మైనర్ బాలికపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరి శిక్ష
నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు;
నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికపై రేప్ చేసి తర్వాత హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఉరిశిక్షతో బాటు నిందితుడు లక్షా పదివేల రూపాయల జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది.బాధితురాలికి న్యాయం చేకూరేలా నల్గొండ పోక్సో కోర్టు తీర్పునిచ్చినట్లు కుటుంబసభ్యులు హర్షం వెలిబుచ్చారు.
కేసు వివరాలు
2013లో నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముక్రమ్ అనే వ్యక్తి మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేప్ చేశాడు. రేప్ చేసిన అనంతరం మైనర్ బాలికను హత్య చేసి స్థానిక నాలాలో పడేశాడు. తొలుత మిస్సింగ్ కేసు నమోదైనప్పటికీ మైనర్ బాలిక మృత దేహం నాలాలో దొరకడంతో హత్య కేసుగా నమోదైంది. మైనర్ బాలికను హత్య చేసిన నిందితులను గాలిస్తుండగా పోలీసులకు క్లూ దొరికింది. ముక్రమ్ హత్య చేసినట్లు పోలీసులు సాక్ష్యాలను సేకరించారు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత నిందితుడిపై కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేశారు.
పదేళ్ల క్రితం కేసు నమోదైనప్పటికీ వాద ప్రతివాదనలు ముగియగానే పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి గురువారం సంచలన తీర్పు చెప్పారు. న్యాయ వ్యవస్థపై నమ్మకంతో తాము పదేళ్ల పాటు పోరాటం చేసి విజయం సాధించామని కుటుంబ సభ్యులు హర్షం వెలిబుచ్చారు.