దీపావళి వేడుకల్లో అపశృతి.. ఆసుపత్రులకు క్యూ కట్టిన బాధితులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీపావళి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. వీటిలో భాగంగానే ప్రమాదాలు జరిగాయి. 50 మందికి గాయాలు కావడంతో ఆసుపత్రికి క్యూలు కట్టారు.

Update: 2024-11-01 09:01 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీపావళి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడ చూసిన కిటకిటలాడుతున్న బాణాసంచా దుకాణాలే దర్శనమిచ్చాయి. సాయంత్రం 5 గంటలకే టపాసుల మోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది దీపావళి ధూమ్ ధామ్‌గా జరిగింది. పిల్లలు నుంచి వృద్దుల వరకు అందరూ కూడా సంతోషంగా దీపావళి వేడుకలను జరుపుకున్నారు. కానీ పలు ప్రాంతాల్లో అంతా అనుకున్నట్లే ప్రమాదాలు కూడా జరిగాయి.

కొన్న ఘటనల్లో టపాసులు చేతుల్లోనే పేలితే.. మరికొన్ని ఘటనల్లో పేలకూడని పటాకులు కూడా పేలడం జరిగింది. ఇలాంటి జరిగే ప్రమాదం ఉందనే అధికారులు ప్రజలకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. టపాసులు కాల్చే సమయంలో కనీస జాగ్రత్తలు కూడా పాటించకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 31న పండగ సందర్శంగా వందల సంఖ్యలోనే ప్రజలకు గాయపడ్డారని అధికారులు చెప్తున్నారు. ఒక్క సరోజిని దేవి కంటి ఆసుపత్రికే దాదాపు 50 మంది బాధితులు క్యూ కట్టారని, వారిలో కొందరికి కంటికి గాయాలు అయితే మరికొందరికి కాళ్లు చేతులు కాలాయని అక్కడి వైద్యులు వివరించారు.

పలువురికి సీరియస్

తమ ఆసుపత్రికి 50 మంది బాధితులు గాయాలతో వచ్చారని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. వారందరికీ ప్రథమ చికిత్స అందించామని, వారిలో 34 మందికి స్వల్ప గాయాలు కాగా 9 మందికి మాత్రం సీరియస్‌గా ఉందని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. వారందరికీ కావాల్సిన వైద్యం అందిస్తున్నామని, క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించడం కోసం ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. బాధితులకు సంబంధించి మరిన్ని విషయాలను సరోజిని దేవి ఆసుపత్రి వైద్యురాలు సౌమ్య వెల్లడించారు.

డాక్టర్ ఏం చెప్పారంటే

‘‘దీపావళి టపాకులు కాలుస్తండగా గాయపడ్డామంటూ 50 మంది ఈ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. వారిలో తొమ్మిది మందిని అడ్మిట్ చేసుకున్నాం. వారిని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వీరంతా కూడా నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు వచ్చిన వారే. 34 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం గాయపడిన వారిలో 35 మంది చిన్నారులు ఉండగా 15 మంది పెద్దలు ఉన్నారు. గతేడాదితో పోలిస్తే దీపావళి క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. గతేడాది 72 మంది చికిత్స కోసం వచ్చారు. ఆ సంఖ్య ఈ ఏడాది 50 మందికే పరిమితం అయింది. ప్రజల్లో అవగాహన పెరగడమే ఈ తగ్గుదలకు కారణం’’ అని డాక్టర్ సౌమ్య వివరించారు.

Tags:    

Similar News