BC reservations | బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలోనే చట్టం ?
రెండుసార్లు తీర్మానాలు చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి(President Of India) పంపినా, ఆర్డినెన్స్ అమలుకు గవర్నర్ కు పంపినా ఉపయోగం కనబడలేదు;
స్ధానికసంస్ధలఎన్నికల్లో 42శాతం బీసీల రిజర్వేషన్లపై ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం అసెంబ్లీలోనే చట్టం చేయటానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు(BC Reservations) అమలుచేసే బిల్లులకు అసెంబ్లీ(Telangana Assembly)లో జరిగింది తీర్మానం మాత్రమే. రెండుసార్లు తీర్మానాలు చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి(President Of India) పంపినా, ఆర్డినెన్స్ అమలుకు గవర్నర్ కు పంపినా ఉపయోగం కనబడలేదు. ఒకవైపు ఎన్నికలు నిర్వహించాల్సిన సెప్టెంబర్ 30వ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది. మరోవైపు రిజర్వేషన్ల అంశంపై రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు అడుగుకూడా ముందుకు పడలేదు. దాంతో మరోసారి రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
ఈసారి అసెంబ్లీలో తీర్మానం కోసం ప్రవేశపెట్టే బిల్లు పాస్ అవగానే వెంటనే జీవో ఇచ్చేసి చట్టంచేసి రిజర్వేషన్లు అమలుచేయాలనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. అయితే రిజర్వేషన్లను పెంచేందుకు ప్రభుత్వం స్ధాయిలో తీసుకునే నిర్ణయం ఎంతవరకు చెల్లుబాటు అవుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సాంకేతికంగా చూస్తే రిజర్వేషన్లు పెంచేవిషయంలో ప్రభుత్వంతీసుకునే నిర్ణయాలు, చట్టాలు చెల్లుబాటు కావు. ప్రభుత్వనిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో చాలెంజ్ చేస్తే వెంటనే సదరు ఉత్తర్వులను కోర్టులు కొట్టేస్ధాయి.
ఇప్పటికి రెండుసార్లు రిజర్వేషన్లపెంపు నిర్ణయంపై అసెంబ్లీలో తీర్మానం చేసినవిషయం తెలిసిందే. మొదటిసారి తీర్మానాన్ని గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపితే ఆ బిల్లు ఢిల్లీలో పెండింగులో ఉండిపోయింది. దాంతో లాభంలేదని అర్ధమైన తర్వాత రేవంత్ ప్రభుత్వం రెండోసారి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానంచేసి ఆర్డినెన్సు చేసింది. ఆర్డినెన్సు ఆమోదం కోసం గవర్నర్ కు పంపితే దాన్ని కూడా గవర్నర్ పరిశీలన నిమ్మితం కేంద్ర హోంశాఖకు పంపారు. ఆర్డినెన్స్ కూడా పెండింగులోనే పడిపోయింది. దాంతో రెండుసార్లు ప్రభుత్వ ప్రయత్నాలు విఫలమైపోయాయి.
తొందరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా బీసీల ఓట్లతో లాభపడేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగమే బిల్లు, ఆర్డినెన్స్ తొందరలో చట్టం అని అంటున్నారు. నిజానికి రేవంత్ చేసిన లేదా చేయబోయే ఏ ప్రయత్నం కూడా న్యాయసమీక్షలో నిలబడదని అందరికీ బాగా తెలుసు. అందుకనే మొదట్లో బీసీలకు స్ధానికసంస్ధల్లో 42 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలుచేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనతో ఆగితే బాగానే ఉండేది. రేవంత్ పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్ అమలుచేస్తామంటే బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు 45 శాతం టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ అయితే ఇప్పటివరకు అసలు నోరే విప్పలేదు. కాబట్టి ఏమిచేస్తుందో తెలీదు.
17న పీఏసీ సమావేశం
ఈనెల 17వ తేదీన పీఏసీ(పొలిటికల్ అఫైర్స్ కమిటి) సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయమని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను రేవంత్ ఆదేశించారు. పీఏసీలో బీసీల రిజర్వేషన్ అంశమే కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే అసెంబ్లీసమవేశాలు ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం కూడా తీసుకుంటారు. ఆగష్టు నెలలో కాని లేదా సెప్టెంబర్ మొదటివారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వర్షాకాల సమావేశాల్లోనే బీసీలకు రిజర్వేషన్ బిల్లును మూడోసారి ప్రవేశపెట్టి తీర్మానంచేసి చట్టం తీసుకురావాలన్నది రేవంత్ ఆలోచనగా కనబడుతోంది.
గవర్నర్ సంతకం లేకపోతే ?
అసెంబ్లీలో ఆర్డినెన్స్ అయినా, చట్టం చేసినా దానికి గవర్నర్ సంతకం తప్పదు. ఇప్పటికి రెండుసార్లు తీర్మానం చేసినా, ఒకసారి ఆర్డినెన్స్ పంపినా గవర్నర్ సంతకం పెట్టలేదు. మూడోసారి అసెంబ్లీలో తీర్మానం, ఆర్డినెన్స్ కాకుండా చట్టంచేసినా దానికి గవర్నర్ ఆమోదం కావాల్సిందే. గవర్నర్ ఆమోదంతో సంతకం లేకపోతే ఏ చట్టం కూడా చెల్లుబాటు కాదు. అసెంబ్లీలో చట్టంచేస్తే గవర్నర్ దగ్గరకు వెళ్ళినపుడు సంతకం చేయకపోతే ఏమవుతుంది ? చూడాలి.
ప్రభుత్వ నిర్ణయం నిలబడదు: చిరంజీవులు
అసెంబ్లీ ద్వారా బీసీ రిజర్వేషన్లకు చట్టంచేసినా న్యాయసమీక్షలో నిలబడదని బీసీ మేథావుల ఫోరం అధ్యక్షుడు తొగరాల చిరంజీవులు చెప్పారు. చిరంజీవులు ‘తెలంగాణ ఫెడరల్’ తో మాట్లాడుతు ‘‘రిజర్వేషన్ల అమలుకు రేవంత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడకుండా బయట ఎన్నిసార్లు మాట్లాడినా ఉపయోగం ఉండదు’’ అన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్ల సమస్యపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టడంలేద’’ని రేవంత్ ను ప్రశ్నించారు. ‘‘ముస్లింలను చేర్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చేదిలేదన్న బీజేపీ షరతుకు అర్ధంలేద’’న్నారు. ‘‘ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు ఇపుడు కొత్తగా కల్పించటం కాదని ఎప్పటినుండో అమల్లో ఉంద’’ని చెప్పారు. ‘‘బీసీలకు రిజర్వేషన్లను పెంచుతు ప్రభుత్వాలు చేసే చట్టాలను కోర్టులు కొట్టేస్తాయ’’ని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అములుచేస్తు పది రాష్ట్రాల్లో చేసిన చట్టాలను కోర్టులు కొట్టేసిన విషయాన్ని చిరంజీవులు గుర్తుచేశారు.