హైదరాబాద్ రియల్ హీరో...ఈ పోలీసు, ఏం చేశాడంటే...
క్లౌడ్ బరస్ట్ అయి కుండపోత వర్షం కురిసిన రాత్రి ఈ హెడ్ కానిస్టేబుల్ చేసిన సహాయం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.;
By : Saleem Shaik
Update: 2025-08-09 04:25 GMT
గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసిన వేళ జరిగిన హృదయ విదారక సంఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి...
- ఇదీ హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతం...తేదీ : ఆగస్టు 7వతేదీ గురువారం సమయం : సాయంత్రం 8.30 గంటలు...తన సోదరుడిని కలిసి ఇంటికి వెళ్లేందుకు ముఫకంజా ఇంజినీరింగ్ కళాశాల బస్ స్టాప్‌లో నైనికా అనే యువతి బస్సు కోసం వేచి ఉంది.
కన్నీరుమున్నీరుగా రోదించిన యువతి
అంతలో నగరంలో క్లౌడ్ బరస్ట్ తో అతి భారీ వర్షం కురిసింది. అలా పది సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతో నిమిషాల్లోనే బంజారాహిల్స్ బస్ స్టాపు వద్ద వరదనీరు పెద్ద ఎత్తున చేరింది. వరదనీటి మట్టం నడుం లోతు దాటి పెరుగుతుండటంతో నైనికా కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. హైదరాబాద్ నగరంలోని మెహిదీపట్నంకు చెందిన నైనికా అనే యువతి ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుతోంది. బంధువులు, స్నేహితులను కలవడానికి ఈమె హైదరాబాద్ వచ్చి వరదనీటిలో చిక్కుకుంది.
నడుంలోతు వరదనీటిలో చిక్కుకొని...
గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్(Hyderabad Police) శ్రీధర్ వర్మ తన తోటి పోలీసులతో కలిసి ఆ మార్గంలో పోలీసు పెట్రోలింగ్ కారులో వస్తుండగా,. అతనికి నైనికా ఏడుపు వినిపించింది. అంతే యువతి ఏడుపు విన్న శ్రీధర్ వర్మ ఆగి కారు దిగి నడుము లోతు నీటిలో ముఫకంజా కాలేజీ బస్ స్టాప్ వద్దకు చేరుకొని ఆమెకు తానున్నానంటూ ధైర్యం చెప్పారు.పోలీసు హెడ్ కానిస్టేబుల్ నైనికా తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు.
హెడ్ కానిస్టేబుల్ కు నైనికా కుటుంబసభ్యుల కృతజ్ఞతలు
నైనిక వరదనీటిలో చిక్కుకుందనే విషయాన్ని ఆమె తండ్రికి వివరించిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ ఆ తర్వాత ఆమెను రామంతపూర్‌లోని ఆమె అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లి రాత్రి 10:30 గంటలకు సురక్షితంగా వదిలేశారు.వరదలో చిక్కుకున్న నైనికాను సకాలంలో రక్షించినందుకు(Rescues Young Woman) ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వరదల్లో చిక్కుకున్న యువతి నైనికాను కాపాడి ఆమెను అమ్మమ్మ వద్దకు చేర్చిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ రియల్ హీరోగా నిలిచారు. ఆయనను పలువురు పోలీసు అధికారులు అభినందించారు.