కరీంనగర్ అడ్డాలో.. గెలుపెవరిది?
2009 లో కాంగ్రెస్, 2014 లో టిఆర్ఎస్, 2019 లో బిజేపికి వినూత్నమైన తీర్పును ఇచ్చిన కరీంనగర్ ఓటర్లు 2024 లో ఎటువైపు మొగ్గుచూపుతారోననే చర్చ నడుస్తున్నది.
By : The Federal
Update: 2024-03-05 09:33 GMT
జిఆర్ సంపత్ కుమార్
కరీంనగర్ పార్లమెంట్ స్థానాన్ని ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు. ఏపార్టీకి జైకొట్టబోతున్నారు. బిజేపి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా.. 2009 లో కాంగ్రెస్, 2014 లో టిఆర్ఎస్, 2019 లో బిజేపికి వినూత్నమైన తీర్పును ఇచ్చిన కరీంనగర్ ఓటర్లు 2024 లో ఎటువైపు మొగ్గుచూపుతారోననే చర్చ నడుస్తున్నది. 2019లో అనూహ్యంగా బిజేపి విజయం సాదించినా.. ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ ఇచ్చారో చూద్దాం.
1952 లో ఏర్పడిన కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గంలో ప్రస్తుతం 11లక్షల47వేల697 మంది ఓటర్లు వున్నారు. గత 2019 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ కుమార్, బిజేపి నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ బరిలో నిలిచారు. ఇక్కడ అనూహ్యంగా 89వేల 508 ఓట్ల మెజారిటీతో బిజేపి అభ్యర్ది బండి సంజయ్ విజయం సాదించారు. బిజేపికి 4లక్షల98వేల 276 ఓట్లు రాగా, టిఆర్ఎస్ కు 4 లక్షల 8వేల 768 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 1లక్షా79 వేల 258 ఓట్లు వచ్చాయి. ఆప్పటి పరిస్థితి ఇలావుంటే, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 అంసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజక వర్గాలుండగా, 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో బిఆర్ఎస్ విజయం సాదించగా బిజేపి మాత్రం ఏఒక్క నియోజక వర్గంలో విజయం సాదించలేక పోయింది. ఆ ఏడు నియోజక వర్గాల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 5 లక్షల 12 వేల 352, బిఆర్ఎస్ కు 5 లక్షల 17 వేల 601, బిజేపికి 2 లక్షల 50 వేల 400 ఓట్లు వచ్చాయి. ఈపరిస్థితిని బట్టి చూస్తే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్య ఓట్ల తేడా 5 వేల 249 గా కనిపిస్తున్నది. అదీకూడా బిఆర్ఎస్ దే పైచేయిగా కనిపిస్తున్నది.
అసెంబ్లీ -2023 | బీఆర్ఎస్ | బీజేపీ | కాంగ్రెస్ | విజేత | పార్టీ |
కరీంనగర్ | 92,179 | 89,016 | 40,057 | కమలాకర్ | బీఆర్ఎస్ |
చొప్పదండి | 52,956 | 26,669 | 90,395 | మేడిపల్లి సత్యం | కాంగ్రెస్ |
వేములవాడ | 56,870 | 29,710 | 71,451 | ఆది శ్రీనివాస్ | కాంగ్రెస్ |
సిరిసిల్ల | 89,244 | 18,328 | 59,557 | కేటిఆర్ | బీఆర్ఎస్ |
మానకొండూర్ | 64,408 | 14,879 | 96,773 | కవ్వంపల్లి సత్యం | కాంగ్రెస్ |
హుజూరాబాద్ | 80,333 | 63,460 | 53,164 | కౌషిక్ రెడ్డి | బీఆర్ఎస్ |
హుస్నాబాద్ | 81,611 | 8,338 | 1,00,955 | పొన్నం ప్రభాకర్ | కాంగ్రెస్ |
PARTY WISE VOTES | 5,17,601 | 2,50,400 | 5,12,352 | బీఆర్ఎస్-3, బీజేపీ-0, కాంగ్రెస్-4 | బిఆర్ఎస్‌కు 5,249 ఎడ్జ్ |
నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాదించినా మొత్తం ఓట్లలో బిఆర్ఎస్ ను బీట్ చెయ్యలేకపోయింది. 2019 ఎన్నికల్లో బిజేపి 89 వేల మెజారిటీతో గెలుపొందినా, అంసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆస్థాయిలో ఓట్లు రాబట్టలేక పోయింది. ప్రస్తుతం కూడా బిజేపి సిట్టింగ్ ఎంపిగా వున్న బండి సంజయ్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. మరోవైపు బిఆర్ఎస్ సైతం బోయినపల్లి వినోద్ కుమార్ ను అభ్యర్దిగా ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. ఏదిఏమైనా కరీంనగర్ ప్రజలు దీన్ని బట్టి చూస్తే ఎప్పటికప్పుడు వినూత్నమైన తీర్పును ఇస్తారని అర్దం చేసుకోవచ్చు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారో వేచిచూద్దాం.