హాఫ్ నెలాడ్జ్..నిల్ నాలెడ్జ్ ఇది అసెంబ్లీ సమావేశాల తీరు

అసెంబ్లీ సమావేశాలంటే ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపేవని జనాలు అనుంటే అంతకుమించిన పొరబాటు ఇంకోటుండదు.

Update: 2024-07-27 09:13 GMT
Telanganaa assembly

అసెంబ్లీ సమావేశాలంటే ప్రజాసమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపేవని జనాలు అనుంటే అంతకుమించిన పొరబాటు ఇంకోటుండదు. ఎందుకంటే సమస్యలపైన చర్చ, వాటికి పరిష్కారాలను చూపటం, వాటిని అమలుచేయటం అన్నది చాలా అరుదుగా జరుగుతుంటాయి. మరి సమావేశాల్లో ఏమి జరుగుతాయంటే ఒక్కళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటమే. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు హరీష్ రావుకు మధ్య సభలో చాలా ఘాటుగా సంవాదం జరిగింది.

అందులో మంత్రిని ఉద్దేశించి హరీష్ ‘మంత్రికి ఏమీ తెల్వదు సార్..ఆయనది హాఫ్ నాలెడ్జ్’ అన్నారు. వెంటనే కోమటిరెడ్డి సమాధానమిస్తు ‘హరీష్ కు నిల్ నాలెడ్జ్, ఆయనొక డమ్మీ మంత్రిగా పనిచేశారు’ అంటు గట్టిగా రిప్లై ఇచ్చారు. మంత్రికి హాఫ్ నాలెడ్జ్, సీనియర్ సభ్యుడు హరీష్ కు నిల్ నాలెడ్జ్ అయితే మరి ఫుల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎవరు ? సభలో ఎవరికైనా ఫుల్ నాలెడ్జి ఉందా అని జనాలకు సందేహాలు పెరిగిపోవటం ఖాయం. సభలో సమావేశాలు ఎలాగ జరుగుతన్నాయని చెప్పుకునేందుకు పైన చెప్పింది ఒక ఉదాహరణ మాత్రమే. సభ మొదలవ్వటం ఆలస్యం అధికారపార్టీని ఇరుకునపెట్టడానికి ప్రతిపక్ష సభ్యులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అనవసరమైన చర్చనంతా లేవనెత్తుతున్నారు. ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేసేస్తున్నారు. ఆధారాలు చూపమంటే సరైన సమయంలో ఆధారాలను బయటపెడతానని మరింత రెచ్చగొడుతున్నారు.

కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు అన్యాయం జరిగిందని రేవంత్, కేటీయార్ మాట్లాడుతుంటే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి రేవంత్ పై ఆరోపణలు చేయటం ఆశ్చర్యమేసింది. ఇంతకీ ఏలేటి ఆరోపణ ఏమిటంటే మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధికి కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వలేదంటే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం కోట్లరూపాయలను దోచుకునేందుకు ప్లన్ చేసిందట. రేవంత్ ప్రభుత్వం కోట్లరూపాయలను దోచుకునేందుకు ప్లాన్ చేసింది కాబట్టే మూసీ రివర్ ఫ్రంట్ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని ఏలేటి అనటం ఎంతవరకు సబబో ఆయనే చెప్పాలి. సభలో చాలావరకు ఇలాంటి గోలే జరగుతుంటుంది. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ప్రతిపక్షాల సభ్యులు ప్రయత్నిస్తుంటారు. ప్రతిపక్ష సభ్యులను అడ్డుకుంటు అధికారపక్ష సభ్యులు ఎదురుదాడులు చేస్తుంటారు. మొత్తం సభంతా ఇలాగే సాగిపోతుంటుంది.

అసెంబ్లీ సమావేశాల పేరుతో విలువైన కాలంతో పాటు ప్రజాధనం కూడా వృథా అవుతోంది. ఒకళ్ళని ఇరికించేందుకు మరొకళ్ళు, ఇంకోళ్ళని చులకనచేసేందుకు మరొకళ్ళు ప్రయత్నించటంలో ఎవరిది పైచేయో తేల్చుకోవటంలో భాగంగానే సభ్యుల్లో చాలామంది నోటికొచ్చినట్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అందుకనే సభా కార్యక్రమాలను చూసే జనాలు తగ్గిపోతున్నారు. సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరిగటం, సమస్యలపై చర్చించి పరిష్కారాలను కనుక్కోవటం అన్నది ఎప్పుడో కాని జరగటంలేదు. అందుకనే సభా కార్యక్రమాలు చూడటంపై జనాల్లో ఆసక్తి తగ్గిపోతోంది. ఈ విషయాలను అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎప్పుడు గుర్తిస్తారో ఏమో.

Tags:    

Similar News