. కొంత కాలం తర్వాత కల్యాణి ముఠా విశాఖకు పిలిచిపించుకుంది. స్పెర్మ్, అండాలను సేకరించింది.ఈ స్కాంలో సరోగసి పేరుతో రూ18 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రవాస భారతీయులను సైతం డాక్టర్ నమ్రత మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు గోపాలపురం పోలీసులకు ప్రవాస భారతీయ దంపతుల నుంచి ఫిర్యాదు అందింది. తమ నుంచి డాక్టర్ నమ్రత రూ 25 లక్షల రూపాయలు వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంతాన లేమి సమస్యతో వచ్చే దంపతుల్ని డాక్టర్ నమ్రత విశాఖలోని తమ సృష్టి ఆసుపత్రికి తీసుకెళ్లేదని పోలీసులు చెప్పారు. ‘‘సరోగసీ చేస్తున్నట్లు డ్రామా ఆడేవారు. వారి నుంచి అండాలు, వీర్యం తీసుకునేవారు’’ అని పోలీసులు తెలిపారు. ఏవేవో కారణాలు చెప్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు అని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు నిజాలను రాబట్టారు ఈ కస్టడీలో ఆమె నిజాలను ఒప్పుకున్నారు అని పోలీసులు తెలిపారు. ఐవిఎప్ కు వచ్చే దంపతులకు సరోగసీకి రెఫర్ చేసినట్లు తమ ఎదుట డాక్టర్ నమ్రత చెప్పారని వెల్లడించారు.
విశాఖ పట్నంలోని తమ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలున్నాయని డాక్టర్ నమ్రత తన దగ్గరికి వచ్చే వారిని నమ్మించేవారని పోలీసులు చెప్పారు. గర్భం దాల్చే మహిళా డోనర్ సిద్ధంగా ఉన్నారంటూ డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతులను తీసుకెళ్లేవారు అని పోలీసులు చెప్పారు. సికింద్రాబాద్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ గొల్లమండల చెన్నారావు ద్వారా ఆ దంపతుల అండాలు, వీర్యాన్ని సేకరించేవారు అని తెలిపారు. గాంధీ ప్రభుత్వాసుత్రి డాక్టర్ నర్గుల సదానందంతో బాధితులకు మత్తుమంతు ఇప్పించేవారని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ డాక్టర్లు కూడా ఈ స్కాంలో చిక్కుకోవడంతో కేసు తీవ్రత మరింత పెరిగింది.
పిల్లలు లేని దంపతుల నుంచి స్పెర్మ్ , అండాలు సేకరించిన అనంతరం కొంతకాలం తర్వాత డోనర్ గర్భం దాల్చిందని, మీ బిడ్డ డోనర్ కడుపులో పెరుగుతోందంటూ డాక్టర్ నమ్రత డబ్బులు ఎక్కువగా వసూలు చేసేవారు. డోనర్ పేరిట డాక్టర్ నమ్రత లక్షల రూపాయలు వసూలు చేసేవారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మహిళా ఏజెంట్ నందిని, సంజయ్ సాయంతో అస్సాంకు చెందిన మహిళల నుంచి పిల్లలను డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ పిల్లలను తీసుకొచ్చి సంతానం లేని దంపతులకు ఇచ్చేవారు అని పోలీసులు చెప్పారు. ఎవరికో పుట్టిన బిడ్డ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారికి పుట్టిన బిడ్డగా డాక్టర్ నమ్రత సంతానం లేని దంపతులకు చెప్పేవారని పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో బాధితులకు ముఖ్యమైన డాక్యుమెంట్ ఏవీ ఇవ్వకుండా జాగ్రత్తపడేవారని పోలీసులు తెలిపారు. ఈ విధంగా రాజస్థాన్‌కు చెందిన వారికి అస్సాం దంపతుల మగబిడ్డను ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. వారు డిఎన్ఏ పరీక్ష చేయించడంతో అసలు గుట్టు రట్టయ్యింది.